Politics

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌!

నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. కాఠ్‌మాండూలోని పాపులర్‌ నైట్‌ క్లబ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఆ పార్టీలో రాహుల్‌గాంధీ పక్కనే నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా పనిచేస్తున్న యువతి కూడా ఉండటం రాజకీయ దుమారాన్ని సృష్టించింది. బీజేపీ నేత కపిల్‌ శర్మ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఎవరో గుర్తు పట్టండి’ అంటూ నిప్పు రాజేశారు. అది సోషల్‌ మీడియాలోనే కాకుండా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మీడియా మిత్రురాలు సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ ఐదు రోజుల పర్యటనపై నేపాల్‌ వచ్చినట్లు అక్కడి పత్రికలు రాశాయి. సుమ్నిమా ఉదాస్‌ కొన్నాళ్లు సీఎన్‌ఎన్‌ ఢిల్లీ విలేకరిగా పని చేశారు. ఆమె తండ్రి మయన్మార్‌లో నేపాల్‌ రాయబారి.వివాహం ఏర్పాట్లలో భాగంగా రాహుల్‌గాంధీకి, ఇతర మిత్రులకు మారియట్‌ హోటల్లో బస ఏర్పాటు చేశారు. కపిల్‌ శర్మ షేర్‌ చేసిన ఈ వీడియోలో నైట్‌క్లబ్‌లో జోరుగా సంగీతం వినిపిస్తుండగా, రాహుల్‌గాంధీ మరో ముగ్గురు వ్యక్తులు ఒక టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. మిగతా వ్యక్తులు డ్రింక్స్‌ తాగుతుండగా రాహుల్‌ మాత్రం పక్కనున్న యువతితో మాట్లాడుతూ, ఫోన్‌ చూస్తూ కనిపించారు. రాహుల్‌ వ్యక్తిగత జీవితంతో తమకు పని లేదని, ఆయన చైనా ఏజెంట్లతో కూర్చున్నపుడు ప్రశ్నించక తప్పదని కపిల్‌ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాహుల్‌గాంధీ విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ విమర్శించారు. 2008లో ముంబై మీద ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌లో ఉన్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మత ఘర్షణలు జరుగుతుంటే ఆ పార్టీని నడిపించాల్సిన రాహుల్‌ విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నారని బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోశారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ గట్టిగానే బదులిచ్చింది. మిత్రదేశం నేపాల్‌లో స్నేహితుడి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి రాహుల్‌గాంధీ వెళ్లడం నేరమేమీ కాదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీయే 2015లో ప్రత్యేక విమానంలో నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో పిలవని పేరంటానికి వెళ్లి, కేక్‌ కట్‌ చేసి మరీ వచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. బీజేపీ నేత తేజ్‌పాల్‌ బగ్గా మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్‌ నిజాయితీకి చప్పట్లు కొట్టాలి. సోమవారం రాత్రి పది గంటలకు రాహుల్‌గాంధీ నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో ఎంజాయ్‌ చేస్తుంటే ఆ పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ దేశం సంక్షోభంలో ఉంటే సాహెబ్‌(ప్రధాని) విదేశాలకు ఎలా వెళ్తారని ట్వీట్ల మీద ట్వీట్లు వేసి నిలదీసింది’’ అన్నారు.నిజానికి సోమవారం రాత్రి కాంగ్రెస్‌ పెట్టిన ఈ ట్వీటే బీజేపీని రాహుల్‌గాంధీ మీద వ్యక్తిగత దాడికి దిగేట్లు చేసిందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పప్పు కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. పార్ట్‌ టైం రాజకీయ డ్రామాలో చేస్తున్న ప్రకటనలు కూడా అర్థ రహితంగా ఉంటున్నాయని, మత్తులో మునిగి తేలుతున్న వ్యక్తులే అలాంటి ప్రకటనలు చేస్తారని ఎద్దేవా చేశారు.

తప్పేముంది?: ఠాగూర్‌
రాహుల్‌ ఓ వివాహ విందుకు హాజరవడంలో తప్పు ఏముందని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ ప్రశ్నించారు. షాంపేన్‌ బాటిల్‌ను చిమ్ముతున్న బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ ఫొటోను ఆయన షేర్‌ చేశారు. కాగా.. పెళ్లి కూతురు సుమ్నిమాకు కాబోయే భర్త నిమా మార్టిన్‌ షెర్ఫా, 12 ఏళ్ల పాటు చైనాలో పలు వ్యాపారాలు చేశారని మీడియా కథనాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. రాహుల్‌ ఎంపీ నియోజకవర్గం వయనాడులో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు. రాహుల్‌ యూపీలోని అమేఠీ, కేరళలోని వయనాడు నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేఠీలో ఆయన్ను ఓడించిన స్మృతి, ఇప్పుడు వయనాడులో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.