Politics

రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు

రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు

రాష్ట్రంలో ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఆ స్థానానికి ఇద్దరు సీనియర్ నాయకులు రేసులో ఉన్నారు.ఒకరు పొంగులేటి కాగా మరొకరు మోత్కుపల్లి ఉన్నారు. ఒకరు కేటీఆర్ మరొకరు కేసీఆర్ మదిలో ఉన్నారు. వీరివురిలో ఎవరికి దక్కుతుందోనని పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పొంగులేటిని కేటీఆర్ హైదరాబాద్ రావాలని సూచించగా వచ్చి కలిసినట్లు విశ్వసనీయ సమాచారం.

బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనుంది. అయితే బండ ప్రకాశ్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నియామకం కావడంతో ఆ స్థానం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఆశావాహులు చాలా మంది ఉన్నప్పటికీ ప్రధానంగా ఇద్దరు సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. వారిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పొంగులేటికి ఇవ్వాలని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. అంతేగాకుండా హైదరాబాద్ కు రావాలని చెప్పడంతో వచ్చి కలిసినట్లు విశ్వసనీయసమాచారం. అదేవిధంగా ఈ నెల 12న నోటిఫికేషన్ వెలువడనుండగా 19న నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ. అయితే 18న నామినేషన్ వేసేందుకు సన్నద్ధం కావాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గులాబీ అధినేత కేసీఆర్ మదిలో మాత్రం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. ఆయనను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేత. ఆ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు పైగా ప్రభావం చూపగల నాయకుడు. అయితే అధిష్టానం సూచన మేరకు 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. పొంగులేటి పార్లమెంట్ స్థానాన్ని నామా నాగేశ్వర్ రావుకు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఏ పదవిలేకున్నా పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. కేటీఆర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో కేటీఆర్ సైతం మాట్లాడినట్లు సమాచారం. పార్టీని పొంగులేటీ వీడితే రాబోయే ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావించి రాజ్యసభకు నామినేట్ చేయాలని అధిష్టానానికి కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే నామినేషన్ వేసేందుకు సన్నద్ధం కావాలని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

మోత్కుపల్లి నర్సింహులు బలమైన దళిత నేతగా పేరుంది. సుధీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చగల నేర్పరి. విమర్శలను తిప్పికొట్టడంలోనూ మోత్కుపల్లి దిట్ట. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతోపాటు కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని కీర్తించారు. కేసీఆర్ దేశ రాజకీయాలపై ప్రస్తుతం దృష్టిసారించిన నేపథ్యంలో మోత్కుపల్లిని రాజ్యసభకు పంపించి దళితబంధును దేశవ్యాప్తం చేయాలనే డిమాండ్‌ను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మోత్కుపల్లిని అన్ని రాష్ట్రాల్లోనూ దళితబంధు పథకం వివరించే ప్రయత్నం చేయడంతో మరోపక్క కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు రాజ్యసభ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క స్థానానికి ఇద్దరు నేతలు రేసులో ఉండటంతో ఎవరికి దక్కుతుందోనని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.