Politics

బీజేపీలో హాట్‌టాపిక్‌గా గ‌డ్కరీ వ్యాఖ్యలు – TNI రాజకీయ వార్తలు

బీజేపీలో హాట్‌టాపిక్‌గా గ‌డ్కరీ వ్యాఖ్యలు – TNI రాజకీయ వార్తలు

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్ గ‌డ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను శుక్రవారం కేందమంత్రి చేశారు. ఈ సందర్భంగా గ‌డ్కరీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో హైద‌రాబాద్ దాహార్తి తీరింద‌న్నారు. అయితే గ‌డ్కరీ వ్యాఖ్యలు సోష‌ల్‌మీడియాలో ట్రోల్ అవుతోన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తానే స్వయంగా అనుమ‌తులిచ్చానని గ‌డ్కరీ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌‌పై గడ్కరీ పొగడ్తలతో బీజేపీలో ర‌చ్చ మొదలయింది. గ‌డ్కరీ స్పీచ్‌ను ఎవ‌రు సిద్ధం చేశారంటూ కమలనాథులు ఆరా తీస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ప్రజాసంగ్రామ యాత్రలోనూ ఇదే అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఓవైపు బండి‌ యాత్ర చేస్తుంటే.. మరోవైపు కేంద్రమంత్రులు టీఆర్ఎస్‌ను పొగడడమేంటని పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవ‌రి ప్రోద్బలంతో స్పీచ్ త‌యారు చేశారో అంటూ కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారు.

*కేటీఆర్ చెప్పిన దానిలో అవాస్తవాలు ఏమున్నాయి: రామకృష్ణ
ప్రజలు ధరల పెరుగుదలతో బాధపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మరో పక్క విద్యుత్ చార్జీలు, కోతలు, ఆర్టీసీ ఛార్జీలతో హింస పెడుతున్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 64 రూపాయలు ఉండే పెట్రోల్ ఇవాళ 122 రూపాయలు అయింది.పెట్రోల్ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే 10 రూపాయలు రాష్ట్రంలో అధికంగా ఉంది.ప్రతి ఒక్క వస్తువు ధర రాష్ట్రంలో విపరీతంగా పెంచారు, ఆస్తి పన్ను విపరీతంగా పెంచారు,చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది.రాబోయే 3 సంవత్సరాల పాటు ట్రూ అప్ చార్జీలు వసూలుకు రంగం సిద్ధం చేశారు.బహిరంగ మార్కెట్ కంటే అదాని దగ్గర అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.రాజకీయంగా కూడా అదానితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

*టీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం: చంద్రబాబు
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడిని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్‌కు వెళ్తున్నటీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గమన్నారు. టీడీపీ నేత చలపతి నాయుడుపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికలంటే వైసీపీ ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. దాడులు చేస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయలేని పోలీసులు… నామినేషన్‌కు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు.

*ఏపీ పరువు కేటీఆర్ వ్యాఖ్యలతో పోయింది: టీడీపీ నేత
ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం ఎప్పుడూ జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ పరువు తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో పోయిందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రానికి రండి అభివృద్ధి చూపిస్తామని ఆహ్వానించండం ఏంటని ప్రశ్నించారు. టీఆరెస్ నేతలకు ఏం అభివృద్ధి చూపిస్తారు.. పెరిగిన విద్యుత్ కోతలు, అద్వాన్నంగా ఉన్న రోడ్లు, ఆగిపోయిన పోలవరం, ఇలా ప్రభుత్వ వైఫల్యాలను వారికి చూపిస్తార అని ఆయన నిలదీశారు. వచ్చిన విమర్శలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా మళ్లీ వారిపైనే విమర్శలు చేయడమేంటని అడిగారు. సిగ్గులేని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమీలేని అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇకనైనా ఎన్ని ఇబ్బందులు ఉన్న విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయాలని, దెబ్బతిన్న రోడ్లను బాగుచేయాలని శ్రీనివాసులు రెడ్డి హితవుపలికారు.

*సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుంది: సోమిశెట్టి
ఏపీ సర్కార్ తీరుపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. తన అసమర్థ పాలనతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు. బాధితులను పరామర్శిస్తున్న నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. నారా లోకేష్పై రౌడీమూకలతో రాళ్ల దాడే అందుకు నిదర్శనమని సోమిశెట్టి పేర్కొన్నారు. జగన్ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. కేటీఆర్ విమర్శలే ఏపీ దుస్థితిని తెలియజేస్తున్నాయన్నారు. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు హితవు పలికారు.

