DailyDose

ఆ పాఠశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ – TNI తాజా వార్తలు

ఆ పాఠశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ – TNI తాజా వార్తలు

*నారాయణ, శ్రీచైతన్య కళాశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకులు అయ్యాయని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పదోతరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని మండిపడ్డారు.ఆ పాఠశాలల నుంచే పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్వైకాపా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పదోతరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణకు చెందిన రెండు నారాయణ స్కూల్స్‌.. మూడు చైతన్య స్కూల్స్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులను.. తిరుపతి వేదికగా విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.”జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి రూ.13,023 కోట్లు ఖర్చు చేశాం. జూన్‌లో అమ్మఒడి కార్యక్రమానికి మరో రూ.6400 కోట్లు ఇస్తాం. తగిన చర్యలు తీసుకున్నందునే రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 73 లక్షలకు చేరింది.”- జగన్, ముఖ్యమంత్రి అత్యాచారాలకు పాల్పడింది తెలుగుదేశం వ్యక్తులేనని సీఎం జగన్ ఆరోపించారు. విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో జరిగిన అత్యాచారాలపై నానా యాగీ చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఏదేదో జరిగిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ మూడు ఘటనల్లో మహిళలు, బాలికలపై దాడికి యత్నించిన, అత్యాచారం చేసిన దుర్మార్గులు తెదేపా నేతలేనని చెప్పారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు.

* టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదవాడు అంటే గౌరవం, విలువ లేదని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఖమ్మం జిల్లా, రామనగరం గ్రామంలో రైతు గోస ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పేదరికం ఒక శాపంలా మారిందని, ఆ శాపంలోనే కూరుకుపొండని పాలకులు ఆజ్ఞపిస్తున్నారని, పాలకులే పేద ప్రజల పట్ల రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అప్పుల మీద అప్పులు రైతుకు కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టలేక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని షర్మిల దుయ్యబట్టారు

*చంద్రబాబును అడ్డుకున్న విశాఖ పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విశాఖలో పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఏపీ టూరిజం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం కూల్చిన రిసార్ట్‌ను పరిశీలనకు బయలు దేరిన బాబు బృందానికి అనుమతి లేదంటూ ఎండాడ జాతీయరహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.రిషికొండలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులతో వెళ్తుండగా పలువురిని అదుపులోకి తీసుకుని ఆటోలో ఇతర ప్రాంతాలకు తరలించారు. తనను అడ్డుకోవడంతో చంద్రబాబు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కొద్దిసేపటి అనంతరం బాబు రిషికొండ పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరిగారు.

*దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

*కిన్నెర వాయిద్యకారుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన రెండో కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే..మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూర్‌ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి దగ్గరే ఉంటుంది.మంగళవారం ఓ గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

*అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘాన్‌లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొం‍ది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

*దుగ్గిరాల MPP YCP అభ్యర్థిగా రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఎంపీపీ పదవికి పార్టీల తరఫున ఒకే ఒక్క బిఫామ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాటకీయ పరిణామాల మధ్య రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రూపవాణి ఎన్నికను అధికారులు ప్రకటించారు. ఎంపీపీ పద్మావతి ఆచూకీ ఇంకా తెలియలేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్‌ బుధవారం ఆరోపించారు. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు మండిపడ్డారు.

*వైసీపీ ఎంపీటీసీ పద్మావతి తనయుడు యేగేంద్రనాథ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొ్ంది. తన తల్లిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. ఇప్పటివరకూ తల్లి పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తీసుకురాకపోవడంపై.. యోగేంద్రనాధ్ ఆందోళన వ్యక్తం చేస్తూ… ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే ఆర్కే‌పై వైసీపీ ఎంపీటీసీ పద్మావతి తనయుడు యేగేంద్రనాథ్ ఆరోపణలు చేశారు. తన తల్లి ఎక్కడుందో ఎమ్మెల్యే ఆర్కే చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న (బుధవారం) ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తన అమ్మను తీసుకెళ్లారన్నారు. దుగ్గిరాల వైస్ ఎంపీపీ ఎన్నికల సమయానికి తన తల్లి పద్మావతిని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తన అమ్మను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని డీజీపీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని, ఈ ఘటనపై కోర్టుకు ఆశ్రయిస్తామని యోగేంద్రనాధ్ స్పష్టం చేశారు.

