Politics

తెదేపాది అనవసర రాద్ధాంతం.. అందుకే జగన్కు పట్టం – TNI రాజకీయ వార్తలు

తెదేపాది అనవసర రాద్ధాంతం.. అందుకే జగన్కు పట్టం – TNI రాజకీయ వార్తలు

* గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారని మంత్రి రోజా అన్నారు. బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.తెదేపాది అనవసర రాద్ధాంతంబాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి రోజా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నిరకాల ఛార్జీలు పెంచేసి, ఇప్పుడు చంద్రబాబు నిరసనలకు సిద్ధం కావడం సరికాదన్నారు. ఇలాగే చేస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదన్నారు. గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారన్నారు. ఈనెల 5న విద్యాదీవెన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి వస్తున్న సందర్భంగా.. తారకరామ స్టేడియంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డితో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు.

*వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి కొప్పుల
వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దర్శనానికి వస్తున్న భక్తుల ఇబ్బందులను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్‌ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భూసేకరణ పనులు ప్రారంభించారన్నారు.ముడి చెరువులో 35 ఎకరాలు ఇప్పటికే సేకరణ పూర్తయిందని మంత్రి తెలిపారు. బద్ది పోచమ్మ ఆలయం విస్తరణకు సైతం భూసేకరణ కూడా పూర్తి చేశారన్నారు. యాదాద్రి ఆలయంలాగే సీఎం కేసీఆర్‌ వేములవాడ, కొండగట్టు ధర్మపురి, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలనుకూడా అభివృద్ధి చేస్తారని చేస్తారని స్పష్టం చేశారు. కొంత ఆలస్యం అయినప్పటకి అభివృద్ధి మాత్రం జరిగి తీరుతుందన్నారు

*బండి సంజయ్ జూటా మనిషి: Errabelli
వరంగల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ జూటా మనిషి అని… బీజేపీ జూటా పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడం లేదన్నది నిజమే… కానీ ఆ డబ్బులు ఇచ్చేదెవరూ…? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. నేరుగా ఉపాధి కూలీల డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడతాయని… రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపుతుందని నిలదీశారు. ఉపాధి హామీ పనుల నిధులపై చర్చకు సిద్ధమా..? అని మంత్రి సవాల్ విసిరారు. బండి సంజయ్‌వి అబద్దపు మాటలన్నారు. బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై బండి సంజయ్‌కు అవగాహన లేదన్నారు. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా తెలంగాణలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు

*ఇక నిరంతరంగా రాష్ట్రానికి Modi, Amith sha
రాష్ట్రానికి ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నిరంతరంగా వస్తుంటారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో సోమవారం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షాతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి తెలుసుకునేందుకే అమిత్‌షా వస్తున్నారని వివరించారు. ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తరచూ రాష్ట్రానికి వస్తారన్నారు. ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలిచే లక్ష్యంతో సిద్దమవుతున్నామన్నారు. తన ఉద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం నాయకత్వ మార్పు ఉండదన్నారు. కాగా మైసూరులో పార్టీ జాతీయనేత బీఎల్‌ సంతోష్‌ వ్యాఖ్యలపై దాటవేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం కేంద్రంలోని పెద్దలు తీసుకునే నిర్ణయమన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పర్యటనకు సిద్దమైనట్లు తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కార్యకర్తలను కలిసి చైతన్యం కల్పిస్తామన్నారు

*రాజధాని అభివృద్ధికి ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు?: కళా వెంకట్రావు
రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా అని మండిపడ్డారు. కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే 78 పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, 69 శాతం పూర్తి అయిన ఐఎఎస్, 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారలు నివాసాలు పూర్తయ్యేవని అని చెప్పుకొచ్చారు. రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదని నిలదీశారు. రాజధానిలో టీడీపీ నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఇవ్వాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు

*పేరుకే సర్పంచులు.. పెత్తనం వైసీపీ నేతలదే
సర్పంచులను వైసీపీ నేతలు, అధికారులు అవమానిస్తున్నారు. పేరుకే వారు సర్పంచులు, కానీ పెత్తనమంతా వైసీపీ నాయకలదే.. అన్ని పనులు నిర్వహించడంతోపాటు సర్పంచ్ సంతకాలు పోర్జరీ చేసి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలం, వాసలీ గ్రామంలో ఉపాధి నిధులను పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసినట్లు సర్పంచ్ ఆరోపిస్తున్నారు. దళిత సర్పంచ్ రమాదేవి సంతకం పోర్జరీ చేసి రూ. 8 లక్షలు స్వాహా చేశారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అభివృద్ధికి అధికారులు, స్థానిక నేతలు కొందరు సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు.

*బాదుడే బాదుడంటూ… ఆనాడు చంద్రబాబు ఛార్జీలు పెంచలేదా?: Roja
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… బాదుడే బాదుడు..అంటూ వ్యాట్, విద్యుత్ ఛార్జీలను ఆనాడు చంద్రబాబు పెంచలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు.

*కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరింది: MP Arvind
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరిందని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్ వన్ ఉద్యోగాల్లో రాత పరీక్షను ఉర్దూలో నిర్వహించడం వల్ల ఓ వర్గం వారికే లాభం కలుగుతుందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళు వారే ఉంటారు కనుక వారికి లాభం కలుగుతుందని తెలిపారు. కేసీఆర్ వారికి ఇచ్చే ఈద్ ముబారక్ ఇదే అని… ఓవైసీ శాసిస్తే కేసీఆర్ పాటిస్తారని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పిచ్చోడు… ప్రజలను కూడా పిచ్చోళ్ళు అని అనుకుంటారని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1ను ఉర్దూలో పెట్టి ఇంటర్వ్యూలు తీసేయడం రజాకార్ల పాలన కాదా అని ప్రశ్నించారు. తుగ్లక్ నిర్ణయాలన్నీ వాపస్ చేస్తామని ఎంపీ అరవింద్ అన్నారు.

*కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన సీనియర్‌ నేతలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యే అశ్విన్‌ కోత్వాల్‌ రాజీనామా చేశారు. ఇక, గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ హార్ధిక్‌ పటేల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో బయో నుంచి కాంగ్రెస్‌ పార్టీని తొలగించారు. దీంతో రాజకీయంగా దీనిపై చర్చ నడుస్తోంది. కాగా, ఖేద్‌బ్ర‌హ్మ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ మంగళవారం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను గుజ‌రాత్ అసెంబ్లీ స్పీక‌ర్ నీమాబేన్ ఆచార్య‌కు స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గిరిజ‌నులు అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ వ‌ల్లే గిరిజ‌నుల అభివృద్ధి సాధ్య‌మ‌ని తాను న‌మ్ముతున్నాన‌ని కొత్వాల్ కామెంట్స్‌ చేశారు.

* సంక్షేమ రాజ్యం కాదు.. సంక్షోభ రాజ్యం: తులసిరెడ్డి
వైసీపీది సంక్షేమ రాజ్యం కాదని… ఇది సంక్షోభ రాజ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. 1975లోనే స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ సంక్షేమ కార్యక్రమాలతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రాంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్‌లో 50 శాతానికి మించి సంక్షేమం మీద ఖర్చు పెట్టేవన్నారు. 2014-15లో 53 శాతం సంక్షేమం మీదే ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో 2019-20లో 39 శాతం, 2020-21లో 41 శాతం మాత్రమే సంక్షేమం మీద ఖర్చు పెట్టడం జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

*నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనం: చంద్రబాబు
ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసును టీడీపీ అధినేత Chandrababu ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనమన్నారు. మహిళానేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్‌ దగ్గర నినాదాలు చేయడం నేరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలు నినాదాలు చేయడం నేరం అన్నట్లు కేసులు పెట్టారన్నారు. మహిళలపై దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తప్పుడు కేసులతో ప్రభుత్వం గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. అత్యాచార మహిళ పేరు ఫిర్యాదు కాపీలో రాసి బహిర్గతం చేశారన్నారు. వైసీపీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని అశించడం తప్పేనేమోనన్నారు. మహిళలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*దయచేసి మేలుకోండి…. స్త్రీని గౌరవించేలా సమాజాన్ని తీర్చిదిద్దుదాం: విజయశాంతి
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న అత్యాచారాలు దారుణాలపై బీజేపీ నేత విజయశాంతి ఫేస్‌బుక్ ద్వారా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినడానికే జుగుప్స కలిగించే దారుణ అత్యాచారాలు గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్నాయన్నారు. ఈ నీచ కృత్యాలకు పాల్పడినవారిలో కొందరు బయటివారు కాగా… మరికొందరు కుటుంబ సభ్యులే కావడం పరమ హేయమని మండిపడ్డారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ పాపాత్ములకు పసిపిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేదన్నారు. ఈ పరిణామాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకపోవచ్చు, కానీ ఇటీవల ఈ పాపాలు జరిగింది తెలుగు నేలపై కావడంతో సోషల్ మీడియా సహా మన చానెళ్లు, పత్రికలు ఏం చూసినా ఇవే కనిపిస్తూ అందరినీ నిలదీస్తున్నాయని బీజేపీ నేత అన్నారు.

*ఎన్నికలు ఎప్పుడొచ్చినా పసుపు జెండా ఎగరేస్తాం : కోట్ల సూర్య
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా ఎగుర వేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మిగనూరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సూర్య ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో పథకాలన్నీ సంక్షేమంగా… జగన్ హయంలో పథకాలన్నీ సంక్షోభంగా మారాయన్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ అడపిల్లలకు పెళ్లి కానుక ఆర్థిక సాయంగా అందిస్తే జగన్ వాటిని రద్దు చేశారని కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.

