Movies

ప్రపంచంలో అత్యంత కష్టపడేవాళ్లు సినీ కార్మికులే

ప్రపంచంలో అత్యంత కష్టపడేవాళ్లు సినీ కార్మికులే

‘‘కేంద్ర, రాష్ట్ర మంత్రులు సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే దీనికున్న గొప్పతనం అర్థమవుతోంది. కార్మికులను బానిసల్లాగా చూేస రోజుల్లో ‘మేమూ మనుషులమే. కాకపోతే పరిమిత సామరఽ్థ్యంతో ఉంటాం’ అంటూ ఉద్యమించి సాధించుకున్న పండుగ ఇది. మొదటిసారి తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే కార్మికులు సినీ పరిశ్రమలోనే ఉన్నారు. అలాంటి వారి సమస్యల పరిష్కారానికి సాయం చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను’’ అని చిరంజీవి అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో వేదిక అయిన ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘అందరినీ సంఘటితం చేసి, అభివృద్థి, ఐక్యత ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వేడుక చేయడం అభినందనీయం. అమెరికా వెళ్లే పని ఉన్నా, దాన్ని వాయిదా వేసుకుని, ఈ కార్యక్రమానికి వచ్చా. అమెరికా ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ, ఇలాంటి వేడుకలో మీకు భరోసా ఇచ్చేలా మీతోపాటు నేనూ ఓ కార్మికుడినై ఉంటాను. మీ సమస్యల పరిష్కారానికి ముందుంటానని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను’’ అని అన్నారు.

‘కళాకారులు కాదండీ.. కళాకార్మికులు’ అనేవారు!‘‘పలు రంగాల్లో కార్మికులకు నిర్దిష్ట సమయం, సౌకర్యాలు ఉంటాయి. కానీ, మన సినీ కార్మికులకు అలాంటి సమయాలు, వాతావరణాలు ఉండవు. రాత్రిపగలు, ఎండా, వాన తేడా లేకుండా పనిచేస్తుంటారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడేవాళ్లు సినీ కార్మికులే అని చెప్పగలను. స్వర్గీయ రావుగోపాలరావు తరచూ ఓ మాట అంటుండేవారు. ‘అల్లుడుగారు.. మీరు కళాకారులు కాదండీ.. కళాకార్మికులు’ అనేవారు. ‘బామ్మమాట బంగారు బాట’ షూటింగ్‌ జరుగుతుండగా కారు ప్రమాదం జరిగి నూతన ప్రసాద్‌గారి నడుముకు తీవ్ర గాయమైంది. ఆ సినిమా ఆగిపోకూడదని ఆయన కోలుకున్న తర్వాత ఇబ్బంది పడుతూనే వచ్చి షూటింగ్‌ చేశారు. అది నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది ఇది గొప్ప త్యాగం కాదా? సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ను ఉక్కుమనిషి అంటారు. చరిత్రలో అలా లిఖించబడింది కాబట్టి అందరికీ ఆ విషయం తెలిసింది. అలాంటి వ్యక్తులు ఎందరో సినీ పరిశ్రమలో ఉన్నారు. 70 ఏళ్ల వయసులో దర్శకుడు కె.బి తిలక్‌ నటుడిగా మారి ఒక సినిమా చేశారు. ఆ సినిమా షష్టిపూర్తి సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. పెళ్లికొడుకు వేషంలో ఉన్నారు. అదే సమయంలో భార్య చనిపోయిందని ఫోన్‌ వచ్చింది. తన వల్ల షూటింగ్‌ ఆగిపోతే నిర్మాతకు నష్టం వస్తుందని, బాధను దిగమింగుకొని షూటింగ్‌ పూర్తి చేశారు. ఇలా సినిమా రంగంలో త్యాగం చేసినవాళ్లు చాలామంది ఉన్నారు’’ అని చిరంజీవి చెప్పారు.