Devotional

తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరచుకోవడంతో భక్తులు పులకించిపోయారు. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.


ఆరు నెలల తర్వాత తెరచుకున్న కేదారేశ్వరుని ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయం ఏడాదిలో చాలాకాలం పాటూ మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో.. భయంకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి క్షేత్రాన్ని ముసివేస్తారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు సాధారణం కావడంతో ఉదయం 6.26 గంటలకు ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.


కరోనా కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భక్తుల కోసం మంగళవారం తెరిచారు. కేదార్‌నాథ్‌ ఆలయం నేడు తెరచుకోగా, ఈ నెల 8న బద్రినాథ్‌ ఆలయాన్ని తెరవనున్నారు. బద్రీనాథ్‌కు రోజుకు 15 వేల మంది, కేదార్‌నాథ్‌కు 12 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, యమునోత్రికి 4 వేల మంది భక్తులకు అనుమతించనున్నారు.