Health

తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం

తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం

ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి. అనారోగ్యాలను దరిచేరనియ్యవు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. మండే ఎండల్లో ముంజల స్మూతీ తాగితే వడదెబ్బకు గురికారు. చురుక్కుమనే ఎండల వల్ల చర్మం పై ఏర్పడే చెమటకాయలు, దద్దుర్లు రావు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలో బాధపడుతున్న వారు ఈ జ్యూస్‌ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. పాలిచ్చే తల్లులుకు దీనిని తాగితే పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఫలితంగా తల్లిపాల నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ జ్యూస్‌లోని పుష్కలమైన ఖనిజ పోషకాలు, విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి.

*ముంజల స్మూతీ తయారీకి కావలసినవి
తాటి ముంజలు – ఆరు, కాచిన చల్లటి చిక్కటి పాలు – రెండు కప్పులు, పంచదార – మూడు టేబుల్‌ స్పూన్లు, నానబెట్టిన సబ్జాగింజలు – టేబుల్‌ స్పూను.

*తయారీ:
ముందుగా తాటిముంజలను తొక్కలు లేకుండా శుభ్రం చేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో పాలు, పంచదార వేసి నిమిషం పాటు గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు పాలమిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకున్న తాటిముంజల మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో సబ్జాగింజలు వేసి చక్కగా కలుపుకుని సర్వ్‌ చేసుకోవాలి.