DailyDose

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై అసాని తుఫాన్ ప్రభావం – TNI తాజా వార్తలు

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై అసాని తుఫాన్ ప్రభావం – TNI తాజా వార్తలు

* ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై అసాని తుఫాన్ ప్రభావం పడుతోంది. తుఫాను కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాలో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి అక్కడక్కడా వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1060 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా బలపడి వాయువ్య దిశలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. ఈ నెల 10వతేదీ సాయంత్రానికి ఆంధ్రా-ఒడిశా తీరానికి చేరవగా వచ్చి ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్‌ వైపు మరలనుందన్నారు. ఎగసిపడే కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. తుఫాన్‌ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలోని మత్స్యకారులు ఎవరూ వేటకు సముద్రంలోకి వెళ్లరాదన్నారు.

*ఆదిలాబాద్‌ జిల్లాలో రియల్టర్ల బెదిరింపులతో కొన్ని రోజులుగా ఆరు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి పంట పొలాల్లోనో నివాసం ఉంటున్నాయి. తమ భూమిని కాపాడుకునేందుకు అక్కడే బస చేస్తున్నాయి. నేరడిగొండ మండలం బుద్దికొండ పంచాయతీ పరిధిలోని రాజులతండాలో భూవివాదం నడుస్తోంది. ఆరు కుటుంబాలకు చెందిన భూమిపై రియల్టర్లు కన్నేశారు. భూమిని తమకు అమ్మాలంటూ.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పొలంలోనే గుడారాలు వేసుకొని ఉంటున్నారు.

*సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ కార్యాలయం నుంచి సెక్రటేరీయేట్‌కు నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తీరుపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు.

*నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ వారిని మోసం చేస్తున్న కేటుగాడిని(cheater) పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీకృష్ణ అనే వ్యక్తి వందలాది మంది మహిళలను ఉద్యోగా పేరుతో మోసం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఒంటరి మహిళలు, వితంతువులను టార్గెట్‌ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతున్నట్టు పోలీసులు తెలిపారు. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులువంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై ఇప్పటికే 60 మంది మహిళల ఫిర్యాదు చేశారు. సంపాదించిన డబ్బుతోవంశీకృష్ణ బెట్టింగ్, గుర్రపు పందేలు ఆడుతున్నట్టు పోలీసులు గుర్గించారు. ఆరేళ్లలో బాధితుల నుంచి ఏకంగా రూ.3.5కోట్లు కాజేసినట్టు పోలీసులు తెలిపారు.

*మారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం.. మరో 14మంది గాయపడడం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురయినవారు పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసి తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. కుటుంబ సభ్యుడు మరణించగా దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరగడం మాటలకు అందని విషాదమని పవన్ పేర్కొన్నారు. వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడపడమే కారణమని ప్రాథమిక సమాచారం అందిందన్నారు. గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడినవారిని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కోరారు

*జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45వద్ద గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్టు ధర్నాకు దిగింది. గీతా ఆర్ట్స్ వారు తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఆమె నిరసన వ్యక్తం చేసింది. అర్ధ నగ్నంగా నిరసన తెలుపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని, సినిమాల్లో అవకాశం ఇస్తానని తనను నమ్మించి లైంగికంగా దాడి చేసి మోసం చేశాడని సునీత బోయ అనే మహిళ ఆర్టిస్టు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు గీతా ఆర్ట్స్ వారు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలుపుతూ కార్యాలయం ముందు అర్థనగ్నంగా నిరసన తెలపడంతో అక్కడున్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో మహిళా పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆమెను జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత కొంత కాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సునీత బోయ అనే ఆర్టిస్టుకు తాము ఒక్క రూపాయి కూడా బాకీ లేమని గీతా ఆర్ట్స్ ఆఫీసు సిబ్బంది తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ కార్యాలయం నుంచి సెక్రటేరీయేట్‌కు నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తీరుపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు.

*టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని టీపీగూడూరు మండలం మైపాడు మత్య్సకార గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ బాడుడే బాదుడు కార్యక్రమంలో పాల్గోన్నారని జడ్పీ వైస్ చేర్మన్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

*నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలోనే నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసి సీఎం చేతుల మీదగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రులు వెల్లడించారు. కాగా… అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయందే, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసినా నిరుపయోగమే కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి మంత్రి అంబటి చిందులు వేశారు. ‘‘నీవు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసం ఇస్తున్నావా?’’ అంటూ విలేకరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి అంబటి వెనుదిరిగారు.

*యశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు. చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు(harish rao) పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో గల సింగరేణి క్వార్టర్స్ సమీపంలో నూతన జిల్లా ఆసుపత్రి భవనం నిర్మాణానికి,50 పడకల ఆయుష్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మంజు నగర్ లో ఏరియా ఆసుపత్రి ముందు నూతన డయాగ్నస్టిక్ హబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

* హాంకాంగ్‌ పాలకునిగా చైనా అనుకూల జాన్‌ లీ ఆదివారం ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్‌ 1న కేరీ లామ్‌ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు.హాంకాంగ్‌ సెక్యూరిటీ చీఫ్‌గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్‌ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్‌ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్‌ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

*అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్‌ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వారు, షార్ప్‌ షూటర్లు, డ్రగ్‌ ట్రాఫికర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇండ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడిచేశారు. ముంబైలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్‌, పాలెల్‌, శాంతాక్రజ్‌ సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

*నందిగామలో శివాలయం భూమి ఆక్రమణ యత్నంపై ఆలయ ఈవో హరిగోపినాధ్ బాబు పోలీసు ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివాలయం వెనుక ఉన్న భూమి శివాలయానికి చెందినదనిఆ భూమికి రక్షణ కల్పించాలని పిర్యాదు చేసినట్లు ఈవో చెప్పారు. ఫిర్యాదు చేసినందుకు తనను కొంత మంది బెదిరిస్తున్నారని హరిగోపినాద్ బాబు తెలిపారు.

*ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్‌ విభజన జరగడం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక జూలైలో జరగనుంది. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

*ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కోవడానికి డియర్‌నెస్ అలవెన్స్ లేదా డిఎను కేంద్రం తన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లిస్తుంది.కేంద్ర ఉద్యోగుల 7వ వేతన సంఘం కింద ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది.దేశంలో పనిచేస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని మరోసారి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈసారి డీఏ పెంపును 3-4 శాతం మేర పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

*రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవో 244ను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య విమర్శించింది. ఆదివారం బషీర్‌బాగ్‌లోని ఓసీ జేఏసీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడారు. జీవో అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లోగా జీవోను పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు.

*ఇంటర్మీడియట్‌ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌(మూల్యాంకనం)ను ఈనెల 12 నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలకు అధికారులను కేటాయించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈ నెల 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఫలితాలను త్వరగా ప్రకటించాలనే ఉద్దేశంతో మూల్యాంకనాన్ని త్వరగా చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 31తో ముగియనుంది. జూన్‌ మొదటి వారంలో ఇంటర్‌ ఫలితాలు ప్రటించాలని భావిస్తున్నారు. అనంతరం 15 రోజుల గడువులో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

*ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సిద్దిపేటలోని మీ సేవ కేంద్రాల్లో కులం, ఆదాయ సర్టిఫికెట్లు ఉచితంగా వెంటనే జారీ చేయాలన్న మంత్రి హరీశ్‌ రావు నిర్ణయాన్ని తెలంగాణ మీ సేవ సమాఖ్య స్వాగతించింది. లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులను అధికారులు వారాల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్‌, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ మోహీద్‌ తెలిపారు. అధికారుల జాప్యంతో అభ్యర్థులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, సిద్దిపేట తరహా విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సమాఖ్య ప్రతినిధులు ఆదివారం మీ సేవ కమిషనర్‌ జి.టి.వెంకటేశ్వర్లును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు.

*కొందరు వైసీపీ నేతల అనుచరుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తమ నేతల ఆండ చూసుకుని తెగ రెచ్చిపోతున్నారు. భూకబ్జాలు.. పథకాల్లో దందాలు, దౌర్జన్యాలు మొదలు.. ఆఖరికి ప్రభలపై డ్యాన్సులు వేసి పొట్టపోసుకునే మహిళలనూ వదలడంలేదు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగుచూసింది. స్థానిక వైసీపీ నేతలు తమను లైంగిక వేధిస్తున్నారంటూ ప్రభలపై నృత్యాలు వేసే మహిళా డ్యాన్సర్లు ఇక్కడి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉండాలంటే తమతో ఏకాంతంగా గడపాలని బెదిరిస్తున్నారని వాపోయారు.