*నినాదాలివ్వడమే నేరమా?: చంద్రబాబు
మహిళలపై హింసను అరికట్టడంలో విఫలమైన జగన్‌ సర్కార్‌ తప్పుడు కేసులతో.. గళమెత్తిన గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలులో హోం మంత్రి కాన్వాయ్‌ వద్ద మహిళలు నినాదాలు ఇవ్వడమే నేరం అన్నట్లు 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని ఓ ప్రకటనలో ఖండించారు. నిరసన తెలిపినవారిపై అట్రాసిటీ కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుతనానికి నిదర్శనమన్నారు. ఈ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని, మహిళల్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తల్లులకు బాధ్యతల గురించి చెప్పే ప్రజాప్రతినిధులు ముందు వారి బాధ్యత ఏంటో తెలుసుకోవాలని సూచించారు

*వైసీపీ రౌడీలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం: అచ్చెన్నాయుడు
‘‘టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ రౌడీలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం. తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

**రాక్షసుడు జగన్ పాలనలో కోడెల ప్రాణాలు తీసుకున్నారు: కొల్లు రవీంద్ర
రాక్షసుడు జగన్మోహనరెడ్డి పాలనలో కోడెల ప్రాణాలు తీసుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నవరత్నాలు పేరుతో ప్రజల వద్ద నవరసాలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆడ బిడ్డలకు స్వేచ్చ లేదని, రాష్ట్రంలో జరిగిన ఘటలను భాద్యతగా తీసుకుని హోమ్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్లిన లోకేష్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. వైసీపీ ఎమ్మెల్ హస్తంతో వైసీపీ కార్యకర్త గోపాలపురములో దారుణ హత్యకు గురి అయ్యాడు అని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడలేని మంత్రులు పాలన చేస్తున్నారని విమర్శించారు. గంట, అరగంట, మాట్లాడే మంత్రులుతో ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రన్ని అన్ని విధాలుగా దోచుకుంటున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు.

*ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ నం.1: కేటీఆర్‌
పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించి ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలోని 12769గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ విధానంలో వంద శాతం ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంబంధిత విభాగాల అధికారులను అభినందించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ.. స్థానిక సంస్థల ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ జాతీయ స్థాయిలో రెండోసారి ముందంజలో నిలువడం ఆనందంగా ఉందన్నారు.

*రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోరాటాలకు కేంద్రంగా ఉన్న వరంగల్‌లో రాహుల్ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలా మరో వైపు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వానికి సరైన వ్యవసాయ విధానం లేదన్నారు. ఓసారి వరి వేయాలంటారు, మరోసారేమో వరివేస్తే ఉరి అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవన్నారు. రైతులకు ఆత్మవిశ్వాసం నింపేందుకే రాహుల్‌ సభ అన్నారు.

*బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలి: షబ్బీర్‌ అలీ
రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు నష్టపోతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేదని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షన సభను విజయవంతం చేయాలని షబ్బీర్‌ అలీ కోరారు.

*పీఅండ్‌జీ పరిశ్రమను విస్తరించి ఉద్యోగాలు కల్పించండి: కేటీఆర్‌
పీఅండ్‌జీ పరిశ్రమను విస్తరించి ఉద్యోగ అవకాశాలు పెంచాలని మంత్రి కేటీఆర్‌ పరిశ్రమ అధికారులను కోరారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండల పరిధిలోని పెంజర్ల గ్రామ శివారులో గల పీఅండ్‌జీ (బహుళజాతి పరిశ్రమ)లో రూ.200కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన డిటర్జెంట్‌ లిక్విడ్‌ ప్లాంట్‌ను సోమవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పీఅండ్‌జీ పరిశ్రమకు గతంలో 170ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం 35శాతం భూమిలో పరిశ్రమ విస్తరించి ఉందని, వందశాతం భూమిలో పరిశ్రమను విస్తరించి స్థానిక యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని పరిశ్రమ అధికారులను కోరారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తామన్నారు. రానున్నా రోజుల్లో డిటర్జెంట్‌ లిక్విడ్‌ ప్రజలకు అధికంగా వినియోగంలోకి రానుందన్నారు. పీఅండ్‌జీ పరిశ్రమ డిజర్జెంట్‌ లిక్విడ్‌ ఉత్పత్తి చేయడం సంతోషకరమన్నారు.

*మీడియా ప్రచారం కోసమే ఆ నాయకుల డ్రామాలు: జగదీష్‌రెడ్డి
మీడియా ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కొంగ జపాలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. నాయకత్వం, అంతర్గత విభేదాలను పరిష్కరించడం కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులను చూసి భయపడుతున్నారని తెలిపారు. 2014,2018 సంవత్సరంలోనే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 66 ఏళ్ల కాంగ్రెస్ పాలన అనుభవాలను ఏడేళ్ల టీఆర్ఎస్ పాలన అనుభవాలను ప్రజలు గుర్తిస్తూ గమనిస్తున్నారని చెప్పారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరో తెలుసుకున్నాకే విమర్శలు చేయాలని జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.