WorldWonders

అతి చిన్న బైబిల్‌

అతి చిన్న బైబిల్‌

బైబిల్‌ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. కానీ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్న ఈ బైబిల్‌ చూడాలంటే మాత్రం బ్రిటన్‌లోని లీడ్స్‌ సిటీ లైబ్రరీకి వెళ్లాలి. అంతేకాదు… చదవాలంటే భూతద్దం కావాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బైబిల్‌. ఐదు సెం.మీ. పొడవు… మూడున్నర సెం.మీ. వెడల్పు, పలుచటి ఇండియన్‌ పేపర్‌తో దీన్ని రూపొందించారు.సాధారణంగా బైబిల్స్‌ పాతనిబంధన, కొత్త నిబంధన ప్రకారం విడివిడిగా ఉంటాయి. కానీ రెండింటినీ కలిపి 876 పేజీల్లో ప్రింట్‌ చేశారు. 1911లో రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బైబిల్‌ 16వ శతాబ్దానికి చెందిన ‘చైన్డ్‌ బైబిల్‌’ అనుకరణగా భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో లీడ్స్‌ లైబ్రరీలో ఎన్నో పురాతన పుస్తకాలను కనిపెట్టారు. దాదాపు 3 వేల పుస్తకాలను వెలుగులోకి తేగలిగారు.కొన్ని 15వ శతాబ్దానికి చెందినవి కూడా అందులో ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ టినీ బైబిల్‌ లైబ్రేరియన్‌ కంటపడింది. ఈ టినీ బైబిల్‌ పబ్లిష్‌ అయిన కాలంలో అతి చిన్న బైబిల్‌గా నమోదైందని, కానీ ఇది నిజం కాకపోవచ్చని స్పెషల్‌ కలెక్షన్స్‌ సీనియర్‌ లైబ్రేరియన్‌ రిహాన్‌ ఇస్సాక్‌ చెబుతున్నారు. ఇదెక్కడినుంచి వచ్చిందన్న సమాచారం కూడా తమ దగ్గర లేదని, ఎవరైనా డొనేట్‌ చేసిందై ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు.అయితే… ఇదే అతి చిన్నదా? ఇంతకుముందేమైనా ఉన్నాయా? వంటి విషయాలన్నీ పక్కన పెడితే.. ఆ బైబిల్‌ను చూసేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు వస్తారని లైబ్రరీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఆసక్తి ఉంటే సాధారణ పౌరులు సైతం వచ్చి ఈ బైబిల్‌ చదవొచ్చని లైబ్రేరియన్‌ ఇస్సాక్‌ చెబుతున్నారు.