*ఎస్సీల భూముల జోలికొస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణాజిల్లా బందరు మండలం కరగ్రహారంలో ఇరవై ఏళ్లుగా రొయ్యల సాగు చేసుకుంటున్న తమ భూములను ఇతరులకు పట్టాలివ్వడం అన్యాయమంటూ బాధితులు ఆదివారం రిలే దీక్షలకు దిగారు. అంబేడ్కర్‌, పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చెరివెళ్ల సంధ్యారాణి నాయకత్వంలో దీక్షా శిబిరాన్ని కొల్లు రవీంద్ర, జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ సందర్శించారు. 1986 నుంచి రొయ్యలు పండించుకుంటూ ఎస్సీ సొసైటీ కింద సాగు చేసుకుంటున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. వైరస్‌ సోకడంతో రొయ్యల సాగు మానేశామన్నారు. ఇప్పుడు తమ భూములను మాజీ సైనికులకు, పేదలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని తెలిపారు. కోర్టు కేసు ఉన్న భూముల్లో ఇళ్లు కడుతుంటే ఏంచేస్తున్నారని పోలీసులను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జడ శ్రావణ్‌ కుమార్‌లు ప్రశ్నించారు. ఎస్సీ రైతులకు న్యాయం చేయని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. శ్రావణకుమార్‌ మాట్లాడుతూ దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

*‘మా దగ్గర అవినీతి లేదు. కుటుంబ పార్టీల కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా లేము. ఫ్యామిలీ పార్టీలకు మేము వ్యతిరేకమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని, జీడీపీని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెప్పాలని కోరారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో 2024లో బీజేపీ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా రాజమండ్రి, విజయవాడలో భారీ బహిరంగ సభలు పెట్టి ముందుకు వెళ్లబోతున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతీయ పార్టీలూ రైతుల్ని దగా చేస్తున్నాయని, అన్నదాతల్ని మోసగించడంలో ప్రావీణ్యం సంపాదించాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం, సివిల్‌ సప్లయిస్‌, మిల్లర్లు కలిసి రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైస్‌ మిల్లర్ల నాయకుడిని సివిల్‌ సప్లయిస్‌ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని సోము ప్రశ్నించారు. కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ ఛాహర్‌ మాట్లాడుతూ రైతులకు జగన్‌ ఏమీ చేయడం లేదని, ఆయన అన్నీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.

*‘‘రేపల్లె గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి తక్షణమే రూ.కోటి ఆర్థిక సాయం అందించాలి. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో మృతి చెందిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చారు. కానీ గ్యాంగ్‌ రేప్‌కు గురైన ఎస్సీ మాదిగ మహిళకు కేవలం రూ.4.12 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది అమానవీయం’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. బాధితురాలికి నగదుతోపాటు 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇచ్చి, సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలిని ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకుని పరామర్శించాల్సి వచ్చింది. పురుషులను చూస్తేనే ఆమె భయంతో వణికిపోతోంది. ఆమె మానసిక స్థితి చూస్తే ఎంత చిత్రవధ అనుభవించిందో అర్థమైంది’’అని తెలిపారు.

*పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో సీపీఐ చేపట్టిన ‘చలో అమరావతి’ ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అమరావతికి వెళ్లే ందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు నాయకులు, వందలాది మందితో ర్యాలీగా రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి, కూడేరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ధరల నియంత్రణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తే.. నోటీసులు, అరెస్టులు చేస్తూ… ఎలా నిర్బంధిస్తారంటూ మండిపడ్డారు. ‘ఎవరినీ విజయవాడ రానివ్వకుండా అడ్డుకుంటున్నావనీ, అదేమైనా నీ యబ్బ జాగీరా…’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి రామకృష్ణ మండిపడ్డారు. తాను ఎవరికీ భయడనంటూనే.. సీఎం జగన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