*ఏపీ పరిస్థితులపై కేటీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలు: రవీంద్రారెడ్డి
ఏపీలో పరిస్ధితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పినవన్నీ ముమ్మాటికి వాస్తవాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ప్రస్తుత చంచా మంత్రులకు వాస్తవాలు రుచించక రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో తీవ్రమైన విద్యుత్ కొరత, అధ్వాన్నమైన రోడ్లు, నీటి కొరత, అన్నీ సమస్యలుండేది ప్రజలకు తెలుసన్నారు. విద్యుత్‌పై సీఎం జగన్‌కు విద్యుత్ శాఖ మంత్రికి ఇరువురికి అవగాహన లేదని తెలిపారు. ఇష్టానుసారంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు, పనులు చేసే కాంట్రాక్టర్లకు నమ్మకాలు లేవన్నారు. ‘‘నువ్వేదో వెలగపెడతావని ప్రజలు నీకు 150 సీట్లు 53% ఓట్లు ఇచ్చారు’’ అంటూ రవీంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*ఆ ప్రకటన ప్రగల్భమే అని అర్థమవుతోంది: బండి సంజయ్
తెలంగాణలోని ప్రతీ వడ్ల గింజ కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమొత్తారు.దీంతో ప్రభుత్వ ప్రకటన ప్రగల్భమే అని అర్థమవుతోందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను, కాంటాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న తనకు అనేక మంది రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని చెబుతున్నట్లు పేర్కొన్నారు.గద్వాల్‌ జిల్లాలో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం రెండింటినే ప్రారంభించినట్లు ఆక్షేపించారు. వనపర్తి జిల్లాలో 225 కేంద్రాలకు గానూ 19, నారాయణపేట్‌ జిల్లాలో 91 కేంద్రాలకు 70 మాత్రమే ప్రారంభించారని బండి సంజయ్‌ లేఖలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2,500 తెరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కారు మొత్తం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉందో స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజ కొనే వరకు, రైతులకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించే దాకా వారి పక్షాన పోరాడుతామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్‌ లేఖలో డిమాండ్‌ చేశారు.

*కూలీలకు డబ్బు చెల్లించలేని స్థితిలో తెలంగాణ పాలకులున్నారా?: షర్మిల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి గ్రామంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటించారు. ఆమెను కలిసిన ఉపాధిహామీ కూలీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12 వారాలుగా పనిచేయించుకుని డబ్బులు ఇవ్వడంలేదని తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ హయాంలో ఉపాధి పథకం తీరు దారుణంగా ఉంది. ఉపాధికూలీలను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారు. పని చేయించుకొని కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదు. కూలీలకు డబ్బు చెల్లించలేని స్థితిలో తెలంగాణ పాలకులు ఉన్నారా? ఇదేనా మంచి పాలన… అంతా దోచుకోవడమేనా మీ విధానం? రాష్ట్రం వ్యాప్తంగా అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్నదొర కేటీఆర్కు ఏపీలో ఫ్రెండ్స్ ఉన్నారట.. తెలంగాణలో ఎవరూ లేరట. ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటీఆర్కి ఫ్రెండ్స్ కాదట. తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఆత్మహత్యలు మీకు కనిపించేవి. వడ్లు కొనక రైతులు పడుతున్న బాధలు కనిపించేవి. రాష్ట్రంలో అసలు ఉద్యమకారులను పట్టించుకొనే పరిస్థితులు లేవు’’ అని పేర్కొన్నారు

* నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు: కేటీఆర్‌
తాను ఈ రోజు ఇక్కడ క్రెడాయ్‌ సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధ పెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్వీట్‌ చేశారు. ‘‘నేను ఏపీ సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం అభివృద్ధిచెందాలని మనసారా కోరుకుంటున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

*రాష్ట్రానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదు!: కోదండరాం
దేశానికి కొత్త అజెండా కావాలంటున్న సీఎం కేసీఆర్‌.. అసలు తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీజేఎస్‌ అధినేత కోదండరాం డిమాండ్‌ చేశారు. అమర వీరుల కుటుంబాలను, ఉద్యమ ఆకాంక్షలను గాలికి వదిలేసి.. ఉద్యమ వ్యతిరేకులతో క్యాబినెట్‌ను నింపేశారని ధ్వజమెత్తారు. టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుక్రవారం ఆయన.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తన నిరంకుశ పాలనతో సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ కుప్పకూల్చారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా, మంథని-ఖమ్మం మధ్య నిర్మించనున్న జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి.. కోదండరాం వినతి పత్రం సమర్పించారు.

