WorldWonders

ఇక్కడ ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు

ఇక్కడ ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాలీస్ గిరిజన తెగలో ఇదొక ఆసక్తికరమైన ఆచారం. ఈ తెగలో పుట్టే ఆడపిల్లలకు మూడు సార్లు పెళ్లి చేస్తారు.పుట్టిన ఐదేళ్లలోపు ఒకసారి, యుక్తవయసు రాగానే మరోసారి పెళ్లి చేస్తారు. ఈ రెండు పెళ్లిళ్లలో వరుడు ఉండడు. అయినా, వీటిని వివాహాలుగానే మాలీస్ గిరిజనులు పిలుస్తారు. మూడో సారి జరిగే పెళ్లిలో వరుడు ఉంటాడు.ముందు జరిగే రెండు పెళ్లిళ్లు సామూహికంగా జరుగుతాయి. గ్రామంలో ఉన్న ఆడ పిల్లలందరికి ఒకేసారి ఈ వివాహాలు చేస్తారు. వరుడు ఉండడనే మాటే కానీ, గ్రామం మొత్తానికి పెళ్లి జరుగుతుందా అనేంత సందడిగా ఈ వివాహాలు చేస్తారు.

**ఐదేళ్లకు ఒకసారి
తూర్పు కనుమల్లో అనేక గిరిజన తెగలున్నాయి. వారి సంప్రదాయాలు, ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని మాలీస్ తెగ నివసించే గ్రామాల్లో ఆడపిల్లలకు మూడు పెళ్లిళ్ల ఆచారం తరతరాలుగా కొనసాగుతుందని మాలీస్ గిరిజన తెగకు చెందిన వారు చెప్తున్నారు.

ఈ తెగవారు నివసించే గ్రామాల్లో ఆడ పిల్లలందరికి సామూహికంగా వివాహాలు జరిపించడం సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి చేస్తారు. గ్రామంలో పండుగ వాతావరణంలో ఈ వేడుక జరుగుతుంది. ప్రత్యేక విందు కూడా ఉంటుంది. ఈ వివాహాలకు ఆ గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా కుటుంబాలతో సహా హాజరవుతారు.

తరతరాలుగా జరుగుతున్న ఈ మూడు పెళ్లిళ్ల సంప్రదాయం వెనుక ఒక ఆచారం, ఆలోచన ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని దోడిపుట్టు గ్రామంలో 50 మందికి, చౌడపల్లి గ్రామంలో 30 మందికి ఐదేళ్లలోపు వయసున్న ఆడపిల్లలకు సాముహిక వివాహాలు జరిపించారు. అయితే సంప్రదాయంలో భాగంగా బాల్య వివాహాలను చేస్తారే కానీ, నిజంగా మాలీస్ తెగల్లో బాల్య వివాహాలు చేయడం అనేది ఎప్పుడూ లేదు.

**‘మూడు పెళ్లిళ్లు…ఇవే మాకు పండుగలు’
తమ తెగలోని ఆడ పిల్లలకు ఎంతో గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని మాలీస్ తెగవారు చెబుతున్నారు. ఈ మూడు పెళ్లిళ్ల ఆచారంపై దోడిపుట్టు గ్రామ నివాసి అయిన55 ఏళ్ల కృష్ణంరాజు బీబీసీతో చెప్పారు.“ఆడపిల్లలు పుట్టగానే మా తెగలో సంబరం చేసుకుంటాం. ఆడపిల్లలను దేవతల్లా చూసుకోవడం మా తాతల నాటి సంప్రదాయం. ఆడ పిల్లలకు జరిగే అన్నీ సంబరాలు.. ఆ పాప తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉండగానే జరగాలనేది నియమం. ఆడ పిల్లలకు పెళ్లి అనేది చాలా ముఖ్యం కదా, అందుకే ఆ పెళ్లి అందరూ చూడాలనే ఉద్దేశంతోనే మా మాలీస్ తెగ పెద్దలు ఈ నియమం పెట్టారు. ఆడపిల్లలకు పెళ్లి వయసు వచ్చేసరికి ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే… ఆడ పిల్ల పెళ్లి చూడలేకపోయాననే బాధ ఉండకూడదని… ఆడపిల్లలకు ఐదేళ్ల లోపు పెళ్లి చేస్తారు. సాధారణంగా పెళ్లి ఎలా చేస్తారో ఈ పెళ్లి కూడా అలాగే చేస్తారు. ఊర్లో పెద్దలు ఒక సమావేశం పెట్టుకుని ఈ పెళ్లిళ్లు ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయిస్తారు” అని కృష్ణంరాజు వివరించారు.

