Kids

ఊరిలోని ఆటలు.. ఉత్సాహపు బాటలు

ఊరిలోని ఆటలు.. ఉత్సాహపు బాటలు

బాల్యం అపురూపమైనది. బాల్యంలో తప్పనిసరిగా ఉండాల్సినవి ఆటలు. ఈరోజుల్లో ఆ ఆటలను టీవీలు, కంప్యూటరు, స్మార్ట్‌ఫోన్లు మింగేస్తున్నాయి. ఒకప్పుడు హాయిగా, ఆనందంగా కలిసిమెలిసి ఆడుకునే ఆటలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొదించడమే కాదు, పిల్లల మధ్య స్నేహాన్ని, స్నేహితుల మధ్య దృఢమైన బంధాన్ని పెంచేవి. పిల్లల శారీరక, మానసిక సామర్ధ్యం బలపడటానికి దోహదపడేవి.
ఆటలవల్ల శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది. ఏకాగ్రత, ఆలోచనాశక్తి, నైపుణ్యం, ఉపకార బుద్ధి, క్రియేటవిటీ పెరుగుతాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు సరదాగా ఆడుకునే కొన్ని ఆటలను ఈ వేసవిలో అందరూ ప్రయత్నించవొచ్చు.
karrabillaa
*కర్రాబిళ్ల :
ఇందులో ఒక పెద్ద కర్ర, చిన్న కర్ర ముక్క ఆట పరికరాలు. చిన్న కర్ర ముక్క రెండు వైపులా, పెద్ద కర్ర ఒకవైపు పదునుగా చెక్కుతారు. ఇందులో పెద్ద కర్ర సహాయంతో, నేలపై ఉన్న చిన్న కర్రముక్కను గాలిలో ఎగిరించి, విసిరి కొట్టాలి. అది ఎంత దూరం వెళ్లిందనేదాన్ని బట్టి విజేతను నిర్ణయిస్తారు. పిల్లలంతా గ్రూపుగా ఖాళీ ప్రదేశంలో ఈ ఆటకు సిద్ధమవుతారు.
chemmachekka
చెమ్మచెక్కలాట :
ఈ ఆటలో ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఒక పద్ధతి ప్రకారం చప్పట్లు కొడుతూ ఆడతారు. చెమ్మ చెక్క.. చారెడేసి మొగ్గ అని పాట పాడుతుంటారు. ఎంతమందైనా ఈ ఆట ఆడొచ్చు. దీనివల్ల పిల్లల మధ్య స్నేహాలు బలపడతాయి. ఈ ఆట ఆడేటప్పుడు పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు.
kachhakaya
కచ్చకాయలాట :
ఈ ఆటలో కనీసం ఇద్దరైనా ఉండాలి. ఒకే సైజులో ఉండే నాలుగు చిన్న రాళ్లు తీసుకుంటారు. ఒక రాయిని పైకి ఎగరేస్తూ కింద ఉన్న నాలుగు రాళ్లను అందుకుంటూ ఉండాలి. పైకి ఎగిరిన రాయిని పట్టుకోకపోయినా, కింద ఉన్న రాళ్లను అందుకోకపోయినా వారు అవుటైనట్లే. ఒక్కోరాయి, రెండు రెండు రాళ్లు, మూడు రాళ్లు, నాలుగు రాళ్లు.. అందుకునే క్రమపద్ధతిలో ఆట సాగుతుంది. ఇంకా బండి, కత్తెర, దుస్సుడు వంటి రకరకాల పేర్లతో వివిధ పద్ధతులుంటాయి. కచ్చకాయలాట వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
tokkudu-billa
తొక్కుడు బిళ్ల :
ఈ ఆటలో వరుసకు నాలుగు చొప్పున, రెండు వరుసల్లో ఎనిమిది గడులుంటాయి. ఒక వ్యక్తి మొదటి గడిలో బిళ్ల వేసి ఒక కాలుతో కుంటుతూ వెళ్లి బిళ్లను తొక్కి బయటకు రావాలి. అలా వరుసగా గడులన్నింటిలో బిళ్ల వేస్తూ, తొక్కుతూ బయటికి రావాలి. ఒక గడిలో విసురుతున్న బిళ్ల మరో గడిలోకి వెళ్లినట్లయితే ఆ వ్యక్తి అవుటవుతారు. ఎవరు ఎక్కువ సేపు అవుట్‌ కాకుండా ఆడితే వారు గెలిచినట్లు. అయితే ఈ ఆటను వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆడుతుంటారు. ఈ ఆట వల్ల వ్యాయామం, ఏకాగ్రత పెరుగుతాయి.
నాలుగు డబ్బాలాట : ఈ ఆటలో ఐదురుగుంటారు. వారిలో ఒకరు దొంగగా ఉంటారు. చతురస్రాకారంలో నాలుగు గడులు గీసి ఒక్కో గడిలో ఒక్కో వ్యక్తి ఉంటారు. నాలుగు రాళ్లను మధ్యలో పెడతారు. గళ్లలో ఉన్న నలుగురు ఆ రాళ్లను తీసుకోవాలి. వారు తీసుకోవడానికి వచ్చినప్పుడు దొంగ వారిని అవుట్‌ చేయాలి. వారు ఆ దొంగకు దొరకకుండా తప్పించుంటూ ఉంటారు. ఈ ఆట వల్ల వ్యాయామం, మానసిక వికాసం కలుగుతాయి.
asta-chemma
అష్టాచెమ్మా :
ఈ ఆటలో మొత్తం ఐదు వరసల్లో ఐదు గడుల చొప్పున మొత్తం 25 గడులుంటాయి. నాలుగు గవ్వలతో ఇద్దరు లేదా నలుగురు ఆడతారు. గవ్వలు వేసి, వాటి ఆధారంగా అష్ట (ఎనిమిది), చెమ్మ (నాలుగు), ఒకటి, రెండు మూడు అని లెక్కిస్తారు. ఈ నెంబర్లను బట్టి తమతమ రాళ్లను గళ్లలో జరుపుతూ ఉంటారు. మధ్య గడిలోకి ఎవరు ముందుగా వెళితే వారు గెలిచినట్లు. మధ్యమధ్యలో రాళ్లను చంపడాలు ఉంటాయి. ఈ ఆటవల్ల గెలవాలనే పట్టుదల, ఎత్తుగడ వేయడం అలవడతాయి.

