Movies

హిందీ మాట్లాడేవారంతా మంచివారు

హిందీ మాట్లాడేవారంతా మంచివారు

హిందీ భాషా వివాదంలోకి సీనియర్‌ సినీ నటి సుహాసిని తలదూర్చారు. హిందీ చాలా మంచి భాష అని, ఆ భాషను మాట్లాడేవారంతా చాలా మంచివారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కరుడుగట్టిన తమిళవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని స్థానిక టి.నగర్‌లోని ఒక జ్యూవెలరీ షాపులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య యుద్ధం సాగుతున్న ప్రస్తుత తరుణంలో బంగారంలో పెట్టుబడులు అత్యంత సురక్షితమన్నారు. మలయాళ చిత్రాలను ఇపుడు భారతదేశ సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తున్నారని, దుల్కర్‌ సల్మాన్‌, ఫహద్‌ ఫాజిల్‌ వంటి నటులకు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని చెప్పారు. తమిళ, మలయాళ చిత్రాలు నాణ్యతలో అద్భుతంగా ఉన్నాయని, తెలుగు చిత్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయని, కన్నడ చిత్రాలు కూడా మనం ఊహించని స్థాయికి చేరుకున్నాయని ఆమె పేర్కొన్నారు. అదేసమయంలో సినీ నటీనటులకు అన్ని భాషల్లోనూ ప్రావీణ్యం ఉండాలన్న సుహాసిని.. ‘అన్ని భాషలను గౌరవించాలి. అందరూ అన్ని భాషలను సమానంగా చూడాలి. హిందీ మంచి భాష. దాన్ని నేర్చుకోవాలి. హిందీ మాట్లాడేవారు మంచివారు. వారితో మనం మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలి. తమిళులు కూడా మంచివారే. వారితో తమిళంలో మాట్లాడటం చాలా సంతోషం’ అని అన్నారు.