Devotional

ఈనెల 11 నుండి చినవెంకన్న వైశాఖ బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

ఈనెల 11 నుండి చినవెంకన్న వైశాఖ బ్రహ్మోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

1. ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభంకానున్నాయి. 11 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 15 న స్వామి వారి తీరు కల్యాణ మహోత్సవం, 16 న స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య ఆర్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

2. శ్రీవారిమెట్టు మార్గంలో నేటినుంచి భక్తులకు అనుమతి
చంద్రగిరి సమీపంలోని శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్ళే శ్రీవారిమెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతించనున్నారు.గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీవారిమెట్టు మార్గం పూర్తిగా దెబ్బతింది.టీటీడీ యంత్రాంగం రూ.3.5 కోట్లతో ఈ మార్గానికి మరమ్మతులు చేపట్టింది.గురువారం ఉదయం 8 గంటలకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు శ్రీవారిమెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను ఈ మార్గంలో తిరుమలకు అనుమతించనున్నారు.

3. వెంకన్న ఆదాయం వంద కోట్లు దాటేసింది
వడ్డీ కాసులవాడి హుండీ కళకళలాడుతోంది. కరోనా తర్వాత మార్చి నెల తరహాలోనే ఏప్రిల్‌ నెలలోనూ హుండీ ఆదాయం వంద కోట్లు దాటేసింది. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు 20,62,323 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఏప్రిల్‌ 13న అత్యధికంగా 88,748 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు సమర్పించిన కానుకలతో అత్యధికంగా రూ.5.11 కోట్లు లభించింది. మార్చి నెలలో 19,72,656 మంది దర్శించుకోగా, రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరింది.

4. లౌడ్స్పీకర్లు లేకుండా బాబాకు కాకడ్ హారతి- షిర్డీలో తొలిసారి!
ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయంలో లౌడ్స్పీకర్లు లేకుండానే బాబాకు కాకడ్ హారతి ఇచ్చారు. మహారాష్ట్రలో లౌడ్స్పీకర్లపై వివాదం నేపథ్యంలో ఇలా చేసినట్లు సమాచారం.షిర్డీ సాయిబాబాకు కాకడ్ హారతి విషయంలో అనేక ఏళ్ల తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు.సాయి బాబాకు రోజులో నాలుగు సార్లు అర్చకులు హారతి ఇస్తారు. ఉదయం 5.15 గంటలకు కాకడ్ హారతి ప్రారంభం అవుతుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు వేకువజామునుంచే ఆలయంలో ఎదురుచూస్తారు. అయితే.. బుధవారం మాత్రం కాస్త భిన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. “పోలీసుల నుంచి మాకు ఓ లేఖ అందింది. లౌడ్స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారు ప్రస్తావించారు. వాటిని అనుసరించి ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి” అని వివరించారు షిర్డీ సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ బనాయత్. షిర్డీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గులాబ్రావ్ పాటిల్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. ఆ సమయంలో అజాన్ కోసం కూడా లౌడ్స్పీకర్లను వినియోగించలేదని స్పష్టం చేశారు.లౌడ్స్పీకర్లు ఆపేసి బాబాకు కాకడ్ హారతి- షిర్డీలో తొలిసారి!
*లౌడ్స్పీకర్లు వాడాల్సిందే!: లౌడ్స్పీకర్లు లేకుండా కాకడ్ హారతి నిర్వహించడంపై షిర్డీలోని జమా మసీద్ ట్రస్ట్, స్థానిక ఇస్లాం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా ఉన్న పద్ధతిని అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాబా ఆలయం.. షిర్డీకి అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చిందని, మతసామరస్యానికి ప్రతీకని అన్నారు.లౌడ్స్పీకర్లు ఆపేసి బాబాకు కాకడ్ హారతి- షిర్డీలో తొలిసారి!ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదే సమయంలో లౌడ్స్పీకర్ల వినియోగంపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. చర్చనీయాంశమయ్యాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించరాదన్నది సుప్రీం మార్గదర్శకాల్లో ఒకటి.

5. శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతివ్వనున్నారు. గత నవంబర్‌లో కురిసిన వర్షానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్‌ రోడ్‌ ధ్వంసమవగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.