DailyDose

గర్భసంచులు తొలగింపు .. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..!

గర్భసంచులు తొలగింపు .. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..!

గర్భసంచుల తొలగింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) చివరి రౌండ్‌ వివరాల ప్రకారం 15-49 ఏళ్ల వయసు మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.7%, తెలంగాణలో 8.2% మందికి గర్భసంచులు తొలగించారు. టీనేజ్‌ తల్లుల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయిలో సగటున 3.3% మంది మహిళలకు గర్భసంచులు తొలగించగా తెలుగు రాష్ట్రాల్లో అంతకు రెండున్నర రెట్ల సంఖ్యలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. వీటి విషయంలో తెలుగు రాష్ట్రాల దరిదాపుల్లో బిహార్‌ (6%) తప్ప మరే రాష్ట్రం లేదు. జాతీయస్థాయిలో 40-49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో (9.7%) ఎక్కువగా తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 34 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 36.5 ఏళ్లలో మహిళలకు గర్భసంచులు తొలగించేస్తున్నారు. ఇందులో 30% ఆపరేషన్లు ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో జరుగుతుంటే, 70% ప్రైవేటు ఆసుపత్రుల్లో సాగుతున్నాయి. సామాజికవర్గాలవారీగా చూస్తే ఓబీసీ మహిళల్లో (3.6) అత్యధికంగా గర్భసంచులను తొలగించారు. ఆ తర్వాతి స్థానంలో జనరల్‌ (3.2%), ఎస్సీ (3.1%), ఎస్టీ (2.2) మహిళలున్నారు. ఏ సామాజికవర్గమో తెలియని వారు 3.7% మంది కనిపించారు. ఆదాయపరంగా చూస్తే మధ్యతరగతి మహిళలు (3.7%) ఈ కోతలకు ఎక్కువ లోనయ్యారు. అత్యధిక ఆదాయ వర్గాల్లో (2.8%) కోతల సమస్య తక్కువగానే ఉంది.

మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికం.. :
మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికంగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇందులో తమిళనాడు, కర్ణాటకలు తొలి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఆంధ్రప్రదేశ్‌ 3, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి.టీనేజ్‌ తల్లుల్లో తెలంగాణకు పదమూడో స్థానం..: 15-19 ఏళ్ల వయసులోపే అత్యధిక మంది తల్లులు అవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో త్రిపుర (22%), పశ్చిమబెంగాల్‌ (16%) తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ (13%) ఆక్రమించింది. ఇది జాతీయ సగటు 6.8%కంటే దాదాపు రెట్టింపు. ఈ విషయంలో తెలంగాణ (5.8%) 13వ స్థానంలో నిలిచింది.

వార్తాపత్రికలు చదవడం తెలంగాణలోనే ఎక్కువ..:
తెలుగురాష్ట్రాల్లో వారంలో కనీసం ఒక్కసారైనా వార్తాపత్రికలు, మేగజీన్లు చదివే అలవాటు తెలంగాణ పురుషుల్లో 41.6% మందికి ఉంది. ఇది ఏపీలో 35.1%కే పరిమితమైంది. ఇంటర్‌నెట్‌ వినియోగంలో తెలంగాణ (50%), ఆంధ్రప్రదేశ్‌ (41.9%) లు దక్షిణాదిలో చివరిస్థానంలో ఉన్నాయి.

శానిటరీ న్యాప్‌కిన్ల వినియోగంలో ఏపీ వెనుకబాటు..:
శానిటరీ న్యాప్‌కిన్ల వినియోగం తెలంగాణ (81.2%)లో కంటే ఆంధ్రప్రదేశ్‌ (69.2%)లో తక్కువగా ఉంది. ప్రస్తుతం అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన మెన్‌స్ట్రువల్‌ కప్‌ల వినియోగం తెలంగాణ (1.1%)లో అధికంగా ఉంది.

వైద్య బీమాలో ఏపీది రెండోస్థానం..:
వైద్య బీమా అందించడంలో ఏపీ దేశంలో రెండోస్థానంలో ఉంది. 80% కుటుంబాల్లో ఒక్కరికైనా ఈ సదుపాయం ఉంది. 88% కవరేజీతో రాజస్థాన్‌ తొలిస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున 41% మందికి ఆరోగ్యబీమా అందుబాటులో ఉంది. ఈ విషయంలో తెలంగాణ (69%) 5వ స్థానంలో నిలిచింది.