Fashion

పరిమళాల వ్యాపారి.. ఈషా తివారి!

పరిమళాల వ్యాపారి.. ఈషా తివారి!

హాయిగొలిపే సువాసనల గురించి చెప్పాలంటే కస్తూరి పరిమళమే ముందు వరుసలో ఉంటుంది. కస్తూరి, పునుగు, జవ్వాజి తరహా అత్తరు గుబాళింపులను ఒకప్పుడు చాలా మంది ఆస్వాదించేవారు. అనేకానేక కారణాలతో అత్తరు వాడకం బాగా తగ్గింది. అందుకే, భారత దేశపు సంప్రదాయ సువాసనలను యువతకు దగ్గర చేసేలా పర్‌ఫ్యూమ్‌ తరహాలోనే కొత్తరకం అత్తరుకు పరిమళాలు అద్దుతున్నది ఈషా తివారి నేతృత్వంలోని ‘కస్తూర్‌’ సంస్థ. పర్‌ఫ్యూమ్‌లు, డియోడరెంట్ల ప్రభావంతో అత్తరు మార్కెట్‌ పడిపోయింది. తలనొప్పి కలిగించేంత గాఢత కూడా దీనికో కారణం. ఇప్పటితరం తక్కువ సువాసనతో, ఎక్కువ సేపు నిలిచి ఉండే పరిమళాన్ని ఇష్టపడుతున్నది. మార్కెట్‌ ట్రెండ్‌ను బట్టి అత్తరు గాఢతలో మార్పులు చేసింది ‘కస్తూర్‌’.అత్తరు ప్రియుల నగరం హైదరాబాద్‌, అత్తరు రాజధాని కనౌజ్‌లోని సుగంధాల తయారీదారులతో కలిసి పనిచేస్తున్నారు ఈషా. వీరి కోసం వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశారు. ‘నిజానికి పర్‌ఫ్యూమ్‌లలో వాడే ఖరీదైన ఔద్‌తో పాటు రకరకాల ముడి పదార్థాలు భారత్‌ నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ వాటిని సరిగ్గా వాడుకోవడం తెలియక ప్రపంచ పర్‌ఫ్యూమ్‌ రంగంలో మనం వెనకబడి ఉన్నాం. కస్తూరి మృగం తన నాభి నుంచి వచ్చే సువాసనను కనిపెట్టలేక ఎక్కడి నుంచి వస్తుందో అని అడవంతా వెతికినట్టు… భారత్‌ కూడా తన ప్రత్యేకతను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నది. ప్రస్తుతం మేం చేస్తున్న పని వల్ల చాలామంది అత్తరు తయారీదారులకు మంచి జరుగుతున్నది’ అంటున్నారు ఈషా తివారి.