Politics

పీకే కొత్త ప్రయాణం త్వరలో రాజకీయ పార్టీ?

పీకే కొత్త ప్రయాణం త్వరలో రాజకీయ పార్టీ?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం ట్విటర్‌ వేదికగా తన భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.ప్రజల కోసం నేరుగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నారు. దీంతో పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పీకే త్వరలోనే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.”ప్రజల పక్షాన విధివిధానాలను రూపొందించేందుకు, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడుదొడుకుల ప్రయాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నాను. నిజమైన మాస్టర్లయిన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ మార్గమే ‘జన్‌ సురాజ్‌ – ప్రజా సుపరిపాలన’. ఈ ప్రయాణాన్ని బిహార్‌ నుంచి ఆరంభిస్తాను” అని పీకే ట్వీట్ చేశారు.దీంతో ఈ ట్వీట్‌ కాస్తా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పీకే కొత్త పార్టీ ప్రారంభించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘జన్‌ సురాజ్‌’ అని ఆయన పార్టీ పేరునే ప్రకటించి ఉంటారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పీకే బిహార్‌లో పోటీకి దిగే అవకాశాలున్నాయి.బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక వ్యూహకర్తగా పనిచేయబోనంటూ పీకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు దూరంగా మాత్రం ఉండబోనంటూ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరనున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల కాంగ్రెస్‌ తమ పార్టీలో చేరాలంటూ పీకేను ఆహ్వానించింది. అయితే దీన్ని ఆయన తిరస్కరించారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్‌ నిరాకరించడంతోనే పీకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా.. గతంలో పీకే రాజకీయ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే 16 నెలలకే పీకే – నీతీశ్ బంధం ముగిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను జేడీయూ నుంచి బహిష్కరించారు.