Business

అమెరికాలో 1.3 లక్షల టెస్లా వాహనాలు రీకాల్‌! – TNI వాణిజ్య వార్తలు

అమెరికాలో 1.3 లక్షల టెస్లా వాహనాలు రీకాల్‌! – TNI వాణిజ్య వార్తలు

* టచ్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లేలో సమస్యలు తలెత్తడంతో అమెరికాలో 1.30 లక్షల కార్లను టెస్లా రీకాల్‌ చేసింది. ఈ వాహనాలన్నీ 2021, 2022లో తయారైనవే. వీటిలో సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను టెస్లా అందిస్తుందని జాతీయ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. టచ్‌స్ర్కీన్‌లోని అంతర్గత వ్యవస్థ తీవ్రంగా వేడెక్కడం వల్లే టచ్‌ స్ర్కీన్‌ పనితీరులో లోపాలు వస్తున్నాయని అంచనా వేసింది.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 30 షేర్ల సెన్సెక్స్‌ 276 పాయింట్లు కోల్పోయి 54,088 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 73 పాయింట్లు తగ్గి 16,167 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది.
*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.
*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.
*గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికానికి న్యూలాం డ్‌ లేబొరేటరీస్‌ రూ.21.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.17.2 కోట్లతో పోలిస్తే 26.7 శాతం పెరిగింది. ఆదాయం మా త్రం 1.1 శాతం తగ్గి రూ.259.3 కోట్ల నుంచి రూ.256.5 కోట్లకు చేరింది.
*రక్షణ,స్పేస్‌, అణు విద్యుదుత్పత్తి రంగాలకు సేవలందిస్తున్న ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌.. హైదరాబాద్‌కు చెందిన జీ పీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీని రూ.8.82 కోట్లకు సొంతం చేసుకోనుంది. ఇందుకు ఎంటీఏఆర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. జీ పీ ఏరోస్పే్‌సను సొంతం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గ్లోబల్‌ ఓఈఎంలతో ఆఫ్‌సెట్‌ పార్టనర్‌షి్‌పలకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందన్నారు.
*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.
* స్విస్‌ రీ గ్లోబల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ సెప్టెంబరులో హైదరాబాద్‌లో జీబీఎస్‌ కేంద్రాన్ని ప్రారంభించనుంది. అంతర్జాతీయంగా సొల్యూషన్లను అందించడానికి కంపెనీ డిజిటల్‌, డేటా, టెక్నాలజీ సామర్థ్యాలను ఈ కేంద్రం పెంచగలదని స్విస్‌ రీ గ్రూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ప్రవీణ లడ్వా తెలిపారు. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో గ్లోబల్‌ కేంద్రం ఉంది. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రాల కోసం నిపుణుల నియామక ప్రక్రియను చేపట్టినట్లు లడ్వా చెప్పారు.
*నేత్ర వైద్య సేవలందించే డాక్టర్‌ అగర్వాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఐ హాస్పిటల్స్‌ తాజాగా రూ.1,050 కోట్లు సమీకరించింది. టీపీజీ గ్రోత్‌తో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్‌ టెమాసెక్‌ నుంచి ఈ నిధులు సేకరించింది. కార్యకలాపాలను మ రింత విస్తరించడంతో పాటు కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లలో ఒకరైన ఏడీవీ పార్ట్‌నర్స్‌ నుంచి వాటా తిరిగి కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు అగర్వాల్‌ గ్రూప్‌ వెల్లడించింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్రూప్‌.. తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 105 నేత్ర వైద్య సేవల ఆసుపత్రులను నిర్వహిస్తోంది.
*ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ షేర్లు మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 7 శాతం తక్కువ ధరకు నమోదు కావడమే కాక తొలిరోజు 17 శాతం నష్టంతో ముగిశాయి. ఒక్కో షేర్‌ను రూ.542కు జారీ చేయగా బీఎస్‌ఈలో 6.64 శాతం నష్టంతో రూ.506 వద్ద లిస్టయింది. ఒక దశలో 22.32 శాతం నష్టపోయి రూ.421కు పడిపోయింది. చివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 16.95 శాతం నష్టంతో రూ.450.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 16.97 శాతం నష్టంతో రూ.450 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈలో 9.19 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 1.73 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ రూ.1,581 కోట్ల సమీకరణకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి స్పందన బాగా ఉండడంతో మొత్తం ఇష్యూకు 12.43 రెట్ల స్పందన లభించింది.
*ఫుడ్ టెక్ మేజర్, స్విగ్గీ మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్‌ సహా ప్రధాన మెట్రోల్లో కిరాణా సహా రోజువారీ నిత్యావసరాల డెలివరీ సర్వీస్, సూపర్ డైలీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. Supr Daily సీఈఓ/సహ వ్యవస్థాపకుడు, ఫణి కిషన్ పంపిన అంతర్గత మెయిల్ ప్రకారం… బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న సంస్థ ఆయా నగరాల్లో వ్యాపారాన్ని నిలిపివేసింది.
*వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) టెక్నాలజీ పయనీర్స్‌ విభాగంలో పాల్గొనేందుకు భారత్‌ నుంచి ఐదు స్టార్ట్‌పలు ఎంపిక కాగా వాటిలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పని చేస్తున్న హైదరాబాద్‌ స్టార్టప్‌ రీసైకల్‌ ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పరిష్కారానికి ఇన్నోవేటింగ్‌ సొల్యూషన్స్‌ కనిపెడుతున్న వృద్ధి దశలోని స్టార్ట్‌పలను టెక్నాలజీ పయనీర్స్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు అనుగుణంగా రీసైకల్‌ వ్యవస్థాపకుడు అభయ్‌ దేశ్‌పాండేను ఏడాది పొడవునా జరిగే డబ్ల్యూఈఎఫ్‌ కార్యకలాపాలు, ఈవెంట్లు, చర్చల్లో పాల్గొనేందుకు ఆహ్వానిస్తారు.
*ఏషియన్ పెయింట్స్ బోర్డు ఈక్విటీ షేర్‌కు రూ. 15.50 తుది డివిడెండ్ ను చెల్లించాలని సిఫార్సు చేసింది. కంపెనీ జూన్ 10, 2022 ను ‘రికార్డ్ డేట్‌’గా నిర్ణయించింది. వాటాదారులు ఆమోదించినపక్షంలో… జూలై 1 న, లేదా… ఆ తర్వాత చెల్లింపులు జరగనున్నాయి. ఇక… ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అమిత్ సింగల్ మాట్లాడుతూ… ‘ఇండస్ట్రియల్ కోటింగ్స్ వ్యాపారం ప్రొటెక్టివ్ కోటింగ్స్ సెగ్మెంట్‌లో నిరంతర వృద్ధితో మరో రౌండ్ దృఢమైన రెండంకెల ఆదాయ వృద్ధితో త్రైమాసికాన్ని ముగించింది’ అని పేర్కొన్నారు.
*గత ఆర్థిక సంవత్సరాని (2021-22)కి సువెన్‌ ఫార్మా రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (100ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దీంతోపాటు మరో 100 శాతం ప్రత్యేక డివిడెండ్‌ను కూడా వాటాదారులకు కంపెనీ చెల్లించనుంది. 2021-22 ఏడాది మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.91.66 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.83.11 కోట్లతో పోలిస్తే 10.28 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.262.46 కోట్ల నుంచి రూ.380.71 కోట్లకు పెరిగింది.