DailyDose

భార‌త్‌లో త‌గ్గిన సంతానోత్ప‌త్తి రేటు

భార‌త్‌లో త‌గ్గిన సంతానోత్ప‌త్తి రేటు

జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే(ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌-5) కీల‌క నివేదిక‌ను రిలీజ్ చేసింది. దేశంలో సంతానోత్ప‌త్తి రేటు ప‌డిపోయిన‌ట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్న‌ది. ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు త‌గ్గిన‌ట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది. ఇది ఒక ర‌కంగా జ‌నాభా నియంత్ర‌ణ‌కు దోహ‌ద‌ప‌డ‌నున్న‌ది. ఓ మ‌హిళ వ‌ల్ల క‌లిగే స‌గ‌టు సంతాన ఉత్ప‌త్తి 2.2 నుంచి 2.0కు ప‌డిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 4, 5వ స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా ఈ అంచ‌నాకు వ‌చ్చారు. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో సంతానోత్ప‌త్తి రేటు 2.1 క‌న్నా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేల్చారు. వాటిల్లో బీహార్ (2.98), మేఘాల‌యా(2.91), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(2.35), జార్ఖండ్‌(2.26), మ‌ణిపూర్‌(2.17) రాష్ట్రాలు ఉన్నాయి.

707 జిల్లాల్లోని 6.37 ల‌క్ష‌ల శ్యాంపిల్ ఇండ్ల‌ల్లో ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌-5 స‌ర్వేను చేప‌ట్టారు. గ‌ర్భ‌నిరోధ‌క ప‌ద్ధ‌తుల వినియోగం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగిన‌ట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆధునిక గ‌ర్భ‌నిరోధ‌క విధానాలు పెరిగిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. హాస్పిట‌ళ్ల‌లో ప్ర‌స‌వాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగిన‌ట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గ్రామీణ ప్ర‌దేశాల్లో ప్ర‌స‌వాలు 87 శాతం, ప‌ట్ట‌ణాల్లో 94 శాతం హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4 నివేదిక‌తో పోలిస్తే ప్ర‌స్తుతం అన్ని రాష్ట్రాల్లో ఊబ‌కాయ కేసులు పెరిగిన‌ట్లు తాజా రిపోర్ట్ చెబుతోంది. కేర‌ళ‌, అండ‌మాన్‌, ఏపీ, గోవా, సిక్కిం, మ‌ణిపూర్‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు, పుదుచ్చ‌రి, పంజాబ్‌, చంఢీఘ‌డ్‌, ల‌క్షద్వీప్‌లో మూడ‌వ వంతు మ‌హిళ‌లు ఒబెసిటీతో బాధ‌ప‌డుతున్నారు.