*రాష్ట్ర నేతలు ఎక్కడ పర్యటించినా స్వాగతిస్తా: ఏలేటి
కాంగ్రెస్‌ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా స్వాగతిస్తానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ సభను విజయవంతం చేయడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. కాంగ్రెస్‌ బలంగా లేని ప్రాంతాల్లో ముఖ్య నేతలు పర్యటిస్తే బాగుంటుందంటూ పార్టీ జిల్లా సమావేశాల్లో కొందరు నాయకులు చెప్పారని వెల్లడించారు.

*టూరిజం శాఖలో అద్దె బకాయిలు 300 కోట్లు: జడ్సన్‌
టూరిజం శాఖకు సంబంధించిన భవనాలు, స్థలాల నుంచి ఆ శాఖకు రూ. 300 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, అయినా ఏ ఒక్కరికీ ఇంత వరకు ప్రభుత్వం నోటీసులు పంపలేదని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ ఆరోపించారు. శాఖలో ఇదొక పెద్ద కుంభకోణమని, దీనిపై మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగ్‌ విడుదల చేసిన నివేదిక ఆధారంగానే తాను ఈ ఆరోపణ చేస్తున్నానని చెప్పారు.

*‘చంద్రబాబూ.. దమ్ముంటే కుప్పంలో రాజీమా చెయ్.. పోటీచేద్దాం’
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే ఆయనగానీ, ఆయన కుమారుడు లోకేశ్‌ గానీ తంబళ్లపల్లె నియోజకవర్గంలో తనపై పోటీచేసి డిపాజిట్లు దక్కించుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సవాల్‌ విసిరారు. మండలంలో నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘కుప్పంలో రాజీనామా చెయ్‌ నువ్వు నేను పోటీచేద్దాం నీకు డిపాజిట్స్‌ గల్లంతు చేస్తా, లేదా నాకు డిపాజిట్స్‌ గల్లంతు అయితే నేను రాజకీయం సన్యాసం చేస్తా’నంటూ సవాల్‌ విసిరారు. సమావేశంలో సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ అమరనాథ్‌, ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, అంగళ్లు మార్కెట్‌కమిటీ డైరెక్టర్‌ అయూబ్‌, మాజీ ఉపసర్పంచి మాలిక్‌, తదితరులు పాల్గొన్నారు.

*కేటీఆర్‌ ఏపీకి రండి.. అభివృద్ధిని చూపిస్తా: రోజా
‘‘టీ మంత్రి కేటీఆర్‌ని ఏపీకి ఆహ్వానిస్తా. అక్కడ జరిగిన అభివృద్ధిని చూపిస్తా’’ అని మంత్రి రోజా అన్నారు. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘టూరిజం మంత్రిగా కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నా. తన ఫ్రెండ్స్‌తో కలిసి మా రాష్ట్ర పర్యటనకు రావాలి. కేటీఆర్‌ టైం, డేట్‌ చెబితే ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా’’ అని అన్నారు.

*ఏపీలో విద్యుత్‌ కోతల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి
‘‘రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయ్‌. వాటిలో లబ్ధి పొందేందుకే కేటీఆర్‌ అలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము ఆంధ్రలో కంటే బాగా పనిచేస్తున్నామని చెబితే ఓట్లు పడుతాయని ఆయన అనుకుంటున్నట్లున్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఇంతకంటే కామెంట్‌ చేయదలచుకోలేదు’’ అని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వేసినన్ని రోడ్లు తెలంగాణలో వేయలేదని, పంచాయతీరాజ్‌ పరిధిలోనే దాదాపు 10వేల కి.మీ. రోడ్లు వేశామన్నారు.

*ముందు మీ రాష్ట్రం గురించి మాట్లాడండి: సజ్జల
‘‘ఏపీ గురించి మాట్లాడేటప్పుడు.. కేటీఆర్‌ ఐనా, మరెవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటివరకూ తెలంగాణలోనూ విద్యుత్తు కోతలున్నాయి’’ అని సజ్జల అన్నారు.

