Movies

సముద్రతీరమూ.. సోనాక్షి సిన్హా!

సముద్రతీరమూ.. సోనాక్షి సిన్హా!

బరువు ఎక్కువ ఉందని ఒకప్పుడు బాడీ షేమింగ్‌కు గురైంది. ఎంతో మానసిక వేదన అనుభవించింది. ఒత్తిడికి గురైంది. అయితే పట్టుదలతో బరువు తగ్గి.. నటనతో విమర్శలను చిత్తు చేసిన బ్రేవ్‌గాళ్‌ ‘సోనాక్షి సిన్హా’. సినిమా ఫ్యామిలీనుంచి వచ్చినా ఆ నీడలో బతక్కుండా తనకంటూ ఓ పేరును సంపాదించుకుంది. పన్నెండేళ్లనుంచీ బాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ కథానాయికగా దూసుకుపోతోంది. ఈ కథానాయిక అభిరుచులు, ఆసక్తుల గురించి..

‘‘కథానాయికగా అంటే డీఫాల్ట్‌గా ఇలానే ఉండాలనుకుంటారు. అందుకే నా ఓవర్‌వెయిట్‌ మీద ఓ యుద్ధమే చేశా. చివరికి శరీర బరువును అదుపులో పెట్టుకోగలిగా. ఇదే నా విజయం(నవ్వులు). ఈ బొద్దుతనం ఫ్లాష్‌బ్యాక్‌ కూడా కాస్త పంచుకోవాల్సిందే. తొంభై ఐదు కేజీలు ఉండేదాన్ని..పుట్టుకతోనే ఓవర్‌వెయిట్‌ బేబీని. స్కూలింగ్‌లో 95 కేజీల బరువు ఉండేదాన్ని. కొందరు ఓవర్‌వెయిట్‌ గురించి విమర్శించేవారు. అయితే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అయితే నా స్నేహితులు శరీరం గురించి ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. బాల్యంనుంచే కాన్ఫిడెంట్‌ నాలో ఎక్కువ. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నాననే అర్థమయ్యేది. అయితే అడ్డుగా అనిపించలేదు. కాలేజీలో స్పోర్ట్స్‌లో ముందుండేదాన్ని. బాగా చదివేదాన్ని, మాట్లాడేదాన్ని. డిబేట్స్‌లో గెలిచేదాన్ని. ఓవర్‌వెయిట్‌ ఉండే తోటి అమ్మాయిలు మానసికంగా బాధపడేవాళ్లు. అయితే నేను ఏనాడూ ఫీలవ్వలేదు.

ఏనాడూ ఊహించలేదు.. ‘బరువు తగ్గాల్సిందే’ అనేది అమ్మ. నాన్న శతృఘ్న సిన్హా మాత్రం ‘నువ్వు హీరోయిన్‌ కావాలంటే బరువు తగ్గాల్సిందే’ అనేవారు. ‘సినిమాఫీల్డ్‌ ఇష్టం లేదు. హీరోయినా? నెవ్వర్‌’ అనేదాన్ని. పద్దెనిమిదేళ్ల వయసులో జిమ్‌ ఫీజు కట్టా. ట్రెడ్‌మిల్‌ మీద 30 సెకన్లు కూడా నడవలేకపోయేదాన్ని. మొత్తానికి ‘దబాంగ్‌’ చిత్రంలో సల్మాన్‌ జోడీగా అవకాశం వచ్చాక ఖచ్చితంగా తగ్గాలనుకున్నా. సినిమా కంటే ముందు తగ్గాల్సిన అవసరం ఉందని భావించా. రెండేళ్లలో ముప్ఫయి కేజీలు తగ్గా. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా స్లిమ్‌ అన్నారు కొందరు. స్కెలెటన్‌లా ఉండలేనన్నా. బరువు తగ్గాక సినిమాలతో పాటు మింత్రా లాంటి ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ నన్ను సంప్రదించాయి. ఇది ఓ రకంగా ‘సినిమా’వల్ల సాధించిన సక్సెస్‌. మీడియా, ఇన్‌స్టా, ట్విటర్‌, సినిమా.. ఎక్కడైనా అందానికి ప్రాధాన్యత ఉంటుంది. కవర్‌పేజ్‌ గాళ్‌గా అందమైన లొకేషన్స్‌లో ఫొటోషూట్స్‌కు ఫోజులిస్తానని.. ఏనాడూ ఊహించలేదు.
సర్టిఫైడ్‌ డైవర్‌ను.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘బ్రీత్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ ఎయిర్‌’ అంటూ కొందరు కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు.

నాకు ప్రకృతిలో ఎక్కువ గడపాలనే ఆలోచన. సినిమాలతో అది తీరింది. కొత్త కొత్త లొకేషన్స్‌కు వెళ్లటం మధురానుభూతి. ముంబైలో ఖాళీ దొరికితే చాలు సముద్రం తీరానికి వెళ్తా. నేనో వాటర్‌ బేబీని. డైవింగ్‌ కొట్టడం, సముద్రంలోపల ఈత కొట్టడం ఇష్టం. సముద్రం, సూర్యుడు, ఇసుక.. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. గోవాలో కొత్త రెస్టారెంట్స్‌కు వెళ్తాకానీ.. సముద్రతీరంలో గడపాలంటే మాల్దీవ్స్‌కు మాత్రమే వెళ్తా. ‘మాల్దీవ్స్‌ మా ఇల్లే’ అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే.. నేను సర్టిఫైడ్‌ డైవర్‌ను. డైవ్‌ చేస్తూ సముద్రం లోపల తిరుగుతుంటే ఆ అద్భుతాన్ని కళ్లతో క్యాప్చర్‌ చేయటం, అన్ని సెన్సెస్‌ పని చేయటం.. ఒక్కమాటలో ‘సోల్‌ సాటిస్‌ఫ్యాక్షన్‌’ కలుగుతుంది. అందుకే ఏటా రెండు, మూడు సార్లు మాల్దీవ్స్‌కు వెళ్లి తీరాల్సిందే. ఆ తీరంలో జీవించాల్సిందే.

ఆస్ర్టేలియా, లాస్‌ఏంజెల్స్‌లోని సముద్రతీరాలంటే ఇష్టం. అయితే మాల్దీవ్స్‌లో మాత్రం సెటిల్‌ అవ్వాలనిపిస్తుంది. ఆ స్లీపీ లైఫ్‌స్టయిల్‌ నాకిష్టం. అభిరుచుల విషయానికొస్తే సంగీతం సృష్టించటం ఇష్టం. స్కూల్‌ వయసులోనే వయోలిన్‌ నేర్చుకున్నా. ఇటీవలే డ్రమ్స్‌ నేర్చుకున్నా. సినిమాల విషయానికొస్తే అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, షాహిద్‌ కపూర్‌.. ఇష్టమైన సహనటులు. ‘క్వీన్‌’ సినిమా ఇష్టం. ఆ పాత్రలో కంగనాలా ఎవరూ నటించలేరు. ఇదే బరువును మెయిన్‌టైన్‌ చేయడానికి వర్కవుట్స్‌తో పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు, యోగా చేస్తుంటా.