DailyDose

ఈ హారం వెనుక ఉన్న‌ క‌థ తెలిస్తే షాక‌వ్వాల్సిందే!!

ఈ హారం వెనుక ఉన్న‌ క‌థ తెలిస్తే షాక‌వ్వాల్సిందే!!

ఫొటోలో కనిపిస్తున్న హారం బావుంది కదూ! దీని వెనుక పెద్ద కథ ఉంది. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతాన్ని పాలించిన రాజా భూపేందర్‌ సింగ్‌కు ఇష్టమైన ఆభరణం ఇది. ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద వజ్రాన్ని ఇందులో పొదిగారు. ఇప్పటి దాకా దొరికిన పసుపు పచ్చ వజ్రాలలో ఇదే అతి పెద్దది. రాజ కుటుంబీకులు తరతరాలుగా ఈ వజ్రాన్ని ధరించేలా.. ఒక ప్రత్యేకమైన నగలో దీన్ని అందంగా పొదగాలని సంకల్పించారు.

ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ ‘కార్టియర్‌’కు ఈ పనిని అప్పగించారు. ఐదు వరుసల్లో తీర్చిదిద్దిన ఈ హారంలో డి బీర్స్‌ వజ్రం ప్రధానంగా కనిపించేలా మొత్తం రెండువేలా తొమ్మిది వందల ముప్పై వజ్రాలను వాడారు. వాటితో పాటు అరుదైన కెంపులనూ జోడించారు. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దీని విలువ దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు. 1948లో రాజావారి ఖజానా నుంచి ఈ నగ మాయమైంది. మళ్లీ ఆ తర్వాత 1982 ప్రాంతంలో సోత్‌బే సంస్థ ద్వారా వేలానికి వచ్చిందా వజ్రం, అదీ హారం లేకుండానే. మరికొంత కాలానికి లండన్‌లోని ఓ పురాతన వస్తువుల దుకాణంలో వజ్రాల హారంలోని కొంత భాగం దర్శనమిచ్చింది. పటియాలా రాజ కుటుంబానికి తయారు చేసిచ్చిన కార్టియర్‌ సంస్థవారే ఈ హారాన్ని కొనుగోలు చేసి, వజ్రాలు పోయిన స్థానంలో.. వాటిని పోలిన రంగు రాళ్లను పెట్టి లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌షోలో కార్టియర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన ఎమ్మా చాంబర్లీన్‌ పటియాలా హారంలోని చోకర్‌ తరహా భాగాన్ని ధరించడంతో ఈ ఖరీదైన ఆభరణం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.