Devotional

తరగని శుభాలిచ్చే పర్వం – TNI ఆధ్యాత్మికం

తరగని శుభాలిచ్చే పర్వం  – TNI ఆధ్యాత్మికం

1. వైశాఖ శుద్ధ తదియ…. అక్షయ తృతీయ. ఇది మహిమాన్వితమైన పర్వదినం. మన సంకల్పాలన్నిటినీ ‘అక్షయం’గా అంటే తరిగిపోనివిగా చేసే శుభదినం. అక్షయ తృతీయ ప్రత్యేకతను భవిష్య, శివ పురాణాలు శ్లాఘించాయి. ప్రతి యుగం ఒక్కొక్క పవిత్రమైన రోజున ప్రారంభమైనట్టు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కృతయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమినాడు, ద్వాపర యుగం భాద్రపద బహుళ త్రయోదశి నాడు, కలియుగం మాఘ బహుళ అమావాస్య నాడు ఆరంభమయ్యాయని పేర్కొంటోంది. అక్షయ తృతీయ పర్వాన్ని కృతయుగం నాటి నుంచే జరుపుకొంటున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆ యుగంలో ధర్మదేవత నాలుగు పాదాల మీద నడిచిందనీ, జన బాహుళ్యం సకల సౌభాగ్యాలనూ అక్షయంగా అనుభవించారనీ పురాణ కథలు పేర్కొంటున్నాయి.
*సింహగిరిపై చందనస్వామిగా…
అక్షయ తృతీయ ప్రాముఖ్యతను భాగవత పురాణం వివరించింది. అది ప్రహ్లాద చరిత్రకు సంబంధించినది. ప్రహ్లాదవరదుడైన శ్రీ వరాహ లక్ష్మీ నారసింహుడు ఎంతో కాలం పాటు సింహాచల క్షేత్రంలో పూజలు అందుకున్నాడు. ఆ తరువాత ఆరాధనలు లేక… విగ్రహాలు పుట్టలలో కనుమరుగైపోయాయి. తదనంతర కాలంలో షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు వ్యాహ్యాళికి వెళుతున్న సమయంలో అతని రథం వినువీధిలో ఆగిపోయింది. కారణం తెలుసుకున్న చక్రవర్తి… సింహగిరి మీద ఉన్న పుట్టను తొలగించి, అర్చా మూర్తులను అభిషేకించి, ఆలయం నిర్మించాడు. పురూరవుడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీహరి అక్షయ తృతీయ రోజున అతడికి దర్శనం ఇచ్చి…. ‘‘ఈ ఒక్క రోజునే నా నిజరూప దర్శనం లభిస్తుంది. అర్చామూర్తుల చుట్టూ తొలగించిన పుట్టమన్ను ఎంత బరువు ఉందో… అంత బరువున్న చందనాన్ని ఏడాదిలో మిగిలిన కాలమంతా నా విగ్రహానికి పూయాలి’’ అని ఆదేశించాడు. ఆ పుట్ట మన్ను బరువు పన్నెండు మణుగులు. కాలక్రమంగా ఈ పద్ధతిలో కొంత మార్పు జరిగింది. అక్షయ తృతీయ, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో… మూడేసి మణుగుల బరువున్న చందనాన్ని పూస్తారు. ఈ కారణంగా సింహాచలాధీశుడు ఏడాదంతా చందనం పూతలో ఉంటాడు. భారతదేశంలోని సుప్రసిద్ధమైన 32 నారసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. అక్షయ తృతీయ రోజున ఇక్కడ చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజున నారసింహుని నిజరూప దర్శనానికి దేశమంతటి నుంచీ భక్తులు విచ్చేస్తారు. స్వామిను దర్శించుకొని, అక్షయమైన అనుగ్రహాన్ని పొందుతారు.
*రథాలకు అంకురార్పణ…
నీల మాధవుడే సింహాచలాధీశుడనీ, అతడే పూరీలో జగన్నాథుడిగా ప్రభవించాడనీ ఒడిశా వాసుల విశ్వాసం. పూరీ క్షేత్రంలో ఆషాఢ శుద్ధ విదియ రోజున రథోత్సవం జరుగుతుంది. ఆలయంలోని మూలవిరాట్టులైన జగన్నాథ, సుభద్ర, బలభద్రుల కోసం… మూడు వేర్వేరు రథాలను నిర్మించడానికి అంకురార్పణ అక్షయ తృతీయనాడు జరుగుతుంది. రథోత్సవం నాటికి రథాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారు.
లక్ష్మీ ఆరాధన…అక్షయ తృతీయ నాడు నిర్వహించాల్సిన విధులను కూడా శాస్త్రాలు నిర్దేశించాయి. దీని ప్రకారం.. వేకువ జామునే సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే.. పాపాలన్నీ క్షయమై, అక్షయమైన సత్ఫలాలు లభిస్తాయి. ఈ రోజున వారం, వర్జ్యంతో నిమిత్తం లేకుండా… ఏ శుభకార్యం ప్రారంభించినా… అనంత మైన ప్రతిఫలాలను అందుకుంటారనీ చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి… ఉదకదానం, విసనకర్ర, గొడుగు, పాదరక్షలు లాంటివి దానం చెయ్యాలి. వసంత ఋతువులో వైశాఖమాసం మాధవ మాసం. ‘మా’ అంటే లక్ష్మీదేవి. మాధవుడికి ప్రియమైనది. కాబట్టి లక్ష్మీ ప్రతిమను లేదా రూపును పూజిస్తే శుభం జరుగుతుందంటారు. అందుకే అక్షయ తృతీయ నాడు చిన్నమెత్తైనా బంగారాన్ని కొనడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ. ఇప్పుడది దేశమంతటా వ్యాపించింది.

