Devotional

విభూతి ధారణ ప్రాముఖ్యతిదే! – TNI ఆధ్యాత్మికం

విభూతి ధారణ ప్రాముఖ్యతిదే! – TNI ఆధ్యాత్మికం

1. విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.”విభూతిర్భూతిరైశ్వర్యమ్‌’విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.
వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!
భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు.అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.
విభూతి – భసితరి, భస్మ, క్షారము రక్షక పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్దులను బాసింపచేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడంవల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడంవల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటంవల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడంవల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదానొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితవౌతుంది.విభూతి మూడు విధాలు. ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదులవల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు.వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము.సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

2. ర్చకులకే చిన్న ఆలయాలు
వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యత పూర్తిగా అర్చకుల చేతుల్లోకి వెళ్లనుంది. అర్చకత్వంతో పాటు ఆలయ పాలన బాధ్యత కూడా వారి విధిగా మారనుంది. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. తాజాగా దీనిపై హైకోర్టు గురువారం స్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న అన్ని ఆలయాలకు దేవదాయ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుందని స్పష్టంచేసింది. అలాగే ఆలయాల నుంచి నిర్దేశిత శాతాల్లో ఆ శాఖ తీసుకునే వాటా నుంచి కూడా మినహాయింపు లభించింది. నాలుగు నెలల్లో ఈ ఆదేశాలు అమలు చేయాలని తీర్పులో హైకోర్టు పేర్కొంది. అర్చకులకు జీతాలు, వారి సంక్షేమం ఎలా అనే అంశాలపై 1977లోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల పూర్తి బాధ్యతను అర్చకులకే అప్పగించాలని అప్పట్లోనే ఆదేశించింది.అయితే సుప్రీం ఆదేశాల్లో రూ.5లక్షలా… రూ.50వేలా… అనేదానిపై అస్పష్టతతో వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు. 2007లో రూ.2లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు ఇచ్చేందుకు వీలుగా అప్పటి ప్రభుత్వం దేవదాయ చట్టానికి సవరణలు చేసింది. అది కూడా రకరకాల కారణాలతో అమలు కాలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఓ ఆలయానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త హైకోర్టును ఆశ్రయించడంతో తాజా తీర్పు వెలువడింది. దాని ప్రకారం ఇకపై ఈవోలు చేసే ఆలయ నిర్వహణ బాధ్యతలను అర్చకులు తీసుకుంటారు. ఇప్పటివరకూ ఆలయాలపై ఉన్న ఈవోలు, గుమస్తాల జీతాల భారం కూడా తప్పుతుంది. అయితే ఆదాయం, ఖర్చు వివరాలను ఎప్పటిలాగే క్యాష్‌ బుక్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వం ట్రస్టుబోర్డులను నియమిస్తుంది. అనువంశిక ధర్మకర్తలు ఉన్నచోట మాత్రం ఆలయ బాధ్యతలను అర్చకులకు ఇవ్వరు. చాలావరకు అనువంశిక ధర్మకర్తలు లేనందున ఎక్కువ ఆలయాలు అర్చకులకే వస్తాయి. రాష్ట్రంలో రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు సుమారు 20 వేలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఈవోలను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు తీర్పు ప్రకారం చిన్న ఆలయాలను తమకు అప్పగించాలని అర్చకులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. వచ్చే కొద్ది ఆదాయంలో ఈవోలకు వేతనాలు, దేవదాయశాఖకు సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌ కట్టాల్సి వస్తోందని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజా తీర్పుపై ఏపీ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అర్చకులకు న్యాయం జరిగిందని, వీలైనంత త్వరగా తీర్పును అమలు చేయాలని సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెద్దింటి రాంబాబు కోరారు.

3. ఏడుపాయల హుండీ ఆదాయం రూ.43 లక్షలు
ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీ లెక్కింపు చేపట్టగా రూ.43,14,934 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ వెల్లడించారు. శనివారం హుండీ లెక్కింపును గోకుల్‌షెడ్డులో కామారెడ్డి భ్రమరాంభిక సేవా సమితి సభ్యురాలు సునీతారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాల మధ్య హుండీ లెక్కింపు నిర్వహిం చారు. బంగారు, వెండి ఆభరణాల వస్తువులు మినహా నగదు రూపేణా రూ.43,14,934 ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది సూర్యశ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, శ్రీనివాసశర్మ, లక్ష్మీనారాయణ, నాయకుని రవి, మహేష్‌, యాదగిరి, నరేష్‌, సేవా సమితి సభ్యులు, భక్తులు పాలొన్నారు.

4. కన్నుల పండువగా భద్రకాళి – భద్రేశ్వరుల
సుప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో వైభవోపేతంగా శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శంకర జయంతి సందర్భంగా ఉదయం అమ్మవారికి ఉషఃకాలార్చన పూర్తయిన అనంతరం జగద్గురు శంకరాచార్య జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత చతుఃస్థానార్చన, ఉత్సవాంగ నిత్యబలి పూర్తిచేసి అమ్మవారిని దుర్గమాతగా అలకరించి సింహవాహనంపై ఊరేగించారు. సాయంకాలం గజవాహనంమీద శ్రీ లక్ష్మీమాతగా అలంకరించి ఊరేగించారు. దేవస్థాన ప్రాంగణంలో సుందరంగా నిర్మించిన కల్యాణ మండపంలోకి శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ సుందర మూర్తులను వేంపుచేశారు. ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ఈవో శేషుభారతి, ఆధ్వర్యంలో అర్చకులు భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం సాయంత్రం 7గంటలకు ప్రారంభమైంది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు శోభాయాత్రగా కల్యాణానికి తరలివచ్చారు. కళ్యాణ క్రతువులో భాగంగా శ్రీభద్రేశ్వరుడికి వివాహాంగ భూతంగా ద్వితీయ స్వర్ణయజ్ఞోపవీతాన్ని సమర్పించారు. భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ ఘట్టాన్ని అర్చకులు సుస్వర మంత్రోచ్ఛారణ జరుపుతుండగా ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ముఖ్య అర్చకులు పార్నంది నర్సింహమూర్తి, చెప్పెల వెంకట నాగరాజు శర్మ, అర్చకులు టక్కర్స్‌ సత్యం, ఎల్లంభట్ల రమేష్‌ శర్మ, ప్రభాకరశర్మ, సుధాకరశర్మలు నిర్వహించిన కళ్యాణ తంతు భక్తులకు నేత్రోత్సాహాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ప్రముఖ అద్వైత వేదాంత పండితుడు వేదరత్న మంగళంపల్లి వేణుగోపాల శర్మ శివకళ్యాణ ప్రవచనం శ్రోతలను అలరించింది. నగరంలోని అన్ని సామాజికవర్గాలవారు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవ వేదికను ఈ సారి మరితం శోభాయమానంగా నిర్మించారు. శుక్రవారంనాటి కార్యక్రమాలకు ఉభయదాతలుగా కమ్మసేవా సంఘంవారు వ్యవహరించారు. అన్నదానం చేశారు. పాల్గొన్న ప్రముఖుల్లో కమ్మసేవా సంఘం అధ్యక్షుడు మందడి కోటేశ్వర్‌రావు, రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగవరపు రామక్రిష్ణ ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి మాదాల గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.