DailyDose

తమిళనాడు ఇడ్లీ అమ్మకు కొత్త ఇల్లు… ఆనంద్ మహీంద్రా ‘మదర్స్ డే’ గిఫ్ట్‌

తమిళనాడు ఇడ్లీ అమ్మకు కొత్త ఇల్లు… ఆనంద్ మహీంద్రా ‘మదర్స్ డే’ గిఫ్ట్‌

తమిళనాడు ఇడ్లీ అమ్మకు కొత్త ఇల్లు కట్టించి.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. మదర్స్‌ డే సందర్భంగా ఆదివారం కొత్త ఇంటిని ఆ వృద్ధురాలికి బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు కొత్త ఇంటిని కానుకగా అందించడానికి దాని నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసిన మా బృందానికి చాలా కృతజ్ఞతలు. ఆమెకు, ఆమె పనికి మద్దతివ్వడం ఒక ప్రత్యేకత. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందులో పేర్కొన్నారు.తమిళనాడు పెరూ సమీపంలోని వడివేలంపాళయం గ్రామానికి చెందిన కమలతాల్ అనే వృద్ధురాలు ఇడ్లీ అమ్మగా పాపురల్‌ అయ్యారు. సుమారు 37 ఏళ్లుగా సాంబార్, చట్నీతో కూడిన ఇడ్లీలను కేవలం రూపాయికే ఆమె విక్రయిన్నది. తెల్లవారుజాము నుంచే ఇడ్లీ తయారీ పనుల్లో నిమగ్నమవుతుంది. రోజువారీ కూలీలు, పేదలకు రూపాయికే అల్పాహారం అందిస్తున్నది.ఇడ్లీ అమ్మ కమలతాల్ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లింది. దీంతో ఇడ్లీ అమ్మకు తాను మద్దతిస్తానని, ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని 2019లో ట్వీట్ చేశారు. అలాగే పేదలకు మరింతగా సేవ చేసేందుకు ఇడ్లీ అమ్మకు త్వరలో కొత్త ఇంటిని సమకూర్చుతానని 2021 ఏప్రిల్‌లో మరో ట్వీట్‌ చేశారు. ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా ఆ హామీని నెరవేర్చారు. ఆయన సంస్థ సిబ్బంది కమలతాల్‌కు కొత్త ఇంటిని బహూకరించారు. దీంతో నెటిజన్లు ఆనంద్‌ మహీంద్రాకు హ్యాట్సాఫ్ చెప్పారు.