Politics

తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు

తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ  కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజీకుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతనెల 27న మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద సీఐడీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

*మంత్రి బొత్స, సీఎం Jagan చేసిన విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారు: Lokesh
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్ (Jagan) అండ్ కో ట్రేడ్ మార్క్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) విమర్శించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్ రెడ్డి చేసిన విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారన్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. సంబంధంలేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ.. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదని నారా లోకేష్ అన్నారు.

*ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్టు: Chandrababu
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారన్నారు. కక్షపూరితంగానే Narayanaను అరెస్టు చేశారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి.. ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు.. నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా… విచారణ చేయకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

*కక్ష సాధింపు చర్యల్లో భాగమే నారాయణ అక్రమ అరెస్ట్: దేవినేని ఉమ
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని.. కక్షసాధింపు చర్యల్లో భాగమే ఈ అక్రమ అరెస్ట్ అని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ సర్కార్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందన్నారు. మీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని దేవినేని ఉమ పేర్కొన్నారు.

*పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశాం: బొత్స
టెన్త్‌ పేపర్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీమంత్రి నారాయణను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇతర కేసులపై తన దగ్గర సమాచారం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.