Politics

పొత్తులపై వైసీపీలో గుబులు

పొత్తులపై వైసీపీలో గుబులు

*ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని ప్రశ్నలు 
*దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని నేతల వ్యాఖ్యలు 
* పొత్తు లేకుండా పోరాడలేరా అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు 
* అధికార పార్టీతో పొత్తుకు ముందుకురాని పార్టీలు 
* టీడీపీ వైపు బీజేపీ మొగ్గు చూపుతుందేమోనని ఆందోళన

ఎన్నికలకు రెండేళ్ల ముందే రాష్ట్రంలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు స్వరం పెంచుతుండటంతో అధికార వైసీపీలో గుబులు పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని, ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కొన్ని రోజులుగా పదేపదే చేస్తున్న ప్రకటనలు వారిలో నెలకొన్న భయాన్ని సూచిస్తున్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల పొత్తులపై వైసీపీలో రేగుతున్న ప్రకంపనలకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రెండు భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకొచ్చాయి. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో టీడీపీ పోటీ చేయగా జనసేన పార్టీ వాటికి బయట నుంచి మద్దతు ఇచ్చింది. వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగాయి. 2019 ఎన్నికల సమయానికి టీడీపీ కూటమి విచ్ఛిన్నమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒంటరిగానే పోటీ చేశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా పొరుగున అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అన్ని రకాలుగా సహకారం అందిందన్నది బహిరంగంగానే కనిపించింది. ఈ కారణంతోనే ఆ రెండు పార్టీలతో వైసీపీ నాయకత్వం ఎప్పుడూ మిత్రత్వ ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తోంది. కింది స్థాయిలో ఎప్పుడైనా చిటపటలు వ్యక్తమైనా పై స్థాయిలో సంబంధాల్లో తేడా రాకుండా అధినాయకత్వం చూసుకొంటోంది.

*2024 ఎన్నికలో మళ్లీ పొత్తు పొడిచే వాతావరణం బాగా ముందు నుంచే కనిపిస్తోంది. ప్రత్యేకించి వైసీపీతో బద్ధవైరంతో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య పెరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ పార్టీల శ్రేణులు కలసి పోటీ చేశాయి. విషయం ఆయా పార్టీల నాయకత్వాలకు తెలిసినా అడ్డుపెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు కూడా బాగా తగ్గిపోయాయి. పొత్తు విషయమై ఇప్పటికిప్పుడు నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఆ వాతావరణం ఏర్పడేలా ఉభయ పార్టీల నాయకత్వాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల బహిరంగ ప్రకటన చేశారు. రాజకీయాల్లో పొత్తులనేవి ఉంటూనే ఉంటాయని ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీని ఓడించడానికి టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోటీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు…!!