**‘‘ఇంటికి రూ. లక్ష ఖర్చు’’
పెళ్లంటే ఎవరికైనా ఖర్చుతో కూడుకున్న పనే. మాలీస్ తెగలో కూడా పెళ్లి విషయంలో ఖర్చుకు వెనుకాడరు. అసలైన పెళ్లి కాకుండా ఆచారం కోసం చేసే పెళ్లయినా కూడా చాలా ఆడంబరంగా చేస్తారు. బంధువులు, స్నేహితులు అందర్నీ పిలుస్తారు. పెళ్లికి రకరకాల వంటలు చేస్తారు. ఇంటికొచ్చే బంధువులకు మూడు రోజుల పాటు ఆతిథ్యం ఇస్తారు. ఊరందరికి ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేస్తారు.“మా తెగలో ఆడపిల్లకు ఐదేళ్లకు చేసే పెళ్లైనా, యుక్తవయసు వచ్చాక జరిగే పెళ్లైనా, అత్తారింటికి ఆడపిల్లలను పంపించే నిజమైన పెళ్లైనా కూడా ఎంతో ఘనంగా చేస్తాం. ఊరిలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సందడి కనిపిస్తుంది. చుట్టాలు రావడం, ఒకరికొకరు కానుకలు సమర్పించడం, పెళ్లి వంటలు, కొత్త బట్టలు ధరించి ఊరంతా తిరగడం, గ్రామంలో అంతా కలిసి గిరిజన సంప్రదాయ పూజలు చేయడం వంటివి ఉదయం నుంచి జరుగుతూ ఉంటాయి. మూడు రోజులు ముందుగానే బంధువులంతా చేరుకుంటారు. ఇలా జరిగే పెళ్లికి ప్రతి ఇంటి నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెడతాం”అని ఇలాంటి వివాహాలను దాదాపు 20 సార్లు చూసి, ఇప్పుడు తన ఇంట్లోని ఐదేళ్ల పిల్లకు పెళ్లి చేస్తున్న మణెమ్మ బీబీసీతో చెప్పారు.

**‘‘మూడో పెళ్లి ప్రేమ వివాహమైనా ఓకే’’
పెద్దలంతా కలిసి ఊరిలోని ఐదేళ్లలోపు ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తానికి ఊరంతా అంగీకరిస్తే దానినే ఖాయం చేస్తారు. అప్పటి నుంచి పెళ్లి సందడి మొదలవుతుంది. ఇంటికి రంగులు వేసుకోవడం, రిపేర్లు చేయించుకోవడం, అమ్మాయికి వస్తువులు కొనడం, ఊర్లో వాళ్లకి, దూరంగా ఉన్నవాళ్లకు అందరికి పిలుపులు వంటి పనులతో పెళ్లి పనులు మొదలవుతాయి. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి వివిధ రకాల పిండివంటలు అందరూ కలిసి చేస్తారు.“అయిదేళ్ల వయసులో చేసే పెళ్లి మరీ చిన్నప్పుడు కావడంతో, యుక్తవయసు వచ్చాక మరోసారి ఆడపిల్లకు వరుడు లేకుండా పెళ్లి చేసి.. తలిదండ్రులు తమ చేతుల మీదుగా పిల్ల పెళ్లి చేశామని అనుకుంటారు. ఇక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపేందుకు జరిపే వివాహాన్ని మాత్రం అమ్మాయి ఇష్టానికే వదిలేస్తారు. అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే వారికే ఇచ్చి చేస్తారు. లేదంటే పెద్దలు వివాహాన్ని కుదురుస్తారు” అని మూడు నెలల క్రితం విశాఖ వాసిని ప్రేమ వివాహం చేసుకున్న చింతపల్లి మండలం చౌడపల్లికి చెందిన శ్రావణి బీబీసీకి చెప్పారు. శ్రావణికి కూడా మాలీస్ తెగ ఆచారం ప్రకారం రెండుసార్లు వరుడు లేకుండా పెళ్లి జరిగింది.

