Politics

టీడీపీ- జనసేన పొత్తులు ఇలా..

టీడీపీ- జనసేన పొత్తులు ఇలా..

తెలుగుదేశం జనసేన పొత్తులు ఖరారైనట్లే! బీజేపీతో తెగతెంపులు చేసుకోడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉన్నారు. ఈ జట్టులో సిపిఐను కలుపుకోనున్నారు. ముగ్గురూ కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. విశ్వసనీయ వర్గాలనుంచి తెలుస్తున్న సమాచారం ఇలా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ–జనసేన పొత్తు ఖరారైంది. జనసేన ప్రస్తుతం 25-30 సీట్లు అడుగుతోంది. అలాగే 4 పార్లమెంటు స్థానాలను అడుగుతున్నారు. సీపీఐను కూటమిలో కలుపుకుంటే.. వారికి రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది.

బిజెపిని మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టాలనే వారు డిసైడయ్యారు. అయితే ఎన్నికలలోగా రాబోయే రెండేళ్లలో బీజేపీ వర్గాల నుంచి ఎలాంటి ప్రతిస్పందన, ఒత్తిడి ఉంటుందనే దాన్ని బట్టి.. ఆ కాంబినేషన్ మారవచ్చు. టీడీపీ- జనసేన బంధం విషయంలో ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మిన్నంటుతున్న ప్రస్తుత నేపథ్యంలో.. జనసేన పొత్తు అవసరం లేదని, ఒంటరిగా పోటీచేసినా మంచి మెజారిటీతో విజయం సాధించగలం అని టీడీపీలో ఒక వర్గం నాయకులు వాదిస్తున్నారు. అదే సమయంలో.. ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వరాదని.. పొత్తుపెట్టుకునే ఎన్నికలకు వెళ్లాలని మరో వర్గం వాదిస్తోంది. అధినేత చంద్రబాబునాయుడు కూడా పొత్తులతో కలిసి వెళ్లడానికే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ- జనసేన పరిణామాలను పొత్తుల దిశగానే సాగుతుండగా.. ఒంటరి కాబోతున్న బిజెపి ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా ఉంది.