Devotional

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి – TNI ఆధ్యాత్మికం

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి – TNI ఆధ్యాత్మికం

1. తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ ర‌కాల‌ ఫలాలు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన అష్టలక్ష్మీ, ద‌శావ‌తార‌ మండపంలో మే 10 నుండి 12వ తేదీ వరకు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. రోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
*ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :
శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
* పౌరాణిక ప్రాశస్త్యం :
ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

2. శ్రీవారికి కానుకగా మినీ లారీ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆదివారం ఓ మినీ లారీ కానుకగా అందింది. చెన్నైకు చెందిన అశోక్‌ లైలాండ్‌ కంపెనీ నూతనంగా తయారుచేసిన రూ.18.38 లక్షల విలువైన మినీ లారీని అందజేసింది. ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం లారీ తాళాలు, పత్రాలను.. ఆలయ డిప్యూటీ ఈవో రమే్‌షబాబుకు అందజేశారు. అంతకుముందు లారీకి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3. బాసరలో శివాలయ దీపస్తంభం ధ్వంసం
నిర్మల్‌ జిల్లా బాసరలోని పాపహరేశ్వర శివాలయ దీపస్తంభాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన బయటపడింది. స్తంభం పైభాగాన్ని కింద పడేశారు. స్తంభానికి ఉన్న నిచ్చెనను ఎత్తుకెళ్లారు. శిల్పకళతో కూడిన చతురస్ర, వృత్తాకార భాగాలను పక్కనే వదిలేశారు. దుం డగులు యంత్రంతో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రాచీనమైనది కావడంతోగుప్తనిధుల వేటలో భాగంగానే ఈ పని చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

4. కొర్లపహాడ్‌ ఆలయాలకు వెయ్యేళ్ల చరిత్ర
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ గ్రామంలో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి కోరారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ గ్రామంలో జీర్ణావస్థలో ఉన్న శివ, భద్రకాళి, ఆంజనేయ ఆలయాలను ఆదివారం ఆయన సందర్శంచారు. కుందూరు చోళుల కాలం నాటి ఈ శివాలయ పరిసరాల్లో చారిత్రక శిల్పాలను నిర్లక్ష్యంగా వదిలేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయం ముందున్న నంది, వినాయక విగ్రహాలు బాదామి చాళుక్య కాలంలో ప్రతిష్ఠించినవిగా పేర్కొన్నారు. వీటికి స్థానికులు భక్తితో పూసిన రంగులతో చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. విగ్రహాలకు వేసిన రంగులను తక్షణమే తొలగించి విగ్రహాల చారిత్రకతను కాపాడాలని స్థానికులకు సూచించారు. దాదాపు వెయ్యేళ్ల నాటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని తెలంగాణ వారసత్వ విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట చరిత్రకారుడు డాక్టర్‌ దామరాజు సూర్యకుమార్‌ ఉన్నారు.

5. హిమాలయాల్లోని బదరీ నారాయణుడి దర్శనాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తుల భగవన్నామ స్మరణ నడుమ ఆదివారం ఉదయం 6.15గంటలకు ప్రధాన పూజారి ఈశ్వరీ ప్రసాద్‌ నంబూద్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి బదరీనాథ్‌ ఆలయ ద్వారాలను తెరిచారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు విష్ణుమూర్తి దర్శనం చేసుకొన్నారు.

6. టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. టీటీడీ ఈవోగా ప్రస్తుతానికి అదనపు బాధ్యతలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇకనుంచి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా కె.శారదాదేవి నియమితులయ్యారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి.నాగరాణిని రిలీవ్‌ చేశారు. సెర్ఫ్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
*పూర్వజన్మ సుకృతం: జవహర్‌రెడ్డి
కాగా ఈవో బాధ్యతల నుంచి రిలీవ్‌ అయిన జవహర్‌రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి టీటీడీ ఈవో (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కొలువులో 19 నెలలు భక్తులకు సేవలందించానని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు.
టీటీడీ పాలన కాస్త భిన్నమైనదని, ఆలయ వ్యవహారాలు, అర్చక వ్యవస్థ కొత్త అనుభూతినిచ్చాయని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేదవర్గాల వారికి స్వామివారి దర్శనం చేయించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. టీటీడీ ఈవో(ఎఫ్‌ఏసీ) ధర్మారెడ్డి టీటీడీ బోర్డు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేఈవో (ఆరోగ్యం, విద్య) సదాభార్గవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.