DailyDose

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు – TNI తాజా వార్తలు

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు – TNI తాజా వార్తలు

*తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకోనున్నారు. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక…రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించున్నారు. సభ తర్వాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్‌ రానున్నారు. దుర్గంచెరువు దగ్గర కోహినూర్ హోటల్‌లో రాహుల్ బస చేయనున్నారు. 7న ఉదయం ముఖ్యనేతలతో రాహుల్ అల్పాహార విందు, అనంతరం సంజీవయ్య పార్క్‌లో మాజీ సీఎం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించనున్నారు. తర్వాత గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌ ఎన్‌రోలెర్స్‌తో ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ లంచ్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి రాహుల్‌ వెళ్లనున్నారు

*తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. పంటన్నింటికీ మద్దతు ధర కల్పిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ పర్యటనకు ఆంక్షలు విధించొద్దని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

*తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అరాచకాలపై సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఏపీలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, దీనివల్ల రాష్ట్రంలో అశాంతి ప్రబలి అభివృద్ధి కుంటుపడిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
*
*
*ఈ నెల 5న తిరుపతికి సీఎం జగన్‌ రానున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలిపిరిలో చిల్డ్రన్స్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. విద్యా కానుక బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి వెళ్తారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

*ఏపీలో పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీలపై వైసీపీ ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘‘తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?.. జగన్ జేబు నుంచి ఇచ్చారా?…అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేము వాటితో బతుకుతున్నామా? అంటూ ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?.. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి..’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు

*తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక దర్శక నిర్మాతలు, నటీనటులతోపాటు కార్మికుల కృషి ఎంతో వుందన్నారు. ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని గుర్తు చేశారు. ఇప్పుడు మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. సినీ రంగంలోని 24 విభాగాలు కరోనా వల్ల చాలా ఇబ్బందిపడ్డారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ రావడం వల్ల మళ్లీ పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు.కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలని మంత్రి తెలిపారు.తెలుగు సినీపరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వెనక దర్శక, నిర్మాతలతో పాటు కార్మికుల కృషి ఎంతో ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.

*టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్‌పై మాజీ ఎంపీ వీహెచ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీపై బాల్కసుమన్ వ్యాఖ్యలు సరికాదని వీహెచ్‌ అన్నారు. రాహుల్ వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా? అని వీహెచ్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే బాల్కసుమన్ ఏం చేసేవారని, విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా అని వీహెచ్‌ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని జైల్లో పెడితే సుమన్ ఎందుకు మాట్లాడరు? అని వీహెచ్‌ అన్నారు

*కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ అరెస్ట్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

* దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాక్‌ మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్‌తో సహా మరో 150 మందిపై పోలీసులు నమోదు చేశారు. దీంతో దేశంలో వీరి అరెస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలోని మస్జిద్-ఎ-నబ్వీ వద్ద ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ సహా మరికొంత మంది నేతలు దొంగ, ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295ఏ కింద ఇమ్రాన్‌తో స‌హా 150 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో తాను ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు. ఇక కేసు నమోదైన వారిలో మాజీ మంత్రులు ఫవాద్‌ చౌదరి, షహబాజ్‌ గుల్‌, షేక్‌ రషీద్‌ ఉన్నారు.

*రూ.30లక్షలకే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌.. రూ.2కోట్లకు విల్లా..! ఇలా అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా క్రెడాయ్‌ ప్రాపర్టీ షో-2022 ఆకట్టుకుంటోంది. ఆయా సంస్థలు తమ నిర్మాణ శైలి మాదిరిగానే తమ స్టాళ్లనూ అద్భుతమైన ఆర్కిటెక్ట్‌తో రూపొందించాయి. హైటెక్స్‌లో గల ఎగ్జిబిషన్‌లో హాల్‌లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో వంద స్టాల్స్‌ ఉన్నాయి. ప్రాపర్టీ షోకు అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

*గుంటూరు: జిల్లాలోని ఆరండల్‌పేట సీఐ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. హిందూ ఫార్మసి కాలేజ్ పక్కన పాలబూత్ పెట్టాడని వృద్ధుడిపై దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. సీఐ లాఠీతో వృద్ధుడిని తీవ్రంగా కొట్టినట్లు వాపోతున్నాడు. సీఐ దాడిలో వృద్ధుడు గాయపడ్డాడు. ఆ వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

* కార్మికులకు సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదని సీఎం జగన్‌ చెప్పారు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం తెలిపారు.

*రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలిని పరామర్శకు పోలీసులు అనుమతించలేదు. ఆసుపత్రి గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

*మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3324 నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,79,188 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2876 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.74 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 40 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,843 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,092 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,36,253 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,89,17,69,346 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25,95,267 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

*రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు తమ ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌ద్దన్నారు. పోలీసులు ఇప్ప‌టికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీతోఆస్ప‌త్రి అధికారుల‌తో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్ర‌స్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉన్నారని చెప్పారు.ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందన్నారు. బాధితురాలికిఆమె కుటుంబానికి మా ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు.

* కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్‌. అంతేకాదు.. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది.

* ఒంగోలు పీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న వినోద్‌ కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుని రెండేళ్ల తర్వాత నడిరోడ్డుపై వదిలేశాడంటూ రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై వినోద్‌కుమార్‌పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వినోద్‌‌ కుమార్‌కు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలుసుకుని ప్రశ్నించినందుకే తనను వదిలేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచినా రాకుండా, తన జీవితాన్ని నాశనం చేశాడంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది.

* ఒక్కసారిగా పడిపోయాయని సంతోషించేలోపే.. కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 3,668 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు.శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశ రాజధానిలో ఢిల్లీ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం 3,668 కేసుల్లో.. 1, 607 కేసులు, రెండు మరణాలు ఢిల్లీలోనే నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌కేసుల సంఖ్య 18, 684గా ఉంది. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వాళ్ల సంఖ్య 5,23,803గా నమోదు అయ్యింది.

* కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్‌’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్‌ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్‌ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా.

* దేశీయంగా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించి, చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అయిదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఢిల్లీ – నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌), బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ ఈ నగరాల్లో ఉన్నాయి. ఈ–కామర్స్‌ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా ఎంపిక చేసిన వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్‌ సేవల సంస్థలకు ఓఎన్‌డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

* ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్‌లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో యూరప్‌ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు.

* కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి బయల్దేరిన సీఎం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఖేలో ఇండియా’ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాతో రాష్ట్ర రాజకీయ స్థితిగతులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలకు తనను ఢిల్లీకి ఆహ్వానిస్తామని అధిష్టానం పెద్దలు స్పష్టం చేశారన్నారు.

*కోర్టుల్లో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీని అమలు చేయడానికి, ఏఎంసీలు, పరికరాల నిర్వహణకు, హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నిధులు అందుబాటులో ఉంచలేదు. ఐసీటీ సిబ్బందికి చెల్లింపులు కూడా చేయలేదు. 2016లో జరిగిన సీఎంలు, సీజేల సంయుక్త సదస్సులో ఆమోదించిన తీర్మానాల అమలు స్థితిపై శనివారం జరిగిన సదస్సుకు కేంద్రం వివరాలను సమర్పించింది. దాని ప్రకారం… 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన గ్రాంట్ల వినియోగానికి సంబంధించిన సమాచారం ఏపీ హైకోర్టు ఇవ్వలేదు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల తీర్మానానికి సంబంధించి 2016 నుంచి 2021 వరకు 21 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2021 నాటికి 14 ప్రాజెక్టులు మూడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, ఫైవ్‌ ప్లస్‌ జీరో పెండెన్సీ జాతీయ మిషన్‌ లక్ష్య సాధన తీర్మానంలో భాగంగా రాష్ట్ర హైకోర్టు కేడర్‌ రివ్యూ చేపట్టలేదు. 607 న్యాయాధికారుల పోస్టులకు గాను 491 మంది పనిచేస్తున్నారు. 2021 డిసెంబరు 31నాటికి జిల్లా, కింది కోర్టుల్లో 76,720 పెండింగ్‌ కేసులు ఉన్నాయి.

*ఏపీకి మరో 12 మెడికల్‌ కాలేజీలను మం జూరు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం శనివారం కేంద్ర మంత్రిని కలిశారు. ఏపీ జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీలో కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని మరో 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2023 డిసెంబరు నాటికి ఈ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేస్తామని, 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధం చేస్తామన్నారు. మరోవైపు, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన సీఎంలు, సీజేలకు ప్రధాని మోదీ శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు సీఎం జగన్‌ హాజరయ్యారు.

*దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యోన్నతి పథకం అమలు చేసిన రీతిలోనే దేశంలోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్లలో ఉచిత శిక్షణ అందించేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అమలు చేసిన పథకాలన్నీ రద్దు పద్దులో చేర్చి ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కూడా మూసేశారు. ఇంటర్‌ పాసయిన విద్యార్థులకు 40 శాతం సీట్లు, డిగ్రీ పాసయిన వారికి 60 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం 70 శాతం ఎస్సీ విద్యార్థులకు 30 శాతం ఓబీసీ విద్యార్థులకు ఈ కోచింగ్‌ అందిస్తారు. రూ.8 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన ఎస్సీ, ఓబీసీలు అర్హులు. 2022-23లో మొత్తం 3500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఫీజు చెల్లించి రశీదులను సమర్పిస్తే ఫీజును రీయింబర్స్‌ చేస్తారు. ప్రతి నెలా రూ.4 వేలు స్టైఫండ్‌ కూడా అందిస్తారు.

*హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వసతి సదుపాయాన్ని ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. సాధారణ పరిపాలనశాఖ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది. మే 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఇతర ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

*ఉన్నత విద్యలో పరిశోధనలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రూపాయి ఫీజు లేకుండా ఎంటెక్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నామని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం-ఏపీ విశ్వవిద్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు ఏటా రూ.72వేల స్టైపెండ్‌ను కూడా అందిస్తున్నట్టు వివరించింది. టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌లలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులుగా తెలిపింది. సీఎ్‌సఈ బ్రాంచ్‌లో బీటెక్‌ చదివినవారికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, ఈసీఈ చదివినవారికి వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివినవారికి మెటీరియల్స్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌లలో ఎంటెక్‌ స్పెషలైజేషన్‌ కోర్సులను ప్రవేశపెట్టామని పేర్కొంది. సూపర్‌ కంప్యూటర్‌పై పనిచేసే అవకాశం, అదేవిధంగా ఎంటెక్‌ పూర్తయ్యాక పలు ప్రసిద్ధ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఆసక్తి గల విద్యార్థులు ఏపీఎ్‌సఆర్‌ఎం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

*పాత మిత్రులను కలిసినప్పుడల్లా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విజ్ఞాన్‌ 1991-93 బ్యాచ్‌కు చెందిన తన సహచరులను కలిసిన ఫొటోను ట్విటర్‌లో ఆయన షేర్‌ చేశారు. 28 ఏళ్ల తర్వాత వారిని కలిశానని, వారిలో చాలా మంది డాక్టర్లని మంత్రి తెలిపారు. ఇన్నేళ్లు గడిచినా వారందరినీ కొన్ని వారాల కిందటే వడ్లమూడి క్యాంపస్‌లో కలుసుకున్నట్లు ఉందని చెప్పారు. కాలం చాలా వేగంగా తిరుగుతోందని ఆయన ట్వీట్‌ చేశారు.

*మతపరమైన ఊరేగింపులకు అనుమతించే విషయంలో పోలీసులు ఒకే విధంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. ఇందుకు మార్గదర్శకాలు రూపొందించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. మత కార్యక్రమాలకు అనుమతులపై పోలీసులు ఒక్కో సారి ఒక్కోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో మే 1 నుంచి 12 వరకు నిర్వహించే ఆది శంకరాచార్య జయంతి మహోత్సవాలు, శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం, తత్వం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. దీనిపై జస్టిస్‌ కె. లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో కొన్ని శోభాయాత్రలకు పోలీసులు అనుమతించారని, మరికొన్నింటిని తిరస్కరించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా తగిన ఆంక్షలతో కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఆది శంకరాచార్య ఉత్సవాలకు అనుమతి ఇవ్వడంతో పాటు, బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. అనుమతులు విషయమై మార్గదర్శకాలు రూపొందించాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

