Health

సంతానాన్నిచ్చే దురదగొండికాయల కూర

Auto Draft

దురదగొండి పేరు తలచుకోగానే శరీరం మీద దురద మొదలైనట్లనిపిస్తుంది. నిజానికి దీని ఆకులు, కాండాల మీద ఉండే నూగు ఈ దురదకు కారణం, దీని ఆకులతోనూ, ముఖ్యంగా ఈ నూగుతో కూడా ఔషధ ప్రయోజనాలున్నప్పటికీ దీని కాయలు, గింజలతో ఆహార పదార్థాలు వండుకునే అలవాటు ఉండేది. పాకదర్పణం గ్రంథంలో నలుడు దీన్ని ‘విరూపక’ అన్నాడు. లేత విరూపకఫలంతో కూర, పచ్చడి వగైరా వండుకుంటే వాతం వలన, వేడివలన వచ్చే భయంకర వ్యాధులమీద ఔషధంగా పనిచేస్తుందని, జీర్ణకోశ సమస్యల్ని నివారిస్తుందని, దంతవ్యాధుల్ని కూడా తగ్గిస్తుందనీ పేర్కొన్నాడు. పండితులు విరూపక అంటే దురదగొండి లేదా దూలగొండి అని నిర్ధారించారు.

దురదగొండి తెలుగు ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా దొరికే మొక్క. ఇందులో రెండు రకాలున్నాయి. రెండూ పొదల్లాగా పెరుగుతాయి. కానీ, ఒక రకం తీగలాగా పెరుగుతుంది. ఆకులు మిరప ఆకుల్లా ఉంటాయి. ఇది రేగడి భూముల్లో పెరుగుతుంది కాబట్టి, దీన్ని రేగటి దూలగొండి అంటారు. రెండోది తీగల్లేకుండా పొదలాగే ఉంటుంది. చిన్న ఆకులు గుండ్రంగా ఉంటాయి. దీన్ని దూలగోవిల, తీటకసివింద అని కూడా పిలుస్తారు. రెండింటికీ వేర్వేరు వృక్షనామాలున్నాయి. కానీ, గుణాలు సమానమే! వీటిలో ఏది దొరికినా తీసుకోవచ్చు.

దురదగొండి లేతకాయలు చిక్కుడుకాయ ఆకారంలో ఉంటాయి. లేతకాయల్ని తరిగి చిక్కుడుకాయల కూరలాగానే వండుకోవచ్చు. తీపిగా, చిరుచేదుగా ఉంటాయి. ప్రధానంగా ఇవి పురుషుల్లో జీవకణాలు పెరిగేలా చేసే ఔషధాల్లో, లైంగిక సమర్థతను పెంచే ఔషధాల్లో, పార్కిన్‌సోనిజం లాంటి మెదడు వ్యాధుల్లో, కీళ్ళవాతంలో ఔషధంగా ఉపయోగపడతాయి.

వాతవ్యాధులున్నవారికి దీని విత్తులు అమృతంతో సమానం. సెప్టిక్‌ అయిన పుళ్లను తగ్గించే గుణం వీటికుంది. గింజ ముదిరే కొద్దీ దీని శక్తి పెరుగుతుంది. ఇది స్త్రీలవ్యాధుల్లోనూ పనిచేస్తుంది. గర్భాశయానికి టానిక్‌ లాంటిది. సంతానం కలగని స్త్రీలకు, నెలసరి సక్రమంగా రాని వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఋతుస్రావం అయ్యేలా చేయటం దీని ప్రత్యేకత. రక్తప్రసారాన్ని పెంచుతుంది. ముఖ్యంగా జననాంగాలకు రక్తసరఫరా వేగంగా జరిగేలా చేస్తుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థని బలసంపన్నం చేస్తుంది. చలవనిచ్చే ఔషధాల్లో ముఖ్యమైంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరతత్త్వంలో మార్పు తెస్తుంది. కరోనాలాంటి వ్యాధులు వచ్చి తగ్గిన వారు త్వరగా కోలుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్నవారికి లేత దురదగొండికాయలు తేలికగానే దొరుకుతాయి. దాని ఆకులనూగు చేతికి తగలకుండా కాయల్ని జాగ్రత్తగా కోసి కడిగి, ముక్కలుగా తరిగి, ఉప్పు వేసిన నీళ్లలో బాగా ఉడికించి నీటిని వార్చి అప్పుడు కూరగా గాని లేదా మీకు ఇష్టమైన వంటకంగా గానీ చేసుకోవచ్చు.

ఈ కాయలు దొరికే అవకాశం లేనివారికి మూలికలమ్మే షాపుల్లో దురదగొండి విత్తులు దొరుకుతాయి. ఈత గింజల్లా గట్టిగా ఉంటాయి. ఈ గింజల్ని ఆవుపాలలో వేసి, ఆ పాలన్నీ ఇగిరేలా ఉడికిస్తే గింజ మెత్తబడుతుంది! ఒకరకంగా ఇది దురదగొండి విత్తులకు శుద్ధి.
మెత్తగా ఉడికిన దురదగొండి విత్తుల్ని మిక్సీపట్టి గుజ్జులా చేసి బెల్లం లేదా పంచదార పాకంపట్టి హల్వా, లడ్డూ లాంటివి చేసుకోవచ్చు. ఇందులో ఎల్‌-డోప అనే రసాయనం ఉంటుంది మెదడులో డోపమైన్‌ తగ్గటం వలన వచ్చే పార్కిన్సోనిజం వ్యాధికి ఇది మంచి ఔషధం. మానసిక వ్యాధులు, చీటికీ మాటికీ ఉద్రేకంగా ఉండేవారికి, సయాటికా నడుం నొప్పితో బాధపడే వారికీ మేలు చేస్తుంది.