2. రామేశ్వరం నమూనాతో దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌
రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్లను నిర్దేశిత గడువులోగాపూర్తి చేయాలని అధికారులను మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. మొదటి దశలో ఆలయాల మాస్టర్‌ ప్లాన్‌ను జూన్‌ లోగారెండో విడతలోఆలయాల మాస్టర్‌ ప్లాన్‌ను ఆగస్టు చివరికి పూర్తి చేయాలని గడువు విధించారు. గురువారం విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో దేవాలయాల మాస్టర్‌ ప్లాన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు మెరుగయ్యేలా వాస్తు ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు రామేశ్వరం మాస్టర్‌ ప్లాన్‌ను నమూనాగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత భవనం ఏడో అంతస్తులో భక్తుల విశ్రాంతికి అవకాశం కల్పించాలనిగుడికి వచ్చే భక్తులంతా ఒకే మార్గంలో మహాద్వారం ద్వారా మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

3. కనకదుర్గమ్మ హుండీల సంప్రోక్షణ
జగన్మాత కనకదుర్గ ఆలయంలో ప్రముఖ సినీహీరో రామ్‌చరణ్‌ అభిమానుల అత్యుత్యాహం వల్ల అపవిత్రమైన హుండీలను దేవస్థానం అధికారులు గురువారం శుభ్రం చేయించి.. వేదపండితులుఅర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేయించారు. రామ్‌చరణ్‌ బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు పాదరక్షలతో సహా ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా.. భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించే పవిత్రమైన హుండీలపైకి ఎక్కి మూలవిరాట్‌ ఫోటోలువీడియోలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. హుండీలను శాస్త్రోక్తంగా శుభ్రం చేయించి సంప్రోక్షణ చేయించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయంలో అత్యుత్సాహంతో ప్రదర్శించిన అభిమానుల తీరును తీవ్రమైన చర్యగా పరిగణిస్తూ.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ గురువారం ప్రకటించారు.

4. తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమందిరానికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమంది రం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు

5. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.ఆ తరువాత అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, డిప్యూటీ ఈవోలు రమేశ్‌ బాబు, కస్తూరిబాయి అధికారులు పాల్గొన్నారు