*వాపును చూసి బలుపనుకోవద్దు: అమర్‌నాథ్‌
‘‘హైదరాబాద్‌ నగరాన్ని చూసి రాష్ట్రమంతా బాగుందని అనుకోవడం పొరపాటు. వాపును చూసి బలుపు అనుకోవద్దు. హైదరాబాద్‌ను చూసి మిడిసిపడొద్దు’’ అని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. ‘‘ఏపీలో ఎక్కడ విద్యుత్తు లేదో, రోడ్లు బాగలేవో వచ్చి చూడాలి. 16 రాష్ట్రాల్లో విద్యుత్తు కోతలు ఉన్నాయి. ఏపీలో కోతలు తాత్కాలిక సమస్య. కేటీఆర్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.

*బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో: ఎంపీ రంజిత్‌
‘‘మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌ కరెంటు బిల్లు కట్టకపోయి ఉండవచ్చు. దాంతో ఆయన ఇంటికి కరెంట్‌ కట్‌ చేసి ఉండొచ్చు’’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో రెండు రోజుల పాటు కాదు… రెండు నిమిషాల పాటు కూడా కరెంటు పోదన్న సంగతి అందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతల కుటుంబాలు మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని, వారిని అడిగితే ఇక్కడి పరిస్థితి ఏంటనేది చెబుతారన్నారు. ఇక, ఏపీలో ప్రస్తుత పరిస్థితుల గురించి కేటీఆర్‌ అన్న మాటల్లో నిజం ఉందని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మంత్రి బొత్స కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటుంది. వారికి ఏపీకి, తెలంగాణకి తేడా తెలుసు. విజయవాడ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంతా హైదరాబాద్‌ వస్తున్న విషయం కనిపించడం లేదా?’’ అని వేముల అడిగారు.

*హైదరాబాద్‌లో రాత్రంతా కరెంటు లేదు: బొత్స
‘‘నేను గురువారం రాత్రి హైదరాబాద్‌లోనే ఉన్నాను. అక్కడ కరెంటు లేదు. రాత్రంతా జనరేటర్‌ వేసుకోవాల్సి వచ్చింది’’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘కేటీఆర్‌ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారో తెలియదు. రాష్ట్రంలో రోడ్లు బాలేవని, కరెంటు లేదని ఎవరో చెబితే కేటీఆర్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌లో కరెంటు లేదని నేనే ప్రత్యక్షంగా చూశాను’’ అని బొత్స డిమాండ్‌ చేశారు.

*జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ఖర్మ ఇలా కాలింది: పత్తిపాటి
‘‘ఒక్క తెలంగాణ ఏం ఖర్మ… అన్ని రాష్ట్రాల వారూ ఏపీతో పోల్చుకొని తాము బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యామని చెప్పుకొంటున్నారు. దేశంలో అందరికీ పోల్చుకోవడానికి ఏపీనే దొరుకుతోంది. జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ఖర్మ ఇలా కాలింది’’ అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘ఏపీ వాస్తవ పరిస్థితి ఏమిటో కేటీఆర్‌ చెప్పారు. ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి… జగన్‌రెడ్డి, కేసీఆర్‌ల ఉమ్మడి ఎజెండా. దానిని జగన్‌ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీలో భూముల ధరలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200శాతం పడిపోతే తెలంగాణలో మాత్రం గణనీయంగా పెరిగాయి. అభివృద్ధి ఏ కోశానా లేదు. పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు పెట్టడానికి తెలంగాణ మంచిదన్న అభిప్రాయం పారిశ్రామికవేత్తల్లో వ్యాపించింది. జగన్‌రెడ్డి అసమర్థతే దీనికి కారణం’’ అని పుల్లారావు అన్నారు. మారో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ‘‘గడచిన ఎన్నికల్లో వైసీపీ, టీఆర్‌ఎస్‌ అవిభక్త సోదరుల్లా టీడీపీని ఓడించడానికి కలిసి పనిచేశారు. ఆ సోదరులే ఇప్పుడు ఏపీలో పరిస్థితులేమిటో వాస్తవం మాట్లాడుతున్నారు. సీఎం మెప్పు కోసం వైసీపీ నేతలు కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు తప్ప వారికి కూడా వాస్తవం ఏమిటో స్పష్టంగా తెలుసు’’ అని అన్నారు.