Devotional

ఘనంగా రంజాన్.. కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు.- TNI ఆధ్యాత్మికం

ఘనంగా రంజాన్.. కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు.- TNI ఆధ్యాత్మికం

1. దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తర్వాత దిల్లీలోని జామా మసీద్కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థనలు చేశారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. జామా మసీదు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. రంజాన్.. సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ ప‌ర్వ‌దినం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. చార్మినార్, మ‌క్కా మ‌సీదు, మీరాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మ‌సీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. సామూహిక ప్రార్థ‌నల‌తో మ‌సీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం వెల్లివిరిసింది. ముస్లిం సోద‌రులు ఒక‌రికొక‌రు రంజాన్ శుభాంక్ష‌లు చెప్పుకున్నారు.

2. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖరరావు సోమవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో జస్టిస్‌ రాజశేఖర్‌రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

3. భక్తులకు మరింత వేగంగా శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, వేగంగా దర్శనం కల్పించేందుకు టికెట్‌ రహిత దర్శనం కల్పించడంతో పాటు టైంస్లాట్‌ సర్వదర్శనం, దివ్యదర్శనం (కాలినడక భక్తులకు) ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే టోకెన్ల జారీ ప్రక్రియను మొదలుపెడతామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరిగింది. సమావేశానంతరం ఈవో జవహర్‌రెడ్డితో కలిసి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. అక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్ల విరాళమిచ్చేందుకు రేమండ్స్‌ సంస్థ అధినేత గౌతమ్‌ సింఘానియా ముందుకొచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ముంబై నగరంలో శ్రీవారి ఆలయం కేవలం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇరుకైన ప్రాంతంలో ఉందన్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విశాలమైన ప్రాంగణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. జమ్ములో శ్రీవారి ఆలయాన్ని డిసెంబరు నాటికి పూర్తిచేస్తామన్నారు. కాగా.. శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలకు బంగారు పూత పూయడానికి రూ.3.61 కోట్లతో టెండర్లకు ఆమోదం. పాతవి ట్రెజరీకి తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు కాలినడక మార్గంలో మరమ్మతులు పూర్తయిన క్రమంలో మే 5వ తేదీ నుంచి భక్తులకు అనుమతించనున్నారు. తిరుమల బాలాజీనగర్‌ వద్ద 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ర్టిక్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీకి నగదు రూపంలో విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలు ఘన, వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23వ సంవత్సరానికి టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్‌ సిద్ధాంతిని నియమించారు. రూ.240 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న శ్రీపద్మావతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మే 5న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

4. వైవీ సుబ్బారెడ్డి రూ.90 లక్షల విరాళం
టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రూ.90 లక్షలు విరాళంగా అందజేశారు. మే ఒకటో తేదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విరాళాన్ని అందజేశారు.

5. 1201 మంది హజ్‌ యాత్రికుల ఎంపిక
రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లేందుకు 1201 మంది హజ్‌ యాత్రికులను సోమవారం ఎంపిక చేశారు. కర్నూలు కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్‌ కలిసి మౌల్సీ, ముల్లా, యాత్రికులు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ ఇశాక్‌ బాషా, హజ్‌ కమిటీ సభ్యుల సమక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా డ్రా తీసి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హజ్‌ కమిటీ చైర్మన్‌ డీఎస్‌ గౌస్‌ లాజం మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం 1,416 మంది హజ్‌ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే కేంద్ర హజ్‌ కమిటీ 1201 మందిని మాత్రమే రాష్ట్ర కోటాగా నిర్ణయించిందని, ఈ మేరకు కేంద్ర హజ్‌ కమిటీ నిబంధనల ప్రకారం డ్రా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో 36 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ లోపు పాస్‌ పోర్టును కార్యాలయానికి సమర్పించాలన్నారు. అలాగే రూ.81 వేల పే ఇన్‌ స్లిప్‌ లను కూడా ఇవ్వాలని సూచించారు. మెడికల్‌ ఫిట్‌నె్‌సతో పాటు ఇటీవల తీసుకున్న పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలను కూడా యాత్రికులు సమర్పించాలని కోరారు.

