DailyDose

ఇక సచివాలయాల్లో పాస్పోర్టు సేవలు – TNI తాజా వార్తలు

ఇక సచివాలయాల్లో పాస్పోర్టు సేవలు  – TNI తాజా వార్తలు

*సచివాలయాల్లో ఇకపై “పాస్ పోర్ట్” సేవలు..తొలివిడతగా 1600 గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రారంభం.

*రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారుఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.

*సీమలో తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని… అందుకే చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రూ.13 వేల కోట్లతో జలధారను తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానని…కాని అది ఆపేశారని మండిపడ్డారు. మహానాడు తర్వాత తాను ప్రజల్లోకి రానున్నట్లు తెలిపారు. అప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించడం జరుగుతుందని చెప్పారు. ‘‘మనం ఏం చేశాము… వైసీపీ వాళ్ళు ఎలా నాశనం చేశారు అనేది ప్రజలకు తెలియజేస్తాం’’ అని లోకేష్ వెల్లడించారు.

*ఎల‌క్ట్రానిక్ పరిక‌రాల ఉత్ప‌త్తి రంగంలో రాబోయే ప‌దేండ్ల‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల‌ కోట్ల ఆదాయం, 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించ‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంద‌ని, స్థిర‌మైన ప్ర‌భుత్వం, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు ఉన్నందునే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎల‌క్ట్రానిక్స్ యూనిట్‌లో మ‌రో నూత‌న ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి క‌లిసి సోమ‌వారం ప్రారంభించారు.

*8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్‌ పర్యటన
ఈనెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పర్యటించనున్నారు. రైతుభరోసా యాత్రలో భాగంగా శిరివెళ్లలో జనసేనాని సభను ఏర్పాటు చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. సభకు ఏర్పాట్లు జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

*నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం కృష్ణాపురంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కబ్జాదారులు ప్లాట్లను ఏర్పాటు చేసుకున్నారు. రెవిన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

* మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక మంత్రేమో జెనరేటర్లు ఆన్ చేశామంటారు.. తెలంగాణ వాళ్లేమో బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ అంటారు. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కి పనికొస్తుంది తప్పా ఇంకేం లేదు. ప్రజలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’’ అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు.

*ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా వేతనాలు, పెన్షన్లు అందలేదు. ఇప్పటివరకు సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ఆర్ధికశాఖకు బిల్లులు చేరలేదు. నిధులు అందుబాటులో లేక ఆర్ధికశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొందరికి మాత్రమే వేతనాలు, పెన్షన్లు అందాయి. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంకు కూడా.. రూ. 390 కోట్లు ఏపీ ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టింది. ఏపీకి కొత్త అప్పులకు కేంద్ర ఆర్ధికశాఖ అనుమతి ఇవ్వలేదు. వేతనాలు, పెన్షన్ల రూపేణా రూ.6 వేల కోట్లు అవసరం ఉంది. అందుబాటులో ఉన్న నిధులు ఆధారంగా వాయిదా పద్దతిలో వేతనాలు, పెన్షన్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్న ఒకటో తేదీ ఆదివారం, రేపు రంజాన్‌ సెలవు, ఇక నాలుగో తేదీనే పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం… ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతాలు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది.

*విజయవాడ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిన కేసు మరో మలుపు తిరిగింది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన యువకుడు గోపి సాయి అడ్రస్‌తో పార్శిల్ బుక్ అయింది. అయితే ఆ పార్శిల్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని, తన ఫోటోను మార్ఫింగ్ చేసి బుక్ చేశారని గోపిసాయి చెబుతున్నాడు.విజయవాడలోని ఓ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు నాలుగున్నర కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్ పార్శిల్ చేశారు. అడ్రస్ సరిగా లేకపోవడంతో కెనడా వెళ్లి తిరిగి బెంగళూరు చేరింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ డ్రగ్స్ ప్యాకెట్ బయటపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన కొరియర్ బాయ్ తేజను అరెస్టు చేశారు. ఆయన కొన్నేళ్లుగా భారతీ నగర్‌లో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్ సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడుకు చెందిన గోపిసాయి పేరుతో బుక్ చేశారు. దీంతో గోపిసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*గుడివాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పసమర్రు పాఠశాల నుంచి స్లిప్పులు పంపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు పసమర్రు పాఠశాలలో తనిఖీలు చేశారు. సెల్‌ఫోన్‌లో సమాధానాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి విచారణ చేస్తామన్నా అధికారులు.. మీడియాకు వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

*దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికి 1,89,23,98,347 మందికి వ్యాక్సిన్లను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సిన్‌లను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యపలు చేసింది. కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయవద్దు అని కోర్టు పేర్కొన్నది. ప్రస్తుత వ్యాక్సినేషన్‌ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫరిణామాల గురించి కేంద్రం డేటాను విడుదల చేయాలనలి ఆదేశించింది.అలాగే, వ్యాకినేషన్‌ చేసుకోకపోతే వారిని పబ్లిక్‌ ప్రదేశాలకు రానివ్వకపోవడం కరెక్ట్‌ కాదని పేర్కొంది. ఈ క్ర్మంలో కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వెల్లడించింది. అనంతరం వ్యాక్సిన్‌ విషయంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేసింది.

*రేపల్లె రైల్వేస్టేషన్‌ ఘటన బాధాకరమని హోంమంత్రి వనిత అన్నారు. సోమవారం వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్నిరకాల పరిహారాలు అందజేస్తామన్నారు. అత్యాచార బాధితుల వివరాలపై గోప్యత పాటించాలని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి ఘటనలపై రాద్ధాంతం చేస్తున్నాయని హోంమంత్రి వనిత మండిపడ్డారు.

*జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఆ గ్రామంలో గ్రూపు తగాదాలే కారణమని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే అనుచరులే గంజి ప్రసాద్ హత్య చేశారని ఆరోపించారు. పచ్చని పల్లెల్లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఎమ్మెల్యే తలారి పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఘటన ఎక్కడ చోటు చేసుకోలేదన్నారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై తమ పార్టీ వైసీపీ నేతలు దాడి చేస్తే ఆ దాడిలో టీడీపీ వారు ఉన్నారనడం సిగ్గుచేటని ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

* జగన్ రెడ్డి పాలనలో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రతీ రోజూ ఏదో ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో దళిత గర్భిణి మహిళపై అత్యాచారం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని దేవతోటి నాగరాజు ప్రశ్నించారు.

*బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర మందకొడిగా సాగుతోంది. ఎండ తీవ్రతతో రెండు నియోజకవర్గాలను బీజేపీ నేతలు స్కిప్ చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలను కమలనాథుడు తప్పించారు. రోజుకు 10 కిలోమీటర్లు కూడా పాదయాత్ర జరగకపోవడంతో రూట్‌లో మార్పులు చేర్పులు చేశారు. 5న మహబూబ్‌నగర్‌లో పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా రానున్నారు. 14న మహేశ్వరంలో ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 14న మహేశ్వరం చేరుకునేలా పాదయాత్రలో మార్పులు చేశారు.

*శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి నియమితులు కావడం వరుసగా ఇది రెండో సారి.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి ఇటీవల గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. దాంతో ఉమ్మారెడ్డిని మరోసారి మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు.

*కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో అతిసారం విజృంభిస్తోంది. వారం రోజుల్లో ఇద్దరు మృతి చెందారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముగ్గురికి వాంతులు, విరోచనాలు ప్రారంభమై దాదాపు 21 మందికి సోకింది.
వారంతా పామర్రులోని ప్రైవేటు వైద్యశాలలు, ఆర్‌ఎంపీ వైద్యుల వద్ద చికిత్స పొందగా పలువురు కోలుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలపాల అలివేలమ్మ(65), కొడాలి హెప్సిభ(50)కు ఆరోగ్యం విషమించగా శనివారం రాత్రి గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని సూచించారు. దీంతో అలివేలమ్మను కుటుంబీకులు ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందింది. హెప్సిభ విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా కలపాల కవిత(36), కలపాల ప్రసాద్‌(38), కలపాల కుమార్‌(52), కలపాల పాండు(67), కలపాల అంజియ్య(42), జుఝువరపు ఉదయ్‌(12), కలపాల హని(13) ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న వారిలో కొందరు ఒక్కొక్కరు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ 13,000 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో విదేశాల్లో ఉన్న ఆర్థిక నేరగాడు మోహుల్‌ చోక్సీపై మరో కేసు నమోదు చేసింది సీబీఐ. ఇండస్ట్రియల్‌ ఫైనాన్షియల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.మెహుల్‌ చోక్సీ, ఐఎఫ్‌సీఐల మధ్య 2014 నుంచి 2016 వరకు జరిగిన లావాదేవీల్లో చోటు చేసుకున్న మోసాలపై తాజా కేసు నమోదు అయ్యింది, మోహుల్‌ చోక్సీకి సంబంధించి గీతాంజలి జెమ్‌కి లాంగ్‌టర్మ్‌ క్యాపిటర్‌ రుణం కావాలంటూ 2016లో మోహుల్‌ చోక్సీ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా ఐఎఫ్‌సీఐ నుంచి రూ. 25 కోట్ల రుణం పొందాడు. ఐఎఫ్‌ఐసీ నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో మోహుల్‌ చోక్సీ చెల్లించలేదు. ఆ తర్వాత జరిగిన లావాదేవీల్లో మోహుల్‌ చోక్సీ కొన్ని షేర్లను బదలాయించగా వాటి ద్వారా కేవలం రూ.4.07 కోట్లు మాత్రమే రికవరీ జరిగింది. ఉద్దేశ పూర‍్వకంగానే తమను తప్పు దారి పట్టించి నిధులు కాజేశారంటూ ఐఎఫ్‌సీఐ సీబీఐ తలుపు తట్టింది. మోహుల్‌ చోక్సీ వ్యవహారంలో ఐఎఫ్‌సీఐ ఖజానకు రూ.22 కోట్ల మేర కన్నం పడింది.

*తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీ తొలి సంవత్సరం విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడి మీద ప్రమాణం చేసిన ఘటన వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. మెడికల్ కాలేజీ డీన్‌ ఎ.రత్నవేల్‌ను బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది.

*కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలను నుండి ప్రశ్నా పత్రాలను, సమాధానాల స్లీప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సమాచారం అందిన వెంటనే విద్యాశాఖ, పోలీస్ అధికారులు పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలకు చేరుకున్నారు. పలువురు ఉపాధ్యాయుల వద్ద నేడు జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో సమాధానాలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డీఈఓ తాహిరా సుల్తానా పసుమర్రు చేరుకొని విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న దృష్ట్యా మీడియాకు వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.

*రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేట్‌పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్‌ వివరాలను లేఖలో వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం అయ్యారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జతచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చేయడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని వ్యాఖ్యానించారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందన్నారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగేది కాదని చెప్పారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని టీడీపీ అధినేత అన్నారు.

*రంజాన్‌ (పండుగ) సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 3న ఈదుల్‌ ఫితర్‌ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న మీరాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్‌ మసీదు, వజీర్‌అలీ మసీదు, హఫీజ్‌డంకా మసీదు, అఫ్జల్‌గంజ్‌ జామా మసీదు, సిద్దిఅంబర్‌ బజార్‌ మసీదులతోపాటు మాసాబ్‌ట్యాంక్‌లోని హాకీ స్టేడియం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సెవెన్‌ టూంబ్స్‌, లంగర్‌హౌజ్‌, సికింద్రాబాద్‌, మాదన్నపేట్‌, కొత్తపేట్‌, కులీకుతుబ్‌షా స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంలతో పాటు వివిధ ఈద్గాలు, మైదానాల్లో ప్రత్యేక నమాజ్‌లు సాగుతాయి.ఈ నేపథ్యంలో నగరంలోని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అలాగే, జిల్లాలకు వెళ్లే, వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలకూ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌తోపాటు దక్షిణ మండలం డీసీపీ ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

*భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3157 నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2723 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.74 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 26 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,869 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,500 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,38, 976 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,89,23,98,347 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 4,02,170 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

*అశ్వారావుపేట నియోజకవర్గంలో 73వ రోజు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెం క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. దమ్మపేట మండల పరిధిలోని చిల్లగుంపు, పర్కాలగండి, గుర్రంగట్టు, జమిందార్ బంజార క్రాస్, గోపాలపురం క్రాస్, ఎర్రన్నపేట, నెమళ్లపెట, దమ్మపేట గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చిల్లగుంపు గ్రామంలో రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు దమ్మపేటలో బహిరంగ సభ జరగనుంది.

*రాష్ట్రంలోని ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని.. చాలాచోట్ల గదుల్లో లైట్లు, ఫ్యాన్లు లేవని, ఉన్నా పనిచేయక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. వేసవి తీవ్రత దృష్ట్యా అన్ని కేంద్రాల్లోనూ వసతులు పెంచాలని గిల్డ్‌ సభ్యుడు సి.హెచ్‌.ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

* విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో చేరేందుకు 2021-22లో ఉన్నతవిద్యామండలి కొత్తగా కామన్‌సెట్‌ను నిర్వహి ంచిందని.. అయితే ఇదే తొలి ఏడాది కావడంతో చాలామంది విద్యార్థులకు తెలియక ఈ పరీక్ష రాయలేకపోయారని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో వేలమంది విద్యార్థులు యూనివర్సిటీల్లో చదివే అవకాశం కోల్పోయారన్నారు. విద్యార్థులే లేరన్న సాకుచూపి ఉన్నత విద్యామండలి ఏకంగా విశ్వవిద్యాలయాల్లోని కొన్ని పీజీ కోర్సులనే రద్దుచేసిందన్నారు. కామన్‌సెట్‌ రాయనివాళ్లకు కూడా స్పాట్‌ అడ్మిషన్ల రూపంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని, అదేవిధంగా ద్రవిడ, కృష్ణా విశ్వవిద్యాలయాల్లో మూసేసిన కోర్సులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

*ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనకు వస్తుండడంతో కార్లు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని వాహనదారులను జనసేన నాయకులు హెచ్చరించారు. తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ కిరణ్‌రాయల్‌, నగరాధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బైరాగిపట్టెడ పార్కు వద్ద ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. వాహనాల ముందు జగన్‌ నడుస్తున్నట్టు.. చైన్‌తో కట్టేసి తాళం వేసిన కారు.. పట్టలతో కప్పిన కారు బొమ్మలతో కూడిన బ్యానర్‌ను సిద్ధం చేశారు. అనంతరం ఆ బ్యానర్‌ను ఓ వాహనానికి కప్పి తాళం వేశారు. ‘జగన్‌ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’ అంటూ దండోరా వేసి హెచ్చరించారు.

*శ్రామిక కార్మిక సోదరులకు చంద్రబాబు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. అప్పుడు పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా విద్యుత్‌ హాలిడేలతో అల్లాడిపోతున్నాయి. కార్మిక లోకం ఉపాఽధికి గండి పడుతోంది. ఇప్పటికైనా కార్మిక లోకం ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

