Devotional

రెండో రోజు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

రెండో రోజు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

1. రెండవ రోజు పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. నేడు అశ్వవాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీనివాసుడు చేరుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా పద్మావతి, శ్రీనివాసుల వివాహ కార్యక్రమం జరగనుంది. నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా.. మంగళవారం 61,090 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 26,316 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

2. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మంగళవారం పద్మావతీ దేవి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. ఆస్థానం అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

3ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉద యం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

4. కట్టుదిట్టమైన నిఘా ఉండే తిరుమల శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు సమయంలో ఓ వ్యక్తి నగదు అపహరించా డు. పోలీసుల కథనం మేరకు.. పరకామణి లెక్కింపు లో ఓ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న తిరుపతికి చెంది న వెంకటేశ్వర ప్రసాద్‌(59) ఈనెల 7న విధులకు హాజరై తిరిగి బయటకొచ్చే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా అండర్‌వేర్‌లో 10 రూ.2 వేల నోట్లను గుర్తించారు. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తప్పును ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశామని సీఐ జగన్మోహన్‌రెడ్డి వివరించారు. అలాగే శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి నగదు అపహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన వినోద్‌కుమార్‌, దేవేంద్ర ఈ నెల 8న శ్రీవారి దర్శనం తర్వాత హుండీ వద్దకు చేరుకుని ఎక్కువ మొత్తంలో కానుకలు ఎవరు వేస్తారో చూసి అవి పడేలోపే పట్టుకుని బయటకు వచ్చేశారు. దీనిపై టీటీడీ ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు.

5. బ్రహ్మంగారి పేరుచెబితే కాలజ్ఞానం గుర్తుకు వస్తుంది. ఆయన చెప్పిన తత్త్వాలు స్ఫురణకు వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ వింత జరిగినా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏనాడో చెప్పారుగా… అదే జరిగింది అనుకోవడం తెలుగునాట పరిపాటి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచనలన్నీ ప్రాథమికంగా కాలజ్ఞానాన్ని తెలుపుతూ, వాటి నడుమ వేదాంత తత్త్వాన్ని చెప్పడం వల్లనే అంతగా ప్రజాదరణ లభించింది.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వేదాంతానికి పునాది సంస్కరణవాదం. కాలజ్ఞాన ప్రబోధం చేయడం వెనుక ఆయన లక్ష్యం ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేయడమే. పదిహేడో శతాబ్దంలో జన్మించిన స్వామి బనగానపల్లె ప్రజలకు మహిమలు చూపి గురుఅవతారంగా కీర్తినందుకున్నారు. కలియుగంలో జరగబోయే ఎన్నో సంఘటనలు తెలిపారు. భక్తులను తరింపజేసే వీరనారాయణ మంత్రోపదేశం చేసి ‘వీరగురు’డయ్యారు. 1693లో జీవ సమాధిలోకి ప్రవేశించారు. బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి పొందిన ఆంధ్రప్రదేశ్ కడపజిల్లా కందిమల్లయ్య పల్లెలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంలో వైశాఖ శుద్ధ దశమినాడు ఆరాధనోత్సవం వైభవంగా జరుగుతుంది. ఏటా శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి 32 రోజుల దీక్షను ధరించిన భక్తులు ఆరాధన సమయంలో దీక్షావిరమణ చేస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.