Movies

మాటల మాంత్రికుడు మాయాబజార్ రూపశిల్పి వర్ధంతి నేడు

మాటల మాంత్రికుడు మాయాబజార్ రూపశిల్పి వర్ధంతి నేడు

మాటల మాంత్రికుడు, పాత్రికేయుడు,సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి……. పింగళి నాగేంద్రరావు గారి వర్థంతి సందర్భంగా🙏🌷

ఎక్కడా ‘బజార్’అనే పదాన్ని మాయాబజార్
చిత్రంలో రానీయకుండా జాగ్రత్తపడడం పింగళి రచనా పటిమకు ఉదాహరణ.
సినిమాలో సత్యపీఠం, ప్రియదర్శిని, తస్మదీయులు, దుష్టచతుష్టయము, జియ్యా, వీరతాళ్ళు, రత్నగింబళి, గిల్పం, శాకంబరీ దేవి ప్రసాదం వంటి కొత్త పదాలను పింగళి ప్రవేశపెట్టారు. పైగా ‘ఎవరూ కనిపెట్టకుండా మాటలెలా పుడతాయి’ అని సమర్ధించుకున్నారు కూడా. ‘రసపట్టులో తర్కం కూడదు’, ‘భలే మామా భలే’, ‘ఇదే మన తక్షణ కర్తవ్యము’ వంటి మాటల్ని కూడా ప్రయోగాత్మకంగా వాడారు.. ఈ సినిమాకు కథే హీరో కాగా, దానికి మాటలు, పాటలు అందించిన పింగళి వారే అసలైన హీరో అని చెప్పక తప్పదు.

ఆయన సినిమాకి కొత్త మాటలు చెప్పారు.కొత్త దారిని చూపారు.కొత్త నడక నేర్పించారు. ఇక మాటలు సాహితీ సుగంధ కుసుమాలు.

పింగళి చిత్ర విచిత్ర ప్రయోగాలతో సామెతలు, లోకోక్తులు జోడించి చమత్కారంగా సంభాషణలు సమకూర్చారు.పదబంధాలతో ఆడుకోవడం, వాక్యాలతో పాడుకోవడం వాటితో జనాన్ని ఆకట్టుకోవడం పింగళికి కలంతో పెట్టిన విద్య. పాళితో వెటకారాలు, చమత్కారాలు నూరడం, అవి జనం కోరడం పరిపాటిగా మార్చిన ఘనుడు.

ఆయన కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తుమందు జల్లి తమ వశం చేసుకున్నాయి. రాబోయే తరాల వారిని కూడా చేసుకుంటాయి. ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో మాయాజాలమో చేసే మేజిషియన్లు, అలా చేసినట్టు అభినయించే చిన్నారులు అసం కల్పింతంగా అనే మాట హాంఫట్‌. ఈ మాట మనకు పరిచయం చేసింది పింగళే.

ఆయన మాటల రచనలో ప్రావీణ్యతను, భాషా సౌందర్యంలో ప్రత్యేకతను, పాటల సృజనలో రసజ్ఞతను, కథాకల్పనలో విశిష్టతను మనం వేలకట్టాలేం. ఆయన పాటలు తేలిక పదాలతో అల్లినవే కావడం విశేషం.

బాల్యం-విద్య:

నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.*జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

ఉద్యోగం:

1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్లోని రైల్వే వర్క్‌షాపులో అప్రెంటీస్ గా చేరాడు. వర్క్‌షాప్ లో పనిచేసేందుకు ఆయన ఆరోగ్యం సహకరించదని ఆయన్ను ఆఫీసు పనికి మార్చారు.1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. ఖరఘ్ పూర్ లో వుండగానే ఆయన దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది.

రచనా వ్యాసంగం:

చిన్నతనం నుంచీ విద్యార్థిదశలోకూడా, నాగేంద్రరావుకు రచనలుచేసే అభ్యాసం వుండేది. ముఖ్యంగా నాటకాలమీద ఆయనకు ఎక్కువమక్కువ. శారద పత్రికను నడిపేరోజులలోనే ఆయన ద్విజేంద్రలాల్ రాయ్ బెంగాళీ నాటకాలు “మేవాడ్ పతన్”, “పాషాణి” తర్జుమాచేసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. ఆయన సొంతనాటకాలు “జేబున్నీసా” (1923), “వింధ్యరాణి” కృష్ణా పత్రికలో ధారా వాహికగానూ ”
నా రాజు” (1929) భారతిలోనూ పడ్డాయి.
1956లో క్షాత్రహిందూ అనే మరో చారిత్రక నాటకాన్ని వ్రాశాడు.

సీనీరంగం:

పింగళి నాగేంద్రరావు. ‘వింధ్యారాణి’ చిత్రంతో పింగళి తెలుగు సినీరంగంలో సంభాషణల రచయితగా అడుగుపెట్టారు. ఆ సినిమా ఘోర పరాజయం పాలైనా సరే.. ఆ సినిమా పింగళి ఎదుగుదలకు బాగా దోహదం చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘గుణసుందరి కథ’తో ఆయన జాతకమే మారిపోయింది. విజయావారి కొలువులో పింగళి ఆస్థాన రచయిత అయిపోయారు. షావుకారు ,ఆ తర్వాత వచ్చిన పాతాళభైరవి చిత్రంతో స్టార్ రైటర్ గా అవత రించారు పింగళి.సినిమా చాలా విజయ వంతంగా నడవటమేగాక చిత్ర నిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు.
ఆ వెంటనే ‘మాయా బజార్’ అఖండ విజయం తో పింగళి పేరు తెలుగు నాట మారు మోగిపోయింది.
ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో పింగళి తన మార్కు చూపించి.. వాటి విజయాలకు కారణమయ్యారు. ‘లవకుశ’, ‘నర్తనశాల’ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘సత్యహరిశ్చంద్ర’ ,‘ప్రమీలార్జునీయం’ ‘శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు కథ’ ,‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ , ‘భాగ్యచక్రం’ చిత్రాలకు పింగళి రచనచేసి, మాటలు, పాటలు సమకూర్చి అద్భుతాలు సృష్టించారు. ఇక ఎన్.టి. రామారావు 1977లో నిర్మించిన ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాకు చివరిసారిగా పింగళి కథ, మాటలు సమకూర్చారు. అయితే 1971లో విడుదలైన ‘శ్రీకృష్ణ సత్య’ కు కథ, మాటలు, పాటలు; 1973లో విడుదలైన సింగీతం శ్రీనివాసరావు తొలిచిత్రం ‘నీటి-నిజాయితీ’ చిత్రానికి మాటలు, ఒక పాట; 1977లో విడుదలైన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రానికి కథ మాటలు సమకూర్చగా ఆ చిత్రాలు పింగళి మరణానంతరం విడుదలయ్యాయి.

మాటల మాంత్రికుడు:

సినిమా సాహిత్యానికి సౌగంధికాలను అద్ది, సుసంపన్నం చేసిన మాట పాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు.
మాటల మాంత్రికుడు, మాటల మరాఠి అంటూ ఇప్పుడు ఎవరెవరికో బిరుదులు ఇచ్చే స్తూ ఈ తరం సినీఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కానీ, తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి!
పాతాళభైరవి’ (1951)లో తోటరాముని ఊతపదం “నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?” అన్నది. ఇక రాజుగారి బామ్మర్ది ప్రతీ మాటకు “తప్పు తప్పు” అంటూ ఉంటాడు. నేపాళ మాంత్రికుడు “హే డింగరీ, హే డింభకా, హే బుల్ బుల్ , హే దగిడీ…” వంటి మాటలతో మంత్రం వేస్తాడు.”ఎవరూ కనిపెట్టకుండా కొత్త పదాలుఎలా పుడతాయ్…” అంటూ ‘మాయాబజార్’ (1957)లో ఘటోత్కచునితో చెప్పించారు.

ఎప్పుడో వేశారు…

“ఎకిమీడా…” అన్న పదం ఆ మధ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక చిత్రంలో వినిపించగానే ఈ కాలం పిల్లలు ఆహా ఓహో అంటూ పాత పదాన్ని పసందుగా పలికించారని రచయితపై అభినందన జల్లులు కురిపించారు. ‘రాజకోట రహస్యం’ (1971)లోనే పింగళి… “ఘన నాట్యము…ఆడే ఎడ తూలేవోయ్ ఎకిమీడా…” అంటూ పలికించారు.

పింగళి `పాత్రల` పేర్లు:

నాగేంద్రరావు గారు సృష్టించిన పాత్రల్లోనే డ్రామా ఉంటుంది. సన్నివేశంతో నిమిత్తం లేకుండానే ఆయా పాత్రలే కలకలంగా గుర్తుండి పోతాయి. తన పాత్రలకు పెట్టిన పేర్లు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. హరమతి, కాలమతి (గుణసుందరి కథ),
ఏకాశ, రెండు చింతలు, త్రిశోకానందుడు (జగదేకవీరునికథ) .`శ్రీకృష్ణార్జునయుద్ధం`లో యతి వేషంలో న్న అర్జునుడికి ఆయన దశనామాల నుంచి ఒక్కొక్క అక్షరాన్ని ఏరి `అజబీదఫపా విశ్వేసకి స్వాములవారు` అని నామకరణం చేశారు. వినడానికి విచిత్రంగా, గంభీరంగా అనిపిస్తుంది. ఇలా పాత్రలు పేర్లు, ఊతపదాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు.

ఆయన పాటలోని పల్లవులు, చరణాలే సినిమా పేర్లు……

ఆయన పాటలోని పల్లవులు, చరణాలే సినిమా పేర్లుగా స్థిరపడిపోయాయి. దివంగత దర్శక రచయిత జంధ్యాల తన చిత్రాలకు పింగళి వారి పదబంధాలనే `చూపులు కలసిన శుభవేళ`, ‘అహ నా పెళ్లంట`, `వివాహభోజనంబు`,`హైహై నాయక` అని పేర్లు పెట్టారు. `ఎంత ఘాటు ప్రేమయో`, `రావోయి చందమామ`, `సాహసం శాయరా ఢింభకా`,`లాహిరి లాహరి లాహిరిలో`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే` సినిమా పేర్లు కూడా పింగళి పాట పల్లవులలోనివే.

జీవితాంతం బ్రహ్మచారిగానే గడిపిన పింగళి, రామమూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఆయన చివరిరోజుల్లో క్షయ, ఉబ్బస వ్యాధులతో బాధపడ్డారు. 1971లో ప్రియ మిత్రుడు కె.వి.రెడ్డి మరణించడంతో పింగళి మరింత వేదనకు గురయ్యారు. అదే సంవత్సరం మే నెల 6 వ తేదీన పింగళి దివంగతులైనారు.ఒక్కో సినిమాకు ఒక్కోశైలిని పామ‌రుల‌కు అర్థ‌మ‌య్యే ట‌ట్లు చేసిన ఆయ‌న ఇప్ప‌టి త‌రానికి ఆద‌ర్శ‌ప్రాయుడు అని చెప్ప‌క‌త‌ప్ప‌దు.