*‘దేశద్రోహం అనేది గతించిన చట్టం. బ్రిటీ్‌షవాళ్ల సంప్రదాయంతో వచ్చింది. దాన్నిరద్దు చేయాలి. అది పార్లమెంట్‌లో సవరణ ద్వారా మాత్రమే చేయగలం’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం మాట్లాడారు. కొన్ని చట్టాలను మార్చాలని సుప్రీంకోర్టు సీజే చేసిన సూచన చాలా గొప్పదన్నారు. ‘ఇవాళ కోర్టు తీర్పులను ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు కూడా ధిక్కరిస్తున్నారు. సీఎం జగన్‌ కూడా కోర్టు ధిక్కారంతో ఉన్నారు. ప్రధాని మోదీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. లౌకిక వ్యవస్థకూ ముప్పు ఉంది’ అన్నారు. మేడే స్ఫూర్తితో వీటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. జగన్‌, కేసీఆర్‌ల అవినీతి వల్ల కేంద్రం వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి లొంగదీసుకుంటోందని నారాయణ ఆరోపించారు. వాళ్లు కట్టు బానిసలుగా ఉండవలసిందే తప్ప అంతకుమించి ఏమీ చేయలేరన్నారు. ‘అదానీ ఏడేళ్లలో ప్రపంచ కుబేరుడయ్యాడు. ప్రభుత్వాన్ని వాడుకుని, ఇతర వ్యాపారులను భయపెట్టి ఎదిగాడు. జీవీకే ఆధ్వర్యంలో నడిచే ముంబై పోర్టును లాక్కోడానికి జీవీకే వాళ్లను జైలు కు పంపిస్తామని బెదిరించాడు. ఇవాళ భారత తీర ప్రాంతం స్మగ్లింగ్‌కు కేం ద్రమైపోయింది’ అని విమర్శించారు. బిగ్‌బా్‌సపై ఫిర్యాదును కోర్టు అడ్మిట్‌ చేసుకోవడం అభినందనీయమని నారాయణ పేర్కొన్నారు. ‘బిగ్‌బాస్‌ అనేది ఓ వ్యభిచార వ్యవస్థ. బాంబే రెడ్‌లైట్‌ ఏరియాతో సమానం’ అన్నారు.

*రేపల్లె అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో ఉన్న బాధితురాలిని ఆదివారం రాత్రి మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఘటన అత్యంత బాధాకరం. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు.

*కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విద్యావిధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానం అమలైతే విద్యావ్యవస్థకు పెనువిఘాతం కలుగుతుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్‌టీయూ వజ్రోత్సవాలు ఆదివారం నెల్లూరు జిల్లా కందుకూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేస్తున్నందున, ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మళ్లీ నిరక్షరాస్యులు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు.

*రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే.. ఏపీ పరిస్థితి బిహార్‌ను మించిపోయిందని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘‘తాజాగా ఓ వలస కూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. తెనాలి నుంచి రేపల్లెకి రాత్రి 11.40 నిమిషాలకు ఆ కుటుంబం చేరింది. రేపల్లె రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చిన తర్వాత ప్లాట్‌ఫామ్‌పై దిగి భర్త, పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుతెరువు కోసం భర్త, పిల్లలతో వచ్చిన మహిళపై కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు.

*రాష్ట్రంలోని ప్రజలందరినీ సంతోషంగా చూడాలన్నదే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశీర్వాదంతో తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆశీస్సులు అందజేయాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోవు ఎన్నికల్లో కూడా జగన్మోహన్‌రెడ్డి మంచి మెజార్టీతో గెలవడాన్ని చూడబోతున్నామని జోస్యం ఉషశ్రీ చెప్పారు.

*ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవికి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు రాజీనామా చేశారు. ఆదిౄవాౄరం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల్లో పూర్తి స్థాయి సమయం కేటాయిస్తున్నందున సంఘానికి న్యాయం చేయలేక పోతున్నానని అన్నారు. ఆదివాసీ హక్కుల కోసం ఇక ముందు కూడా అండదండలు అందిస్తూనే ఉంటానన్నారు. పార్లమెంటులో ఆదివాసీల హక్కుల కోసం పోరాడతానన్నారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ కొత్త అధ్యక్షుడిగా బుర్స పోచయ్యను ఎన్నుకున్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు పలు తీర్మానాలు చేశారు.

