Devotional

3న అటు చార్‌ధామ్‌ యాత్ర ఇటు అప్పన్న చందనోత్సవం ప్రారంభం – TNI ఆధ్యాత్మికం

3న అటు చార్‌ధామ్‌ యాత్ర ఇటు అప్పన్న చందనోత్సవం ప్రారంభం – TNI ఆధ్యాత్మికం

1. రేపటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర
చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల రోజువారీ సంఖ్యపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం పరిమితి విధించింది. మంగళవారం చార్‌ధామ్‌ యాత్ర మొదలుకానుంది. రోజుకు బద్రీనాథ్‌కు 15 వేల మంది, కేదార్‌నాథ్‌కు 12 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, యమునోత్రికి 4 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించింది.

2. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం నేడు(సోమవారం) రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నేడు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 72,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

3. రేపు అప్పన్న చందనోత్సవం
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం.. చందనోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఏటా వైశాఖ శుక్ల పక్ష తదియ రోజున సంప్రదాయబద్ధంగా చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. సుమారు రెండు లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారనే అంచనాతో దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించిన అనంతరం వీవీఐపీలను 4 గంటల నుంచి 6 గంటల వరకు, తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి దర్శనం కల్పిస్తారు. అదే విధంగా తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి వరకు సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారని ఈవో ఎంవీ సూర్యకళ తెలిపారు

4. చందనోత్సవానికి సర్వం సిద్ధం
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనయాత్రను ఈనెల 3న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివరాలను చందనోత్సవ ప్రత్యేక అధికారి ధర్భముళ్ల భ్రమరాంబ, సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లాది వెంకట సూర్యకళ ఆదివారం నృసింహవనంలో విలేఖరులకు వెల్లడించారు. చందనోత్సవంలో భాగంగా ఈనెల 2న సాయంత్రం 5 గంటల నుంచీ భక్తులకు స్వామి దర్శనాలు నిలిపివేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
*సామాన్యులకు లఘు దర్శనమే తెల్లవారుజామున 4 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటల వరకు క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తారు. ఆ తరువాత ప్రవేశాలను నిలిపివేసి, అప్పటివరకు క్యూలో ఉన్న భక్తులందరికీ స్వామి దర్శనం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ నీలాద్రి గుమ్మం నుంచి లఘుదర్శనం మాత్రమే లభిస్తుంది. రాత్రి 9 గంటలకు పవిత్ర గంగధార జలాలతో సహస్ర ఘటాభిషేకం, శీతలోపచారాల సమర్పణ, అనంతరం తొలివిడత మూడు మణుగుల చందన సమర్పణతో వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు.
*భారీగా తరలిరానున్న భక్తులు
కరోనా కారణంగా రెండేళ్లుగా స్వామి చందనోత్సవాన్ని ఏకాంత సేవగా నిర్వహించారు. ఈ ఏడాది భక్తులను అనుమతించడంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు ంచనా వేస్తున్నామని ఈఓ సూర్యకళ తెలిపారు. నీలాద్రిగుమ్మం నుంచి లఘుదర్శనం ఏర్పాటు చేశామని, అక్కడే ఉచితం, రూ.300, రూ.1000 క్యూలకు మూడు ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మించామన్నారు. పార్కింగ్‌ స్థలాలు పరిమితంగా ఉండడంతో దేవదాయశాఖ అధికారులు, ప్రొటోకాల్‌ ప్రముఖుల పాస్‌ ఉన్న వాహనాలను మాత్రమే ఘాట్‌రోడ్‌లో అనుమిస్తామన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను సింహగిరికి అనుమిస్తారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండదిగువ నుండి భక్తులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. రూ.1200 టిక్కెట్లు గల వీవీఐపీలు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే అంతరాలయంలోనికి నిర్దేశించిన సమయంలో అనుమతిస్తారు. ఇదే టిక్కెట్‌ తీసుకున్న సామాన్య భక్తులకు నీలాద్రి గుమ్మం నుంచి లఘు దర్శనమే కల్పిస్తారు. రూ.300ల దర్శనం టిక్కెట్లను వివిధ బ్యాంకులు, దేవస్థానం పెట్రోల్‌ బంకుల్లో విక్రయిస్తున్నారు.
*దివ్యాంగులకు ప్రత్యేక అనుమతి
దివ్యాంగులకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అతనితో పాటు సహాయకునికి మాత్రమే రాజగోపురం సమీప లిఫ్ట్‌ ద్వారా ఆలయంలోనికి అనుమతిస్తారు. కాగా మెట్లమార్గంలో రాకపోకలను 3 సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నామన్నారు. ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. మెడికల్‌ క్యాంపులు, అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, వలంటీర్లతో తాగునీరు, చల్లని పానీయాలను పంపిణీ చేస్తామన్నారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశామన్నారు. కొండదిగువ పలు ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులంతా సంప్రదాయ దుస్తులనే ధరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.
*చందనోత్సవానికి 170 ప్రత్యేక బస్సులు
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా మంగళవారం 170 ప్రత్యేక బస్సులు నడపనున్నామని పీటీడీ విశాఖ రీజియన్‌ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి అడవివరం మీదుగా 10, విజయనగరం నుంచి అడవివరం మీదుగా 20, పాతపోస్టాఫీస్‌ నుంచి ఆర్‌కేబీచ్‌, అడవివరం మీదుగా 20, తగరపువలస నుంచి సింహాచలానికి 10 చొప్పున ఈ సర్వీసులు నడుస్తాయి. వీటితో పాటు మారికవలస నుంచి పీఎంపాలెం, అడవి వరరం మీదుగా 15, అనకాపల్లి నుంచి సింహాచలం గోశాలకు 10, కొత్తవలస నుంచి 15, చోడవరం, మాడుగుల, కొత్తకోట ప్రాంతాల నుంచి 20, గాజువాక, సింథియా ప్రాంతాల నుంచి 20, ఆర్టీసీ కాంప్లెక్సు, పాతపోస్టాఫీస్‌ నుంచి 20, నర్సీపట్నం నుంచి 10 సర్వీసులు ఆపరేట్‌ చేయనున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు తెలిపారు.

5. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్‌చార్జి ఆర్‌జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం.