DailyDose

బీర్లు గుటగుట తాగేస్తున్నరు!

బీర్లు గుటగుట తాగేస్తున్నరు!

ఓ వైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వాటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్‌ చేతబడుతున్నారు. నెల రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు జోరందుకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరగటమే ఇందుకు నిదర్శనం. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్‌ వాల్యూపరంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్‌ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్‌ను ఎంచుకోవటం వల్ల బీర్ల అమ్మకాలు పెరుగుతున్నట్టు మద్యం దుకాణాల నిర్వాహకులు చెప్తున్నారు.