**‘‘మీ ఇంట్లో పెళ్లికి మా కానుకలు ఇవి’’
మాలీస్ తెగలో ఉండే గిరిజనంలో ఆర్థిక తారతమ్యాలుంటాయి. కానీ ఖర్చుతో కూడుకున్న మూడు పెళ్లిళ్ల ఆచారం మాత్రం అందరూ పాటిస్తారు. అయితే ఖర్చుని భరించడం కష్టం కాబట్టి… ఈ పెళ్లికి వచ్చే వారంతా పెళ్లికి తమ వంతు సాయంగా సరకులు, బియ్యం తెస్తారు. దానితో పాటు పెళ్లిలో జరిగినట్లే చదివింపులు కూడా ఉంటాయి. ఈ వివాహాలకు హాజరయ్యే వారంతా కానుకలతో రావడం కనిపిస్తూ ఉంటుంది.
“పెళ్లికి హాజరయ్యే వారంతా బస్తాలతో బియ్యం, ఇతర సరకులు తీసుకుని వస్తారు. డబ్బులు కూడా ఇస్తారు. అంతే కాకుండా పెళ్లి కూతురుకు కొంత సొమ్మును పెళ్లి చదివింపుల పేరిట ఇస్తారు. అలా ఇవ్వడం ద్వారా పెళ్లికి అయ్యే ఖర్చులో కొంత వారు భరించినట్లు అవుతుంది. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటిలో ఇది జరుగుతుంది. లేదంటే ఈ ఖర్చును భరించడం కష్టం. తక్కువలో తక్కువ ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఒకసారి పెళ్లికి కనీసం రూ. లక్ష ఖర్చు పెడతారు”అని వివాహానికి కానుకలతో హాజరైన లక్ష్మీరాజేశ్వరి బీబీసీతో చెప్పారు.

**పెళ్లి ఎలా జరుగుతుందంటే…
వరుడు లేకుండా జరిగే మొదటి రెండు వివాహాల్లో బాలికను తల్లిదండ్రులే అందంగా అలంకరించి పీటలపై కూర్చోబెడతారు.మూడోసారి చేసే పెళ్లిలో మాత్రం వరుడితో అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ మూడుసార్లు పెళ్లితంతు తప్పనిసరిగా పాటిస్తారు.

*ప్రతి పెళ్లి ఆర్భాటంగానే చేస్తారు.
“మామిడి ఆకులతో చేసిన బాసికం కడతారు. అందమైన కిరీటాల్ని పెడతారు. చక్కగా ముస్తాబు చేస్తారు. ముహూర్త సమయానికి ముందు పెళ్లి కూతుర్లను భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిరుగుతారు. అనంతరం సాముహిక వివాహాల కోసం వేసిన వేదిక వద్దకు వస్తారు. అక్కడ వెదురుతో తయారు చేసిన చాపలపై పిల్లలను కూర్చోబెట్టి పూజారులు హోమం చేస్తారు. దాంతో మాలీస్ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లలకు ఘనంగా పెళ్లి జరిగినట్లు భావిస్తాం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆడపిల్ల పెళ్లి చూడలేకపోయామనే బాధ ఉండకూడదని ఐదేళ్లకు ఒకసారి ఈ వివాహాలు చేస్తాం. ఇలా చేయకపోవడాన్ని కూడా మాలీస్ తెగలో నేరంగానే భావిస్తాం” అని మాలీస్ తెగకు చెందిన దోడిపుట్టు పురోహితుడు కృష్ణమూర్తి బీబీసీకి వివరించారు.

‘గిరిజన ఆచారాలు ఎక్కువ పండుగలే’
గిరిజన తెగల్లో అనేక ఆసక్తికరమైన ఆచారాలుంటాయి. ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఉండే గిరిజన జాతుల్లో వందల ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు పాటించకపోవడమంటే తమ పూర్వీకుల మాటను పెడచెవిన పెట్టడమే అని అంటారు ఏయూ అంత్రోపాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలరావు.
“మాలీస్ తెగలో ఆడపిల్లలకు జరిపే మూడు పెళ్లిళ్ల సంప్రదాయం కూడా అలాంటిదే. ఈ తెగలో ఆడపిల్లకు జరిగే ముందు రెండు పెళ్లిళ్లలో వరుడితో వివాహం చేయకపోవడం ఆచారం మాత్రమే. పైగా వారు మూడో పెళ్లిని అంటే అసలైన పెళ్లిని అమ్మాయికి ఇష్టమైన వారితో లేదా ప్రేమించిన వారితో జరిపించడం కూడా ఆ తెగలోని ఆలోచన విధానాన్ని తెలుపుతుంది. చనిపోయిన వారు తమని తప్పుపట్టకుండా ఉండాలనే నమ్మకంతో, చాలా గిరిజన తెగలు ఆచారాలు పాటించడంలో ఎంత కష్టమున్నా వెనుకాడరు. అది వారు తమ పూర్వీకులకు ఇచ్చే గౌరవంగా భావిస్తారు. ఈ పెళ్లిళ్లలో కూడా అంతా కలిసి డబ్బులు, సరకులు సహాయంగా అందించి ఖర్చులో భాగస్వామ్యమవ్వడం అనేది వందల ఏళ్ల నాటి నుంచి అమలు చేస్తున్న క్రౌడ్ ఫండింగ్ విధానమే. ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా అక్కడక్కడ గిరిజన తెగల్లో కొన్ని మూఢాచారాలు ఉన్నప్పటికీ…చాలా వరకు ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు మాత్రం పండుగల్లా ఉంటాయి” అని తిరుమలరావు చెప్పారు.