Health

రాముడు మెచ్చిన ఆ పండు గురించి తెలుసా..?

రాముడు మెచ్చిన ఆ పండు గురించి తెలుసా..?

నల్లగా నిగనిగ మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే నేరేడు పండ్ల అమ్మకాలు నగరంలో జోరందుకున్నాయి. మార్కెట్లో కాలానుగుణంగా వచ్చే పండ్లు రుచితోపాటు ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటి వాటిలో అల్లనేరేడు ఒకటి. జూన్‌ నెల ఆరంభంలో అల్లనేరేడు పంట చేతి కొస్తుంది. ఈ సీజన్‌లో విరివిగా దొరికే ఈ పండ్లను రుచి చూడని వారంటూ ఉండరు. అందుకే మార్కెట్లో కనబడగానే వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మార్కెట్లో ఇప్పుడు అల్లనేరేడు పండ్లు విరివిగా అమ్ముడవుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి నేరేడు పండ్లు దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో పండ్ల వ్యాపారులు వీటిని కిలో రూ. 100 నుంచి రూ.200 అమ్ముతున్నారు.

*రాముడు మెచ్చిన పండు
రామాయణంలో శ్రీరాముడు 14ఏళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లను తిని కాలం గడిపారని పెద్దలు చెబుతారు. అందుకనే భారత దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దీనిని దేవతాఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈపండును అపర సంజీవని పిలుస్తారు. ఈ పండులో విటమిన్‌ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు ఔషధ తయారీలో వాడుతారు. ఈ నేరేడు చెట్టు కాయల నుంచి వెనిగర్‌ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.

*అపర సంజీవని
నేరేడు పండులోని అనేక సుగుణాలు అన్ని వయస్సుల వారికి ఉపయోగకారిగా పని చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు విరివిగా లభించడంతో వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి పోతాయి. ఇవి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. కిడ్ని రాళ్లతో బాధపడే వారు. నిత్యం నేరేడు పండ్లు తినడం వలన రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. అందుకే దీని ఔషధాల గనిగా పేర్కొంటారు.

*మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే..
ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాగే ఏ సీజన్లో దొరికే పండ్లను.. ఆ సీజన్లో తినాలి. దీంతో సంపూర్ణం ఆర్యోగం సొంతమవుతోంది. కొన్ని పండ్లతో రోగాలను తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

*చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది. అంతేకాదు వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.

*ఇక కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని చెబుతున్నారు.ఎంతో ఉపయోగకరమైన నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యులు డాక్టర్ ఆర్.శ్రీనివాస్ తెలిపారు. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుందని వివరించారు.