DailyDose

ఫోర్బ్స్‌ మెచ్చిన లేడీ బాస్‌.. ఇంత‌కీ ఎవ‌రామె !!

ఫోర్బ్స్‌ మెచ్చిన లేడీ బాస్‌.. ఇంత‌కీ ఎవ‌రామె !!

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల అధినాయకత్వ స్థానాల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. మనవాళ్ల సమర్థతను ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఆ జాబితాలో చేరిన మరో ఆణిముత్యం అర్చనా రావ్‌. తాము పనిచేస్తున్న సంస్థల పనితీరులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి.. లాభాల బాట పట్టించిన సీఐవో (చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌)ల చిట్టా.. ‘ద ఫోర్బ్స్‌ సీఐవో నెక్ట్స్‌ లిస్ట్‌:2022’ తాజాగా విడుదలైంది. ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించి చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగిన అర్చనా రావ్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన అట్లాషియన్‌ సంస్థలో తను సీఐవోగా పనిచేస్తున్నారు.అర్చన కోసమే ప్రత్యేకించి తమ కంపెనీలో ఈ పదవిని సృష్టించింది అట్లాషియన్‌. మైసూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ తర్వాత, ఐఐటీ మద్రాస్‌ నుంచి మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు అర్చన. దాదాపు 20 ఏండ్లుగా టెక్‌ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో అర్చన దిట్ట. తనకున్న సమయంలో యాభైశాతానికి పైగా వినియోగదారులతో చర్చలకే కేటాయిస్తారామె. మనిషి పనిని సులభతరం చేయడమే లక్ష్యంగా టెక్నాలజీని రూపొందించాలని తన సహచరులకు దిశానిర్దేశం చేస్తారు. అలా అర్చన బృందం దాదాపు లక్ష పనిగంటలను ఆదా చేసిందట. 2021 ఆర్థిక సంవత్సరానికి అట్లాషియన్‌ రాబడి రెండు బిలియన్‌ డాలర్లను అధిగమించడంలో అర్చనపాత్ర ఎంతో ఉంది.