Movies

రెట్టింపు వినోదం గ్యారెంటీ

రెట్టింపు వినోదం గ్యారెంటీ

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రగతి. ఏ పాత్రలోనైనా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. తాజాగా ‘ఎఫ్‌-3’ చిత్రంలో కీలక పాత్రలో నటించిందామె. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ “ఎఫ్‌-2’కు కొనసాగింపుగానే సీక్వెల్‌లో నా క్యారెక్టర్‌ ఉంటుంది. అయితే కథ మారింది కాబట్టి నా పాత్ర కొంచెం మార్పులతో కనిపిస్తుంది. ఈ సినిమాలో చక్కటి నటనతో పాటు హాస్యాన్ని పండించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.వరుణ్‌తేజ్‌ ఏ విషయాన్నైనా త్వరగా ఆకళింపు చేసుకుంటారు. ఇక వెంకటేష్‌ సెట్‌లోకి రాగానే సినిమా మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన దిల్‌రాజు సంస్థలో నటించడం ఆనందంగా ఉంది. సునీల్‌, అలీ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి డబుల్‌ డోస్‌ వినోదం గ్యారెంటీ అని చెప్పొచ్చు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నా. ‘ఎఫ్‌-2’ కంటే రెట్టింపు వినోదంతో ‘ఎఫ్‌-3’ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మంచి తారాగణం కుదిరింది కాబట్టి సినిమా అంతా ఓ పండగలా అనిపిస్తుంది. ఓ ఆహ్లాదకరమైన సినిమా చూశామని ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు’ అని చెప్పింది.