వామన గుంటలు :
ఈ ఆటలో రెండు చెక్కలుంటాయి. వాటిపై ఏడు, ఏడు పద్నాలుగు గుంటలుంటాయి. చిన్న చిన్న గులకరాళ్లు లేదా, చింత గింజలతో ఈ ఆట అడుతారు. మొదటి గుంతలోని గింజలన్నీ తీసుకొని ఒక్కో గుంతలో ఒక్కో గింజవేస్తూ పోవాలి. చేతిలోని గింజలు పూర్తయిన చోట పక్క గుంతలోని గింజలను తీసుకొని మళ్లీ ఒక్కోటీ వేయాలి. అలా వేస్తూ ఉండగా చివరి గింజ వేశాక తర్వాత గుంత ఖాళీగా ఉంటే ఆ వ్యక్తి అవుట్‌ అయినట్లు. ఇప్పుడు రెండో వ్యక్తి అలాగే ఆడాలి.

goleelata
గోళీలాట :
వీధిలో ఉండే పిల్లలంతా కలిసి ఆడుకునే ఆట ఇది. అత్యంత ప్రజారణ పొందిన ఈ ఆటను అనేక రకాలుగా ఆడతారు. ఆటగాళ్లు తమ గోళీలతో ఉపయోగించి ఎంచుకున్న లక్ష్యాన్ని కొట్టాలి. ఇందులో ఓడిన వారు గోళీలను పోగొట్టుకోవడం, గెలిచిన వారు తమ గోళీల సంఖ్యను పెంచుకోవడం జరుగుతుంది. పిల్లలు తాము సాధించుకున్న గోళీలను అందరికీ చూపిస్తూ మురిసిపోతారు.

ఇవేగాక ఏడు రాళ్లు, గట్టు ముందు.. గట్టు వెనక, పచ్చీసు, పులి మేక, దాగుడు మూతలు, దొంగా పోలీసు, ముక్కు గిచ్చుడు.. ఇంకా అనేక రకాల ఆటలు దర్శనమిస్తాయి. ఇవి ఏమాత్రం ఖర్చు లేని ఆటలు. ఇంట్లోనూ, ఇంటి పరిసరాల్లో దొరికే సరంజామాతో సరదా సరదాగా ఆడే ఆటలు. ఈ సెలవుల వేళ .. మీ చుట్టుపక్కల పిల్లలతో ఈ ఆటలాడండి. ఆడించండి.