DailyDose

‘పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!’

‘పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!’

చట్టబద్ధ వివాహ వయసు రాకముందే పెళ్లి చేసుకోవడం భారత్​లో ఇంకా కొనసాగుతూనే ఉందని 2019-21 మధ్య చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 వెల్లడించింది. 18-29 ఏళ్ల వయసు యువతుల్లో 25 శాతం మంది, 21-29 ఏళ్ల వారిలో 15 శాతం పురుషులు కనీస చట్టబద్ధ వయసు రాకముందే పెళ్లాడినట్లు సర్వేలో తెలిపింది.

దేశంలో స్త్రీ పురుషులు చట్టబద్ధ వయసు రాకముందే పెళ్లి చేసుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉందని 2019-21 మధ్య చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5 నిగ్గుతేల్చింది. 18-29 ఏళ్ల వయోవర్గంలోని యువతుల్లో 25 శాతం మంది, 21-29 ఏళ్ల వారిలో 15 శాతం పురుషులు కనీస చట్టబద్ధ వయసు రాకముందే పెళ్లాడినట్లు సర్వేలో వెల్లడైంది. భారత్‌లో ప్రస్తుతం కనీస వివాహ వయసు యువతులకు 18 ఏళ్లుగాను, యువకులకు 21 ఏళ్లుగాను ఉంది. దీన్ని ఇకపై ఉభయులకూ 21 ఏళ్లుగా నిర్ణయించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే.

గర్భనిరోధక బాధ్యత మహిళలదే..:
గర్భనిరోధక విధానాలను పాటించాల్సిన బాధ్యత మహిళలదేనని దేశంలో 35.1% మంది పురుషులు భావిస్తున్నట్లు.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 వెల్లడించింది. ఈ విధానాలను పాటించే స్త్రీలలో విచ్చలవిడితనం పెరగడానికి అవకాశం ఉంటుందని 19.6% పురుషులు అభిప్రాయపడినట్లు తెలిపింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌-5 సర్వే జరిగింది. 6.37 లక్షల కుటుంబాలకు చెందిన 7,24,115 మంది మహిళలు.. 1,01,839 మంది పురుషులను సర్వే చేశారు. ఈ సందర్భంగా సేకరించిన సాంఘిక, ఆర్థిక సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, వివిధ కార్యక్రమాల అమలుకు దోహదపడుతుంది.

గర్భనిరోధక బాధ్యత మహిళలదేనని అత్యధికంగా సిక్కులు (64.7%) భావిస్తుండగా.. తర్వాతి స్థానాల్లో హిందువులు (35.9%), ముస్లింలు (31.9%) ఉన్నట్లు సర్వేలో తేలింది. కేరళలో సర్వేలో పాల్గొన్న పురుషుల్లో 44.1 శాతం మంది గర్భనిరోధక విధానాల వల్ల స్త్రీలలో విచ్చలవిడితనం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.దేశంలోకెల్లా చండీగఢ్‌లోనే అత్యధికంగా పురుషులు (69 శాతం) గర్భనిరోధక బాధ్యత స్త్రీలదేనని భావిస్తున్నారు. ఆధునిక గర్భనిరోధక పద్ధతులను, మాత్రలను వాడే మహిళలు అధికాదాయ వర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈమేరకు ఉద్యోగినుల్లో 66.3% మంది ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తుంటే, ఏ ఉద్యోగం చేయనివారిలో 53.4% మందే వాటిని ఉపయోగిస్తున్నారు. దీన్నిబట్టి ఆర్థికాభివృద్ధి నికరమైన గర్భనిరోధక సాధనమని తేలుతున్నట్లు పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ముట్రేజా వ్యాఖ్యానించారు.దేశంలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న వివాహితులైన స్త్రీ పురుషుల్లో 99% మందికి ఏదో ఒక గర్భనిరోధక సాధనం లేదా పద్ధతి గురించి తెలుసు. వాటిని ఉపయోగించేవారు మాత్రం 56.4 శాతమే. గర్భనిరోధక భారమంతా స్త్రీలపైనే పడటం ఆందోళనకరమని ముట్రేజా అన్నారు.