Politics

మే 10 నుంచి చిన్నమ్మ రోడ్‌షోలు ?

మే 10 నుంచి చిన్నమ్మ రోడ్‌షోలు ?

అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటన ప్రారంభించనున్నారు. గుమ్మిడిపూండి నుంచి కన్నియాకుమారి వరకూ ఆమె పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన కార్యక్రమాలను ఖరారు చేసే విధంగా సలహాదారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇటీవల శశికళ ఆధ్యాత్మిక పర్యటన పేరుతో సుప్రసిద్ధ ఆలయాలను దర్శించారు. తన ఆధ్యాత్మిక పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటన ప్రారంబిస్తానని ఆ సమయంలో మీడియాకు ఆమె సమాధానమిచ్చారు. ఆ ప్రకారం శశికళ ఈ నెల 10న రాజకీయ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. తంజావూరులో ఈ నెల 10న ఓ వివాహ వేడుకకు ఆమె హాజరుకానున్నారు. ఆ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

ఆ తర్వాత గుమ్మిడి పూండి నుంచి కన్నియాకుమారి వరకు రోజుకు మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 234 నియోజకవర్గాలలోనూ ఆమె పర్యటించనున్నారు. అన్నాడీఎంకే అధిష్టానవర్గంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రులు, మాజీ జిల్లా శాఖ కార్యదర్శులను ఆమె కలుసుకుని రాజకీయ మంతనాలు జరుపనున్నారు. శశికళ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లో ఘన స్వాగతం పలికేందుకు ఆమె మద్దతుదారులు ఏర్పాట్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత పర్యటన తలపించే రీతిలో శశికళ పర్యటన కొనసాగుతుందని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ఈ సభల్లో అన్నాడీఎంకే నేతలపై ఆమె విమర్శలు చేయనున్నారని తెలుస్తోంది. పదేళ్లపాటు కొనసాగిన అన్నాడీఎంకే పతనానికి ఈ నాయకులు కారకులయ్యారని, ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితలా పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనకు మాత్రమే ఉందని నొక్కి వక్కాణించనున్నారు. ఈ నెలాఖరున అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి భారీ సన్నాహాలు జరుగుతున్న సమయంలో శశికళ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనుండటం విశేషం. ఈ వారంలోగా శశికళ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలవుతుందని తెలిపారు