NRI-NRT

ఆపదలో ఉన్న ప్రవాసీలకు జి.డబ్ల్యూ.ఏ.సి. అపన్నహస్తం!

ఆపదలో ఉన్న ప్రవాసీలకు జి.డబ్ల్యూ.ఏ.సి. అపన్నహస్తం!

అక్షరాస్యత లేమి, భాష సమస్య.. దీనికి తోడుగా ఆత్మీయంగా పలకరించే వారు లేక ఎడారి దేశాలలో కష్టాల కూడలిలో నిస్సహాయంగా మిగిలిపోతున్న తెలంగాణ ప్రవాసీలకు జి.డబ్ల్యూ.ఎ.సి అనే ప్రవాసీయుల సంస్ధ అపన్నహస్తం అందిస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, కువైత్, ఖతర్, ఒమాన్ దేశాలలో దీని సభ్యులు తమ తమ ప్రాంతాలలో జరిగె మరణాల గూర్చి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోని ఆయా మృతదేహాలను మాతృభూమికు పంపించడానికి కృషి చేస్తున్నారు. చిన్న చితకా పనులు చేసే వీరిలో అత్యధికులకు ఆంగ్లం లేదా అరబ్బి భాషలతో పరిచయం లేదు. తెలుగు రాయడం కూడా అంతంత మాత్రమే అయినప్పటికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వీరికి భాష గానీ ఉత్తరప్రత్యుత్తరాలు గానీ ఎప్పుడు సమస్య కాలేదు. వీలయిన విధంగా మృతదేహాల తరలింపుకు అవసరమైన ప్రక్రియను వీరు పూర్తి చేస్తూ బాధాతప్త కుటుంబాల మన్నలను పొందుతున్నారు.

ఇతర సంఘాల తరహా అర్భాట కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించకుండా, ప్రచారం కొరకు కాకుండా సేవా దృక్ఫథంతో వీరు తమ పనులు చేస్తున్నారు. వాట్సప్, ఫెస్‌బుక్ ఆధారంగా పని చేసే జి.డబ్ల్యూ.ఏ.సి సభ్యులు తమ కేసుల గురించి బయటకు ఏమాత్రం పొక్కకుండా జాగ్రత్త చర్యలు తీసుకొంటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన దుబ్బా రాజం సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో నెల క్రితం మరణించగా.. పరాయి దేశంలో తమకు ఎవరు సాయంచేస్తారంటూ మృతుడి కుటుంబం విలవిలాడిపోయింది. ఈ క్రమంలో.. మేమున్నామంటూ జి.డబ్ల్యూ.ఏ.సి సభ్యులు చిన్నయ్య, రఫీక్, జాడి మల్లేశం ముందుకు వచ్చి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి, మృతదేహాన్ని హైద్రాబాద్ నుండి స్వస్ధలానికి పంపించడానికి ఉచిత అంబులెన్సును కూడా ఏర్పాటు చేసారు.

అదే విధంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన గట్ల నారాయాణ గుండేపోటుతో మరణించగా అతని మృతదేహాన్ని కూడా స్వస్ధలానికి కొట్టూరు రవి, తలరి రమేశ్, గోనేపల్లి శ్రీనివాస్‌ల సహాయంతో పంపించారు. ప్రతి నెల తాము నాలుగు నుండి అయిదు మృతదేహాలను ఒక్క సౌదీ నుండి పంపిస్తున్నట్లుగా రఫీక్, చిన్నయ్యలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ప్రవాసీయుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించాలనే డిమాండ్‌తో తమ నాయకుడు దోనికేని కృష్ణ పాదయాత్ర చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ తమ డిమాండ్‌ను పునరుద్ఘటించారు.