*కర్నూలు జిల్లా బేతంచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. బేతంచర్లలోని సంజీవయ్యనగర్‌లో నీరు రావడం లేదని కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసేందుకు నేతలు వెళ్లారు. అయితే… తనను కులం పేరుతో దూషించారని టీడీపీ నేతలపై కమిషనర్‌ ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఫిర్యాదుపై టీడీపీ నేతలు ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో సవాల్‌ చేశారు. టీడీపీ నేతల తరపున న్యాయవాది కృష్ణారెడ్డి వాదించారు. ఈ క్రమంలో కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.

*రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేతృత్వంలో ఉపకులపతుల సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల నుండి ఉప కులపతులు హాజరయ్యారు. కులపతి హోదాలో బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభోపన్యాసం చేశారు. రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీసీసోడియా, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాలకొండయ్య, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు హేమచంద్ర రెడ్డి సదస్సుకు హాజరయ్యారు.

*అల్లూరి: జిల్లాలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్ట్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఏవోబీ మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. మే 7న అల్లూరి వర్ధంతి సందర్భంగా వారి త్యాగాలను ఎత్తిపడదామని, ఆదివాసియులపై రాజ్యహింసను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో సభలను జరుపుకుందామని పోస్టర్లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద, దళారి నిరంకుశ బడా భూసామ్య వర్గాలను సమూలంగా నిర్ములించే లక్ష్యంతో నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగమవుదామని అన్నారు. మన్యంలో మళ్ళీ బాక్సీట్ వెలికితీత, పోరాడి సంపాదించుకున్న కాఫీ తోటల నుంచి ప్రజలను వెల్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ద్వారా తమ దోపిడిని యదావిధిగా కొనసాగించు కోవచ్చునని పాలకవర్గాల కలలు కంటున్నాయన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ పిలుపునిచ్చింది.

*అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ చేసిన సమయంలో ధరించిన జెర్సీ రికార్డు స్థాయిలో రూ. 71.16 కోట్లకు వేలంలో అమ్ముడైంది. 1986 వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లండ్‌పై మారడోనా చేసిన రెండు గోల్స్‌లో.. మొదటి గోల్‌ను డీగో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా అభివర్ణించాడు. సౌత్‌బీ అనే సంస్థ బుధవారం రాత్రి నిర్వహించిన ఈ వేలంలో.. ఆ జెర్సీని కొనుగోలు చేసిన వారి వివరాలు మాత్రం వెల్లడికాలేదు.

*ఉస్మానియా వర్సిటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు వీసీ అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ గేటు ముందే బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరూ బయటకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో జగ్గారెడ్డి, విద్యార్థి నేతలతో కలిసి గేటు ముందే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌ పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని బుధవారం మధ్యాహ్నం జగ్గారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరాయా? లేదా? అని తెలుసుకోవడానికి వస్తున్న రాహుల్‌ గాంధీ వస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని అందులో ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా తలపెట్టిన పర్యటనకు అనుమతి నిరాకరించడం వల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

*కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తిరుపతి పూర్వ సబ్‌ కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌, తొట్టెంబేడు తహశీల్దార్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరికి 3 నెలల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పు అమలును 6వారాల పాటు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. బ్యాంకు ఆక్షన్‌లో కొనుగోలు చేసిన 8 ఎకరాల భూమిని తన పేరుమీద రికార్డుల్లో నమోదు చేయాలని, పాసుపుస్తకాలు మంజూరు చేయాలని నారాయణపురం గ్రామానికి చెందిన ఎ.వేణుగోపాల్‌ 2011లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో 2014లో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ అభ్యర్థనను పరిశీలించి, పరిష్కారం చూపాలని 2016లో హైకోర్టు ఆదేశాలిస్తే 2021లో అమలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

