Politics

త్వరలో ఏపీలో వ్యవసాయ బోర్లకు మీటర్లు

Auto Draft

ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని తెలిపిన ప్రభుత్వం.. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ ఛాంపియన్‌ అవార్డుకు ఎంపికైన దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, రాయితీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్రంగా చర్చించారు. ఖరీఫ్ సమీపిస్తోన్న దృష్ట్యా సన్నద్ధతపై అధికారులతో సీఎం చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 11న మత్స్యకార భరోసా నిధులు, 16న రైతు భరోసా నిధులను విడుదల సీఎం అధికారులను ఆదేశించారు. జూన్‌ 15లోగా రైతులకు పంట బీమా పరిహారం అందించాలని నిర్దేశించారు. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4,014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలన్నారు. ఆర్బీకే, ఈ-క్రాపింగ్‌ లాంటి ముఖ్యమైన అంశాలని పటిష్టంగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

*మీటర్ల ఏర్పాటుతో పారదర్శక వ్యవస్థ..
రాష్ట్ర వ్యాపంగా వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైనట్లు సీఎం తెలిపారు. దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయిందన్నారు. కనెక్షన్లు పెరిగినప్పటికీ 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయిందన్నారు. ”రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరుతో ఇప్పటివరకూ లెక్క కడుతున్నారు. మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్‌ పెట్టే పరిస్థితి వచ్చింది. తద్వారా పారదర్శక వ్యవస్థ ఏర్పడుతుంది. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందుతోంది. విద్యుత్‌ శాఖ సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలి. దీనివల్ల అన్ని జిల్లాలో నాణ్యమైన కరెంట్‌ రావడమే కాకుండా రైతులకు సేవలు మెరుగవుతాయి. రాజకీయ లబ్ధికోసం మీటర్ల ఏర్పాటు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టి, రైతులకు జరుగుతున్న మేలును వివరించాలి” అని అధికారులకు సీఎం సూచించారు.