*సైనికులు, మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన సాగు భూములను పదేళ్ల కాలపరిమితి దాటిన తర్వాతే స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని రెవెన్యూశాఖ మరోసారి స్పష్టత ఇచ్చింది. ఆ భూములకు ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ ల్యాండ్స్‌(బదిలీ నిషేధం-పీవోటీ) చట్టం-1977 వర్తించదని, భూమి లేని నిరుపేదల కోటాలో వారికి భూములు ఇవ్వలేదన్న విషయం పరిగణ నలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అసైన్‌మెంట్‌ చేసిన తేదీ తర్వాత సరిగ్గా పదేళ్లకు ఆ భూములు ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని సెక్షన్‌ 22(ఏ)లోని నిషేధ భూముల జాబితా నుంచి తొలగిపోయేలా వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్‌ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. పదేళ్ల కాలపరిమితి దాటిన భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుంటే ప్రభుత్వం జారీ చేసే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) అవసరం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. నిజానికి ఈ అంశాలపై 2016 జూలై 4నే నాటి ప్రభుత్వం జీవో 279 జారీ చేసింది. అందులోని అంశాలను పునరుద్ఘాటిస్తూ, విశాఖ జిల్లా కలెక్టర్‌ లేవనెత్తిన అనేకానేక సందేహాలకు స్పష్టత ఇస్తూ సీసీఎల్‌ఏ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు.

*చెరువు మట్టి అమ్మకాల కోసం ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా కరప మండలం యండమూరు గ్రామ పంచాయతీ చెరువులో మట్టి పూడికతీతకు ఇటీవల పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ సర్పంచ్‌, వైసీపీ సానుభూతిపరుడు మారెళ్ల శ్రీనివాసరావు (శివ) ఈ నెల 3న చెరువు మట్టిని విక్రయిస్తుండగా స్థానిక వైసీపీ నేతలు అడ్డుకుని, ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఫిర్యాదుచేశారు. వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ (వైస్‌ ఎంపీపీ) బొమ్మితి వీరరాఘవులు అదే చెరువు మట్టిని అమ్ముకోవడానికి ఆదివారం ప్రయత్నించాడు. అప్పటికే మట్టి అమ్మకాలను అడ్డుకున్నారన్న కక్షతో ఉన్న శివ పంచాయతీ అనుమతి లేకుండా మట్టి ఎలా పట్టుకెళ్తారని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకోగా.. వైస్‌ ఎంపీపీ, సర్పంచ్‌ గాయపడగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రి, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

*నాలి (Tenali) ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్ లైట్లతో వైద్యులు వైద్యం అందిస్తున్నారు. గాలి, వాన నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జనరేటర్ సదుపాయం ఉన్నా ఆసుపత్రి సిబ్బంది త్వరితగతిన స్పందించలేదు. దాదాపు అరగంట సేపు విద్యుత్ అంతరాయం, రోగులు చీకట్లో ఇబ్బందులు పడ్డారు.

* ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వచ్చాకే వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఫలితంగా రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ రైతు ఉద్యమనేత అశోక్‌ ధావలే ఆవేదన వ్యక్తంచేశారు. ‘వ్యవసాయ సంక్షోభం-రైతాంగ ఉద్యమాలు’ అనే అంశంపై ఆదివారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన సదస్సులో అశోక్‌ ధావలే ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైన నేపథ్యంలో.. రాష్ర్టాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. వరికి కేంద్రం క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1940 నిర్ణయిస్తే.. ఏపీలో రూ.900లోపే అమలు చేస్తున్నారంటే రైతుల పట్ల పాలకులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని చెప్పారు. ఏపీలోనూ వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కాలం దగ్గర్లోనే ఉందన్నారు.

*హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పారిశుద్ద్య కార్మికులు ఆందోళనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరసన తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు.

*హైదరాబాద్: నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి.

*తెలంగాణలో వచ్చే మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విదర్భ నుంచి కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

*పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన దిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దక్షిణ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌డీఎంసీ) చర్యలు ప్రారంభించింది.ఇందులో భాగంగా నేడు ఈ ప్రాంతానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి పంపించేశారు.దిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎస్‌డీఎంసీ ఇటీవల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షాహీన్‌బాగ్ వద్ద కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల జహంగీర్‌పురి వద్ద జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని షాహీన్‌బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల కోసం వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.ఈ ఉదయం షాహీన్‌బాగ్‌కు బుల్డోజర్లు, జేసీబీలను తరలించారు. అయితే వీటిని చూసిన స్థానికులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మద్దతుదారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన భాజపా రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.ఇటీవల జహంగీర్‌పురిలోనూ అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టగా.. అక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని ఆ ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.