Health

కాక‌ర ర‌సంతో ఆరోగ్యానికి మేలు

కాక‌ర ర‌సంతో ఆరోగ్యానికి మేలు

కాక‌ర కాయ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు గురించి పెద్ద‌లు ఎంత చెబుతున్నా కాక‌ర‌లోని చేదును చూసి దానికి చాలామంది దూరంగా ఉంటారు. కాకర ర‌సంతో ప‌లు వ్యాధులను నియంత్రించ‌డంతో పాటు శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. చేదుగా ఉంటుంద‌నే కార‌ణంతో కాక‌ర‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం పొర‌పాటని అంటున్నారు. కాకర పోష‌కాల గ‌నితో పాటు వ్యాధుల‌ను మ‌న ద‌రిచేర‌కుండా చూస్తుంద‌ని చెబుతున్నారు. కాక‌ర ర‌సంతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి.

ఇమ్యూనిటీ బూస్ట‌ర్ :
కాక‌ర ర‌సంలో ఉండే విట‌మిన్ సీతో చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డ‌ట‌మే కాకుండా రోగ‌నిరోధ‌క శ‌క్తిని స‌మ‌కూరుస్తుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌లంగా ఉంటే ప‌లు వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి అది మ‌న‌ల్ని కాపాడుతుంది.

మెరుగైన జీర్ణ వ్య‌వ‌స్ధ :
కాక‌ర‌కాయ ర‌సంలో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. మ‌నం తీసుకున్న ఆహారం జీర్ణ‌మ‌వ‌డంతో పాటు మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించేందుకు ఫైబ‌ర్ తోడ్పడుతుంది. క‌డుపు నొప్పి, గ్యాస్ నివార‌ణ‌లోనూ కాక‌ర కాయ ర‌సం దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది.

అధిక బ‌రువు నియంత్ర‌ణ :
బ‌రువు నియంత్ర‌ణ‌లో కాక‌ర కాయ ర‌సం ఇతోధికంగా తోడ్ప‌డుతుంది. కాక‌ర జ్యూస్‌తో జీవ‌క్రియల వేగం పెరిగి బ‌రువు త‌గ్గేందుకు ఉప‌క‌రిస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంతో ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

కొవ్వుకు చెక్ :
గుండె జ‌బ్బుల‌కు దారితీసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను కాక‌ర జ్యూస్ అదుపులో ఉంచుతుంది. కాక‌ర ర‌సంతో హృద్రోగాల బారిన‌ప‌డ‌కుండా గుండెను ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు.

వ్య‌ర్దాల తొల‌గింపు :
కాక‌ర ర‌సాన్ని రోజూ తీసుకుంటే శ‌రీరంలోని మ‌లినాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వుతుంది. కాక‌ర ర‌సం ర‌క్తం, లివ‌ర్‌లో వ్య‌ర్ధాల‌ను తొల‌గించ‌డ‌మే కాకుండా శ‌రీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.