*తెలుగు బాలసాహిత్యంలో అక్షర విప్లవాలకు తెలంగాణ నేల భూమికగా నిలవడం గర్వించదగిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. శనివారం రవీంద్ర భారతి ప్రాంగణంలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో గద్వాల కిరణ్‌కుమారి రాసిన ‘చంద్రకిరణాలు’ బాలగేయాల పుస్తకాన్ని గౌరీశంకర్‌ ఆవిష్కరించారు. పిల్లల్లో సృజనను తట్టి లేపేందుకు బాలసాహిత్యం ఎంతో దోహదం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా బాలలే బాలసాహిత్యాన్ని రాయడం పెనుమార్పుగా అభివర్ణించారు. కఽథారచయిత్రి, గజల్‌ గాయని, కవయిత్రి అయిన గద్వాల కిరణ్‌కుమారి తన పుస్తకంలో బాలగేయాలను పిల్లల హృదయాలకు హత్తుకునేలా రాశారని జూలూరు వివరించారు. ఒకనాటి చందమామ బాలల పత్రికలో వచ్చిన కఽథలు ఆ తరంలో ఎంతో ప్రభావం చూపాయని కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్‌ తెలిపారు. ప్రకృతి అందాలను గేయాల్లో హృద్యంగా వర్ణించారని ప్రముఖ రచయిత్రి కొల్లాపురం విమల పేర్కొన్నారు.

*దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో కుటుంబ పార్టీలే పాలన సాగిస్తున్నాయని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురుగన్‌ విమర్శించారు. ఈ మూడు రాష్ర్టాల్లో పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌, డీఎంకే, వైసీపీ ప్రభుత్వాలకు ఎలాంటి లక్ష్యాలూ లేవన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయకుండా చేతులెత్తేయడమే ఆ పార్టీ ప్రభుత్వాల లక్ష్యమని విమర్శించారు. శనివారం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన భారతీయ జనతాపార్టీ రాయలసీమ జోనల్‌ పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌, జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోదర్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇంటింటికీ సారాను అందించడంపై చూపుతున్న శ్రద్ధ విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయడంలో చూపడం లేదని ఆరోపించారు. ఇదే సందర్భంలో బీజేపీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

*కోర్టు ధిక్కరణ కేసులో ఆచార్య నాగార్జున యునివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్‌ జి.రోశయ్యకు హైకోర్టు నెల రోజుల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పు అమలును రెండువారాలపాటు సస్పెండ్‌ చేసింది. తీర్పు అమలు కోసం కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా.. ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు ఇటీవల తీర్పు ఇచ్చారు. వ్యాజ్యం 2018లో దాఖలైందని, ప్రస్తుతం పిటిషనర్‌ వయసు 68 ఏళ్లని.. పదవీ విరమణ చేశారని న్యాయమూర్తి గుర్తుచేశారు. న్యాయం కోసం సుధీర్ఘకాలం ఆయన చేసిన పోరాటాన్ని విస్మరించలేమన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసిన రిజిస్ట్రార్‌పై ఎలాంటి దయ చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగార్జున వర్సిటీ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ రిటైర్డ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఐ.సుబ్బారావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం పిటిషనర్‌ వినతిని పరిష్కరించాలని 2018 జూన్‌ 14న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో 2018 డిసెంబరు 26న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి.. రోశయ్య యునివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్న 9 నెలల కాలంలో తీర్పు అమలు నిర్లక్ష్యం చేశారని పేర్కొంటూ శిక్ష విధించింది.

* ఏపీకి మరో 12 మెడికల్‌ కాలేజీలను మం జూరు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం శనివారం కేంద్ర మంత్రిని కలిశారు. ఏపీ జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీలో కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని మరో 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2023 డిసెంబరు నాటికి ఈ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేస్తామని, 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధం చేస్తామన్నారు. మరోవైపు, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన సీఎంలు, సీజేలకు ప్రధాని మోదీ శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు సీఎం జగన్‌ హాజరయ్యారు.

*గుంటూరు: జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం పెదకాకాని, పోన్నెకల్లు పీహెచ్‌స్సీల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ రెండు పీహెచ్సీలలో పారిశుధ్యం, ప్రసవాలు, బయోమెట్రిక్ హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కమిషనర్ తదుపరి తనిఖీ నాటికి పనితీరును మెరుగు పర్చుకోవాలి లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది, వైద్య అధికారుల గైర్హాజరుపై ఆరా తీశారు. కమిషనర్ రెండు పీహెచ్సీలలోనూ ప్రసవాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలలో ప్రసవాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీహెచ్సీలకు ఇంకా హెచ్‌డీసీ నిధులు చేరకపోవడంపై గుంటూరు డీఎంహెచ్‌వోకు ఫోన్లో ఆదేశాలిచ్చారు.

*హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలల పాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.