*రాష్ట్రంలో గత మూడేళ్లలో 694 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 48.58 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. పరిహారం చెల్లించేందుకు కలెక్టర్ల వద్ద కార్పస్‌ ఫండ్‌ ఉందని, విచారణ చేసి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చాంపియన్‌ అవార్డు’కు కేంద్ర ప్ర భుత్వం ఆర్బీకే వ్యవస్థను నామినేట్‌ చేసినట్లు చెప్పారు. రూ.1,995 కోట్ల అంచనాతో వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ పరికరాలకు రైతుల రిజిస్ర్టేషన్లు మొదలు పెట్టామని చెప్పారు. జూలై నాటికి రైతులకు పరికరాలు ఇస్తామని చెప్పారు. వచ్చే నెలలోపు 3,500 ట్రాక్టర్లతో పాటు హార్వెస్టర్లు, స్ర్పింక్లర్లు, డ్రిప్‌ పరికరాలు రైతులకు అందిస్తామని తెలిపారు.
*మార్కెటింగ్‌శాఖ రూపొందించిన ఏపీ రైతుబజార్‌ యాప్‌ను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో బుధవారం మార్కెటింగ్‌శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతుబజార్లలో కూరగాయల ధరలు, ఆదాయ వ్యయాలు, ఫోన్‌ నంబర్లు తదితర సమాచారంతో ఈ యాప్‌ను ఏర్పాటు చేశారు.

*వైసీపీలో వర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జి.కొత్తపల్లిలో గ్రామ వైసీపీ అధ్యక్షుడి హత్య ఉదంతం మరవకముందే ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో మరో ఘర్షణ చోటుచేసుకుంది. సీతంపేట శివారు కొమ్మిరేపలి ఎంపీటీసీ కుమారుడు, వైసీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులవర్తి సంతో్‌సకుమార్‌కు అదే గ్రామానికి చెందిన ఘంటా పండుకు ఏడాది నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద తన బైక్‌పై కూర్చుని స్థానికులతో సంతోష్‌ మాట్లాడుతుండగా ఘంటా పండు, కాలి అశోక్‌, కొండబత్తిన రమేశ్‌ వచ్చి దాడి చేశారు. సంతో్‌షపై రమేశ్‌ కత్తితో దాడి చేయగా… అదేసమయంలో అక్కడికి వచ్చిన సంతోష్‌ సోదరి పులవర్తి వసుమతిపైనా దాడి చేసి, గాయపర్చారు. వీరిద్దరినీ స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురంలో అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పడమటివీధికి చెందిన భూమన వెంకటరెడ్డి(48) వ్యవసాయం కోసం భారీగా అప్పులు చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవడంతో ఉన్న ఇంటిని, నాలుగున్నర ఎకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో బుధవారం తన పొలంలో పురుగు మందు తాగి, అపస్మాకరస్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా వెంకటరెడ్డి మృతి చెందాడు.

*పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం డిమాండ్‌ చేశారు. ‘‘హిందీ, ఇంగ్లీషు, లెక్కల ప్రశ్నపత్రాలు లీకైనట్లు తెలుస్తోంది. దానికి కారకులుగా భావించి 13 మందిని అరెస్ట్‌ చేశారు. అయితే విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నపత్రాలు లీక్‌ కాలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు 16 మందిని ఎందుకు అరెస్ట్‌ చేశారు? సీనియర్‌ మంత్రి బొత్స వ్యాఖ్యలు అటు విద్యార్ద్థులను ఇటు తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ఇదీ ఒక ప్రభుత్వమా?’’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

* పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి రోజా ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పర్యాటక రంగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. రద్దీకి తగ్గట్టుగా పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక భవన్‌ నిర్మాణం, తిరుపతిలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, విశాఖలో ఇండియన్‌ టూరిజం కార్యాలయం ఏర్పాటుకు సీఎం సూచనలతో అనుమతులు పొందాలన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రాంతాలను కేంద్ర మ్యూజియం గ్రాంట్లతో మరింత అభివృద్ధి చేయాలన్నారు. మ్యూజియాల డిజిటలైజేషన్‌, ఆధునీకరణకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. మైలవరం, పెనుకొండ, కడప, కాకినాడ, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలలో నూతన మ్యూజియాలు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని మంత్రి రోజా ఆదేశించారు. పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు, ఆర్కియాలజీ కమిషనర్‌ వాణీమోహన్‌ పాల్గొన్నారు.

*ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ కోసం 1.28 లక్షలు, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోసం 57 వేలు, రెండింటికీ కలిపి 636 మంది మొత్తం సుమారు 1.86 లక్షల మంది దరఖాస్తు చేసారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ బుధవారం తెలిపారు.

*తిరుపతి జిల్లా నిమ్మనపల్లె మండలంలో పాతకక్షలు పెల్లుబికాయి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలావున్నాయి. సామకోటవారిపల్లె పంచాయతీ పుర్రావాండ్లపల్లెకు చెందిన పుర్రా వెంకటరమణ టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వెంకట రమణ, అదే గ్రామానికి చెందిన టీచర్‌ సుధాకర్‌ కుటుంబాల మధ్య గొడవలున్నాయి. మంగళవారం రాత్రి గ్రామంలో రెండువర్గాల వారు గొడవ పడుతుండగా వెంకట రమణ కుమారుడు రవికుమార్‌ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన రవికుమార్‌ తల్లిదండ్రులు వెంకట రమణ, రామలక్ష్మమ్మ, బంధువులు రాజేశ్‌, సాయి, గంగాధర్‌, నరసింహులుపై సుధాకర్‌ కుటుంబీకులు శీను, కిట్టా, గోపాల్‌, అక్కులప్ప తదితరులు కొడవళ్లు, ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడిచేశారు. గాయపడ్డవారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని వైసీపీ నాయకులు తమపై దాడి చేశారని వెంకటరమణ ఆరోపించాడు. టీడీపీ నేతలు బాధితులను పరామర్శించారు.

*పంచాయతీరాజ్‌ శాఖ కాంట్రాక్టర్లు బకాయిలు రాబట్టుకోవడం కోసం రోడ్డెక్కారు. దాదాపు రూ.250 కోట్ల మేర బిల్లుల కోసం బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని పంచాయతీరాజ్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ శాఖ చైర్మన్‌ రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ బి.సుబ్బారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రాఘవరావు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ పనులకు కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు భరిస్తున్నాయని చెప్పారు.

*విశాఖలోని రిషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టుముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూన్‌ 29కి వాయిదా వేసింది. ఈమే రకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌కి విరుద్ధంగా విశాఖ జిల్లా ఎండాడలో రిషికొండపై చెట్లు తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ చెందిన పీవీఎన్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకో ర్టు… రిషికొండపై పర్యాటక రిసార్ట్‌ నిర్మాణం విషయంలో వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ఫ్లాన్‌ను అమలు చేయాలని, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని 2021 డిసెంబరు 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కే.ఎ్‌స.మూర్తి వాదనలు వినిపించారు.

*పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి రోజా ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పర్యాటక రంగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. రద్దీకి తగ్గట్టుగా పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక భవన్‌ నిర్మాణం, తిరుపతిలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, విశాఖలో ఇండియన్‌ టూరిజం కార్యాలయం ఏర్పాటుకు సీఎం సూచనలతో అనుమతులు పొందాలన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రాంతాలను కేంద్ర మ్యూజియం గ్రాంట్లతో మరింత అభివృద్ధి చేయాలన్నారు. మ్యూజియాల డిజిటలైజేషన్‌, ఆధునీకరణకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. మైలవరం, పెనుకొండ, కడప, కాకినాడ, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలలో నూతన మ్యూజియాలు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని మంత్రి రోజా ఆదేశించారు. పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు, ఆర్కియాలజీ కమిషనర్‌ వాణీమోహన్‌ పాల్గొన్నారు.

*పన్ను పోట్లు, పోలీసు గాట్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలా అయితే ప్రజలు ఎలా బతుకుతారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ యజమానులపైనే కాకుండా, ఖాళీ స్థలాల యజమానుల నుంచి కూడా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఖాళీ స్థలాల యజమానుల నుంచి నామమాత్రపు పన్ను వసూలు చేయగా, జగన్‌ సర్కారు 200 శాతం పెంచి వసూలు చేస్తోందని తెలిపారు. పన్నుల పేరిట ప్రతీ కుటుంబం నుంచి నెలకు రూ.90 చొప్పున వసూలు చేయడం జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ఈ వసూల్‌ రాజాల ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కర్ణాటకలో కంటే ఏపీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.12 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పులు చేయవద్దని సూచించారు. అలా చేసే అధికారులకు విశ్రాంత విద్యాధికారి చినవీరభద్రుడికి ఎదురైన పరిస్థితే ఎదురుకానుందని హెచ్చరించారు.

*ఉస్మానియా వర్సిటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు వీసీ అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ గేటు ముందే బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరూ బయటకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో జగ్గారెడ్డి, విద్యార్థి నేతలతో కలిసి గేటు ముందే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌ పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని బుధవారం మధ్యాహ్నం జగ్గారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరాయా? లేదా? అని తెలుసుకోవడానికి వస్తున్న రాహుల్‌ గాంధీ వస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని అందులో ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా తలపెట్టిన పర్యటనకు అనుమతి నిరాకరించడం వల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభు త్వ చర్యలను నిరసిస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌ను ఎదుట నిరసన తెలుపుతామని ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాంధీ భవన్‌ వద్దే జగ్గారెడ్డి, ఇతర విద్యార్థి నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడించింది.

*జన్యుపరమైన అలగెలే సిండ్రోమ్‌ కారణంగా కాలేయం పూర్తిగా చెడిపోయిన 11 నెలల చిన్నారి పాలిట ప్రతిమ ఆస్పత్రి వైద్యులు ఆపద్బాంధవులుగా నిలిచారు. తల్లి కాలేయాన్నే బాలుడికి అమర్చి అతడి ప్రాణాలు కాపాడారు. అయితే.. ఈ సర్జరీని వైద్యులు ఉచితంగా నిర్వహించడం గమనార్హం. వైద్యానికి, సర్జరీకి అయ్యే ఖర్చును డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌, ప్రజల నుంచి(క్రౌడ్‌ ఫండింగ్‌) సేకరించడం విశేషం. నగరంలోని నిరుపేద దంపతులకు పుట్టిన అర్హాన్‌ (11నెలలు)కు జన్యుపరమైన వ్యాధితోపాటు కామెర్లు సోకాయి. ఈ దశలో బాలుడిని వారు ప్రతిమ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పరీక్షల్లో గుర్తించారు. కాలేయ మార్పిడి తప్పదని స్పష్టం చేశారు. వైద్యానికి కావాల్సిన డబ్బు సేకరించడం, ఉచిత సేవలందించడంతోపాటు బాలుడి తల్లి కాలేయం ఇచ్చేలా వైద్యులే కృషి చేశారు. చాలా క్లిష్టమైన సర్జరీని వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించింది. తమ ఆస్పత్రుల్లో అత్యంత తక్కువ ఖర్చుతోనే కాలేయ మార్పిడి చికిత్సను అందిస్తున్నామని ప్రతిమ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతీక్‌ బోయినపల్లి తెలిపారు.

