Devotional

రెండో ఉజ్జయిని..@ రాజమహేంద్రవరం – TNI ఆధ్యాత్మికం

రెండో ఉజ్జయిని..@ రాజమహేంద్రవరం  – TNI ఆధ్యాత్మికం

1. ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి.. ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది.
*అక్కడ నిత్యం… ‘నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. భస్మాంగరాయ మహేశ్వరాయ.. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ.. తస్త్మేన్త కారాయ నమశ్శివాయ!’ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద ఝరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తిపారవశ్యంతో కట్టిపడేస్తోంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి..
**ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా..
రోటరీ క్లబ్‌ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతోపాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది.
*ఆధునికత ఉట్టిపడేలా.. ఆధ్యాత్మికుల మనసు దోచుకునేలా..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో, ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారుచేయించారు.
*ప్రత్యేకం.. భస్మాభిషేకం
రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. భస్మాభిషేకం. ఇక్కడ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్‌ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు.

2. శ్రీశైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈఓ లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యధావిధిగా కొనసాగించాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. పర్వదినాలు సెలవురోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున డార్మెంటరిలలో అదనపు స్నానపు గదులు ఏర్పాటు చేయాలని ఈఓ లవన్న సూచనలిచ్చారు.

3. ‘చార్‌ధామ్‌’కు కోవిడ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు
ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు/ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు /వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

4. ‘కొండెక్కిన’ పార్కింగ్‌ ఫీజు
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్‌ ఫీజుల షాక్‌ ఇచ్చింది. తిరుమల తరహాలో యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పిస్తామన్న దేవస్థానం ప్రకటనతో సంతోషపడ్డ భక్తులు పార్కింగ్‌ ఫీజుల పెంపు ప్రకటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండపైన పార్కింగ్‌ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. దేవస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదివారం నుంచి ఈ పార్కింగ్‌ చార్జీల వసూలు ప్రారంభం కానుంది.ఈ మేరకు శనివారం ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాల ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్‌ వాహనాలకు పార్కింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.అలాగే దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్‌ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్‌ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్‌ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని, ఫీజు తగ్గించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు

5. చార్ ధామ్ యాత్రకు రోజువారీ పరిమితి… అనుమతించే యాత్రికుల సంఖ్య ఎంతంటే?
చార్ ధామ్ యాత్రకు రోజువారీ పరిమితిని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మే 3 నుంచి ప్రారంభంకానున్న చార్‌ ధామ్‌ యాత్రకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రకటించింది. బద్రీనాథ్‌కు రోజువారీ యాత్రికుల పరిమితి 15,000గా నిర్ణయించారు. అలాగే కేదార్‌నాథ్‌కు 12,000 మందికే పరిమితం చేశారు. గంగోత్రి, యమునోత్రికి రోజువారీ యాత్రికుల పరిమితులను 7,000, 4,000గా పేర్కొన్నారు. చార్‌ ధామ్‌ యాత్ర నేపథ్యంలో 45 రోజుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కాగా, మే 3న చార్‌ ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరుస్తారు. మే 6న కేదార్‌నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో సంబంధిత ఆంక్షలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సడలించింది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హిమాలయ ఆలయాలను సందర్శించే యాత్రికులు రికార్డు స్థాయిలో రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సంధు శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు మే 3 నుంచి 31 వరకు యమునోత్రికి 15,829 మంది, గంగోత్రికి 16,804 మంది, కేదార్‌నాథ్‌కు 41,107 మంది, బద్రీనాథ్‌కు 29,488 మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పర్యాటక శాఖ కార్యదర్శి దిలీప్ జవాల్కర్ తెలిపారు. చార్ ధామ్ యాత్ర కోసం విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు

6. కొమురవెల్లి’లో భక్తుల కోలాహలం
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు.అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొంత మంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు

7. యదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్గ్ర హైకోర్టు న్యాయమూర్తి సుధ, ఎండోమెంటల్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ శర్మ, ఏపీ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా వేరు వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, అద్దాల మండపంలో వేద అరశీర్వచనం ఇవ్వగా, అధికారులు ప్రసాదం అందజేశారు.కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.