6. రామయ్య హుండీ ఆదాయం రూ.2 కోట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 59 రోజులకు హుండీల ద్వారా రూ.2,00,22,897 ఆదాయం లభించింది. ఈ నగదుతో పాటు 140 గ్రాముల బంగారం, 2.500 కేజీల వెండి వచ్చాయి. 780 అమెరికన్‌ డాలర్లు, 300 మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 100 రష్యా రూబుల్స్, 30 దీరామ్స్, 101 బూటాన్‌ కరెన్సీ, ఒక సౌదీ రియాల్‌ లభించాయి.రెండేళ్ల అనంతరం శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం వేడుకలను మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో అ«ధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి రామయ్యకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించిందని ఈవో శివాజీ తెలిపారు
7. సింహగిరిపై చందనోత్సం సందర్భంగా భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. చందనోత్సవంలో ఇప్పటి వరకు 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. కలెక్టర్ మల్లిఖార్జున, సీపీ శ్రీకాంత్ దేవస్థానంలోనే ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అపరిచితుల కదలికలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బయట వ్యక్తులు అందజేసే ప్రసాదాలు స్వీకరించవొద్దని సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు

8. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్ళిన బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు అన్నామలై అక్కడిసీతామాత ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి కి.మీ. దూరంలోని నువేరాఎలియా జిల్లాలో వెయ్యేళ్లనాటి సీతాదేవి ఆలయం ఉంది. రావణాసురుడు సీతాదేవిని నిర్బంధించిన ప్రాంతంలోనే ఆ ఆలయం ఉందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఆ ఆలయంలో ప్రాచీన సీతారాములులక్ష్మణఆంజనేయ శిల్పాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయ నిర్వహణ బాధ్యతలను భారతీయ సంతతికి చెందిన తమిళ ప్రముఖులు నిర్వర్తిస్తున్నారు. ఇంతటి ఖ్యాతి చెందిన ఆ ఆలయాన్ని అన్నామలై దర్శించారు. ఆలయం వద్ద ఆయనకు ప్రధానార్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఆయనకు ప్రసాదాలను అందజేశారు. ఈ ఆలయ సందర్శనపై అన్నామలై ట్విట్టర్‌లోస్టు చేసిన ఓ సందేశంలో శ్రీలంకభారతదేశ చరిత్రనాగరికత ఇంచుమించూ ఒకే విధంగా ఉన్నాయనిసుప్రసిద్ధమైన సీతామాత ఆలయాన్ని సందర్శించడం వింత అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

9. రెండేళ్ల చందనోత్సవం భక్తుల దర్శనం లేకుండా జరిగింది: స్వరూపానంద
సింహచల వరాహలక్ష్మీ నరసింహ స్వామిని శారదా పీఠాధిపతులు స్వరూపానదేంద్ర సరస్వతి, స్వాత్మనదేంద్ర సర్వసతి దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌తో యావత్ ప్రపంచం అతలాకుతలమైందన్నారు. రెండు సంవత్సరాల చందనోత్సవం భక్తుల దర్శనం లేకుండా జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు చందనోత్సవాన్ని పట్టించుకునేవి కాదన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చందనోత్సవం నూతన కమిటీ వేసిందన్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ సీపీ కూడా క్యూ లైన్‌లో భక్తులను పంపిస్తూ కష్టపడి పని చేస్తూ భక్తులకు సౌకర్యాలు చేస్తున్నారన్నారు. ఒడిశా వాసులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారన్నారు. అందరికి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని స్వరూపానంద పేర్కొన్నారు.

10. కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనంతో పాటు మాంచాలమ్మ, పూర్వ పీఠాధిపతుల మూల బృందాలకు శ్రీ గంధంతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు ఆలయానికి తరలివచ్చారు

11. తెలంగాణ గవర్నర్ తమిళి సై విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చందనోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తమిళిసై మీడియాతో తెలుగులో మాట్లాడారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.