* ‘‘నాకు ప్రాణహాని ఉంది.. నాకు ఏం జరిగినా దానికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌దే బాధ్యత. డీజీపీని కలవకుండా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్‌ అన్నారు. అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రెండు రోజుల పాటు హౌస్‌ అరెస్టు చేశారని, తనను చూసి టీఆర్‌ఎస్‌ పార్టీ భయపడుతోందని అన్నారు. దాదాపు 50 మంది పోలీసులు రెండు రోజులుగా తన ఇంటి వద్దే ఉంటున్నారని, తనను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఓటమి తప్పదన్నారు. మే 28న సికింద్రాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తానని, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని ఆయన పిలుపునిచ్చారు.

*గ్రూప్‌-1 పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహించడంపై బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉద్యోగ రాతపరీక్షలను ఉర్దూలో నిర్వహించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం దేశవ్యాప్తంగా ఉర్దూభాషలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం ఎంపీలకు తెలియకపోవడం శోచనీయమన్నారు.

*ఖరీ్‌ఫ(2020-21)లో సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అందించడానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆరు సార్లు గడువును పొడిగించిన కేంద్రం.. తాజాగా ఏడోసారి పొడిగించింది. బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 31లోగా మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువును పొడిగించబోమని తేల్చిచెప్పింది. గడువు తర్వాత మిగిలిన బియ్యాన్ని డిస్పోజ్‌ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. కాగా, రిసైక్లింగ్‌ బియ్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. భౌతిక తనిఖీల సమయంలో ఉన్న బియ్యాన్నే సెంట్రల్‌ పూల్‌కు అందేలా చూడాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. కాగా, మరోసారి గడువు ఇచ్చినందుకుగాను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

*తూర్పు గోదావరి జిల్లాచింటూరు అడవి నుంచి ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరుకుంది. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా అధికారులు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు. ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరిన సందర్భంగా ఆలయ యాజమాన్యం దానికి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికింది. స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్ బాబుఆలయ చైర్మన్ మోహన్ రెడ్డిఈవో సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు.

*పోలవరం ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. స్పిల్ వే, స్పీల్ ఛానల్ పనులను పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ట్వీన్ టన్నెల్ ప్రాంతాన్ని మంత్రి అంబటి రాంబాబు పరిశీలిస్తున్నారు.

*ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆ పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు

*నీలగిరి వేసవి ఉత్సవాలు ఈ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. కూరగాయల ప్రదర్శనతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తేది వరకు జరుగనున్నాయి. ఈ విషయమై నీలగిరి జిల్లా కలెక్టర్‌ అమృత్‌ మాట్లాడుతూ, ఈ ఏడాది వేసవి ఉత్సవాలు కోతగిరి నెహ్రూ పార్క్‌లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. 7 నుంచి 21వ తేది వరకు ఊటీ సేరింగ్‌క్రాస్‌ ప్రాంతంలో ఉన్న ఉద్యానవన ఆడిటోరియంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన ఉంటుందన్నారు. 13వ తేది నుంచి మూడు రోజులు గూడలూరులో సుగంధద్రవ్యాల ప్రదర్శన జరుగుతుందన్నారు. 14,15న ఊటీ రోజా పార్క్‌లో రోజా ప్రదర్శన, 20 నుంచి 24వ తేది వరకు పుష్ప ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 28,29 తేదీల్లో కున్నూర్‌ సిమ్స్‌ పార్క్‌లో పండ్ల ప్రదర్శన, 18 నుంచి 30వ తేది వరకు బోట్‌ హౌస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, 18 నుంచి 31 వరకు ఊటీ గిరిజనుల సంస్కృతి కేంద్రంలో ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వస్తు ప్రదర్శన, ఊటీ జలాశయంలో 19వ తేదీ పడవ పోటీలు జరుగనున్నాయని కలెక్టర్‌ తెలిపారు.