DailyDose

అన్న ఎన్టీఆర్ పెళ్లి వెనుక ఆసక్తికర కథనం ఇది

అన్న ఎన్టీఆర్ పెళ్లి వెనుక ఆసక్తికర కథనం ఇది

కళ్యాణరాముడికి 80 వసంతాలు .. అన్నగారి పెళ్ళిరోజు .. 02-05-1942 దిన అన్నగారు బసవతారకం గారు వివాహబంధంలో ఒక్కటయ్యారు.. ఆ పెళ్ళికి దారితీసిన పరిస్థితులు, దాని పర్యవసానాలు గురించి చిన్న కధనం ..

తెలిసినవారు బొంబాయిలో న్యాయపరమైన చిక్కుల్లో ఉంటే విజయవాడ నుండి బొంబాయి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకొని విజయవాడకు యన్టీఆర్ తిరిగివచ్చే సమయానికి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. పరీక్షలకు ముందు దాదాపు రెండు నెలలు బొంబాయిలో గడపడం వల్ల ఆయన పరీక్షలకు తయారు కాలేకపోయారు.. రెండు పేపర్లలో పరీక్ష తప్పారు.. ఇంటర్లో తప్పి ఇంటిపట్టున ఉన్న కుర్రవాళ్ళకి పెళ్ళి చేయడం ఆ రోజుల్లో ఆనవాయితీ.. ఇంటర్లో తప్పడంతో యన్టీఆర్ పెళ్ళికి అర్హత సంపాదించుకున్నారు..
సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. యన్టీఆర్ గారి చిన్నాన్న, లక్ష్మయ్య గారి తమ్ముడు అయిన నాగయ్య తన భార్య తరఫు నుంచి ఒక సంబంధం తెచ్చారు. ఇంకో సంబంధం యన్టీఆర్ గారి తల్లిగారైన వెంకటరావమ్మ గారికి వరుసకు అన్నయ్య అయిన కాట్రగడ్డ చెంచయ్య వైపునుంచి వచ్చింది. చెంచయ్య గారిది కొమరవోలు గ్రామం. ఆ గ్రామానికి ఆయన మునసబు. ఆయన కుమార్తె బసవరామ తారకం. యన్టీఆర్కు ఆ కుటుంబం తెలుసు. తారకం ఆయన కళ్లముందే పుట్టి పెరిగింది. చెంచయ్యగారే స్వయంగా సంబంధం అడగడానికి వచ్చారు. లక్ష్మయ్య ఎటూ తేల్చుకోలేక పోయారు. ఒక సంబంధం తన తమ్ముడు తీసుకువచ్చింది కాగా మరో సంబంధం భార్య తరఫు నుంచి వచ్చింది. రెండు వైపులా కావల్సిన వాళ్ళే. ఎవరిని కాదన్నా, ఎవరి మనసును కష్టపెట్టినా చివరకు బాధపడవలసింది తానే. అందుకే యన్టీఆర్ అభిప్రాయం అడిగారు. ఆయన చెంచయ్యగారి సంబంధం వైపు మొగ్గు చూపారు. లక్ష్మయ్య ఈ విషయంలో తటస్థంగా ఉన్నారు. యన్టీఆర్ గారికి వరుసకు పెదనాన్న, అంతకు మించి తరువాతి కాలంలో కళారంగం వైపుకి వెళ్ళేలా ప్రోత్సహించిన నందమూరు రామయ్య కూడా బసవరామ తారకమే తమ తారకరాముడికి సరిజోడి అన్నారు.
r3
తను చెప్పిన సంబంధం కాదన్నారని నాగయ్యకు కోపం. లక్ష్మయ్య పై కక్ష పెంచుకున్నారు. యన్టీఆర్ నిమ్మకూరు వెళ్లి రామయ్య వద్ద ఉన్నారు. పెళ్లి ఖరారైంది. చివరికి పెళ్లి పత్రికలో వరుని తండ్రి నందమూరు రామయ్య అని రాసివుంది. నాగయ్యతో మనస్పర్థలు, తగాదా ఏ అనర్ధానికి దారితీస్తుందోనని భయపడి, కుమారుని వివాహానికి రాలేదు లక్ష్మయ్య. 1942వ సంవత్సరం మే 2వ తేదీన కొమరవోలులో యన్టీఆర్ బసవరాజు తారకంల పెళ్ళి జరిగింది. పెళ్ళికి తల్లితండ్రులిద్దరూ హాజరుకాలేదు.పెళ్ళి జరిగిన కొంత కాలానికే లక్ష్మయ్య భయపడిందంతా జరిగింది. అంతకుముందరే నాగయ్య తన పొలాన్ని అమ్మచూపగా లక్ష్మయ్యగారు కొందామని తమ్ముడే కదా అని నోటిమాటపైనే కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చియున్నారు, పెళ్ళి విషయంలో ఇలా జరిగినప్పటికి అన్నయ్యకు చెప్పకుండా నాగయ్య ఆ పొలాన్ని వేరొకరికి అమ్మకానికి పెట్టారు, ఈ వార్త వినగానే లక్ష్మయ్యగారు ఆందోళనతో నిమ్మకూరు వెళ్లి చూడగా తన తమ్ముడు నిజంగానే విశ్వాసఘాతుకానికి ఒడిగట్టినట్లు రుజువైంది. తాను డబ్బు తీసుకోలేదని వాదించాడు నాగయ్య. పసిపిల్లవాడిలా చెప్పినదంతా నమ్మే అన్నగారి విశ్వాసానికి చాలా సులభంగానే అతడు విఘాతం కలిగించాడు..లక్ష్మయ్య సర్వమూ కోల్పోయారు..

మొదట్లో ఉమ్మడికుటుంబం నుంచి విడిపోయినప్పుడు లక్ష్మయ్య గారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. తర్వాత అప్పు తీర్చడానికి పొలం అమ్ముకున్నారు. బెజవాడలో పాల వ్యాపారం కలిసి వచ్చింది. పొలం కొన్నారు. కానీ ఇప్పుడు తమ్ముడి మోసానికి గురై పొలం పోగొట్టుకున్నారు. యన్టీఆర్ నటజీవితంలో నిలదొక్కుకున్నాక, సంపాదన పెరిగిన తరువాత, లక్ష్మయ్యని మోసం చేసి నాగయ్య ఎవరికో అమ్మిన భూమిని యన్టీఆర్ మళ్లీ కొనుగోలు చేశారు. లక్ష్మయ్యగారు అప్పు తీర్చడానికి అమ్ముకున్న భూమిని కూడా తిరిగి కొన్నారు. ఆ రెండింటినీ ఆయన తండ్రి లక్ష్మయ్యగారి పేరనే రిజిస్టర్ చేశారు. యన్ టి ఆర్ తండ్రికి గర్వకారణమయ్యారు…