*ప్రజా ఆరోగ్యవృత్తి చేస్తున్న రజకులకు కార్మిక చట్టాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వానికి తెలంగాణ రజక సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సంఘం అధ్యక్షుడు పూసల సంపత్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రజకులకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలని పాలకులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము అనుకున్నది సాధించేందుకు భవిష్యత్తులో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రజకులు భవన నిర్మాణ కార్మిక కార్యాలయాలకు వెళ్లి ఈ శ్రమ్‌ కార్డులు పొందాలని సంపత్‌ సూచించారు.

*కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్‌ కమ్‌ లేబర్‌ కోర్టు విభజన ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మే డే సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మంత్రుల నివాస సముదాయంలో వినోద్‌ కుమార్‌తో సమావేశమై, సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా పారిశ్రామిక ట్రిబ్యునల్‌ కమ్‌ లేబర్‌ కోర్టు విభజన ఇంకా జరగలేదన్నారు. ఫలితంగా తెలంగాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వేర్వేరుగా పారిశ్రామిక ట్రిబ్యునల్‌ కమ్‌ లేబర్‌ కోర్టు ఉంటే కార్మికుల సమస్యలు, కోర్టులో ఉన్న కేసులు సత్వరం పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని వినోద్‌ తెలిపారు.

*రాష్ట్రంలో శనివారం ఒకేరోజు రూ.252.34 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మేడే సందర్భంగా ఆదివారం టాస్మాక్‌ దుకాణలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, శనివారం మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. మదురై మండలంలో రూ.54.89 కోట్లు, చెన్నైలో రూ.52.28 కోట్లు, తిరుచ్చిలో రూ.49.78 కోట్లు, సేలంలో రూ.48.67 కోట్లు, కోయంబత్తూర్‌ మండలంలో రూ.46.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని టాస్మాక్‌ అధికారులు తెలిపారు

*మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేలను ఈ నెల 10న మూసివేయనున్నారు. వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం రెండు రన్‌వేలైన 14/32, 09/27 మూసివేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి తెలిపారు. వచ్చే మంగళవారం (మే 10) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహణ పనుల అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు

*తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై ఎఫ్‌సీఐ సోమవారం తనిఖీలు నిర్వహించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన రైస్ మిల్లులు… ‌గడువు ముగిసినప్పటీ ధాన్యం ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ సోదాలు చేపట్టింది. ఏక కాలంలో 60 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి. మిల్లర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ ఫిర్యాదు చేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో రైస్ మిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది. 3,200 రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తామని, 5.50 మెట్రిక్‌ టన్నుల కస్టమ్స్ రైస్‌‌ను ఇవ్వలేదని ఎఫ్‌సీఐ పేర్కొంది.

*పామర్రు మండలం పసుమర్రు హైస్కూల్లో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ లో పదవ తరగతి ప్రశ్నా పత్రం గుర్తించిన అధికారులు. దీనిపై పోలీసులు , విద్యాశాఖ అధికారులు అక్కడి ఉపాధ్యాయులను విచారణ జరుపుతున్నారు. దీనితో సంబంధం ఉన్న ఉపాధ్యాయ లను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో తహీరా సుల్తానా తెలిపారు…

*గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం.పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలను నుండి ప్రశ్నా పత్రాలను సమాధానాల స్లీప్ లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు పిర్యాదులు.సమాచారం అందుకోని పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాల కు చేరుకున్న విద్యాశాఖ, పోలీస్ అధికారులు.పలువురు ఉపాధ్యాయులు వద్ద నేడు జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్ లో సమాధానాలు గుర్తించిన విద్యాశాఖ అధికారులు.పసుమర్రు చేరుకొని విచారిస్తున్న డీఈఓ తాహిరా సుల్తానా.విచారణ జరుగుతున్న దృష్ట్యా మీడియాకు వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న అధికారులు..