NRI-NRT

విదేశీయానాల్లో విషాదాంతాలు!

విదేశీయానాల్లో విషాదాంతాలు!

ఎన్నెన్నో ఆశలతో విదేశాల్లో చదువు, కొలువుల కోసం వెళ్తున్న మన యువత.. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలను కొని తెచ్చుకొంటున్నది. ఏమరుపాటు చివరకు ప్రాణాలు తీస్తున్నది. విదేశాల్లో ఉన్న బిడ్డల ఉన్నతిపై కలలుకంటూ స్వదేశంలో ఉంటున్న తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా ఆవిరి అవుతున్నాయి. విగతజీవిగా తిరిగి రావడాన్ని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. రెండు రోజుల కిందట నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారానికి చెందిన క్రాంతికిరణ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన అఖిల్‌ జర్మనీలో ఓ నదిలో నీటమునిగి గల్లంతయ్యాడు.

**ప్రాణాలు తీస్తున్న సరదా
రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంతో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో డ్రైవింగ్‌ పద్ధతులు భిన్నంగా ఉంటాయి. అక్కడ కుడివైపు వాహనాలను నడపాలి. కుడి చేత్తోనే గేర్లు వేయాల్సి ఉంటుంది. విశాలమైన రోడ్లు కావడంతో వాహనాల సగటు వేగం 100 నుంచి 120 కేఎంపీహెచ్‌ ఉంటుంది. రెప్పపాటులోనే పదుల సంఖ్యలో వాహనాలు ఓవర్‌టేక్‌ చేస్తుంటాయి. స్వదేశంలో వాహనాలు నడిపిన తీరుకు విరుద్ధంగా ఉన్న పద్ధతులకు పూర్తిగా అలవాటు పడకముందే సరదగా టూర్లకు వెళ్లి హైవేలపై మనవాళ్లు ప్రమాదాలకు గురవుతున్నారు. అన్నింటికి మించి డ్రైవింగ్‌ పొజిషన్‌లో మార్పులతో మార్జిన్లు అర్థం చేసుకోలేకపోవడం..స్నేహితులతో ట్రిప్‌ కోసం బయటికి వచ్చినప్పుడు జోష్‌లో అతి వేగంగా వాహనాలు నడపడం, హైఎండ్‌ లగ్జరీ కార్లు ఇలా..ప్రతిదీ ప్రమాదానికి కారణం అవుతున్నది. ప్రధానంగా రోడ్లు దాటే సమయాల్లో అవగాహన లేమి ప్రమాదాలకు కారణం అవుతున్నది.సరదా కోసం, ఆటవిడుపు కోసం చాలా మంది స్నేహితులతో కలిసి నదులు, సరస్సుల సందర్శనకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి జలాశయాల లోతు, ప్రవాహ ఉధృతిపై అవగాహన లేక నీటమునిగి మృత్యువాత పడుతున్నారు. ఈత రాకపోయినా నీటిలోకి దిగి ప్రమాదాలను కొని తెచ్చుకొంటున్నారు. బీచ్‌లో స్నానాలకు వెళ్లి సముద్రపు అలలపై ఉధృతిని అంచనా వేయలేక నీటి మునిగి సజీవ సమాధి అవుతున్నారు.

**తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు చెప్పాలి
*విదేశాల్లో ఉండే పిల్లలతో తల్లిదండ్రులు నిత్యం మాట్లాడుతూ కొన్ని జాగ్రత్తలు సూచించడం వల్ల వారిలో అవి గుర్తుంటాయని సైకాలజీ నిపుణులు తెలిపారు.
*మన దగ్గర జరిగే ఘటనలు, వాటి పర్యవసానాలు, ప్రమాదాలతో ఆ కుటుంబాలు పడుతున్న వేదనని పిల్లల్లో రికార్డు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఎప్పుడైనా సరదాగా టూర్లకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉంటారని వివరించారు.
విదేశాల్లో టూర్లకు వెళ్తున్నప్పుడు ఆ మార్గం అవగాహన ఉండదు. పూర్తిగా గూగుల్‌ మ్యాపులపై ఆధారపడితే కొన్నిసార్లు దారి తప్పి ప్రమాదాలకు గురికావొచ్చు. పైగా హైవేలపై వాహనాల వేగం ఎక్కువ. అందుకే స్థానికులు నడిపే క్యాబ్‌లోనే వెళ్లాలని పిల్లలకు సూచించాలి.
*విదేశాల్లో ఉండే వారు మన దేశం, మన ప్రాంతానికి చెందిన వారితో సమూహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ సాయం అందేందుకు ఈ సంబంధాలు ఉపయోగడుతాయి.
విదేశాల్లో ఉంటున్న స్నేహితులంతా వాట్సాప్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకొని నిరంతరం టచ్‌లో ఉండాలి.
*అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి.
విహార యాత్రకు వెళ్లేముందు గతంలో అక్కడ జరిగిన ప్రమాదాలపై ఇంటర్‌నెట్‌లో శోధించి అవగాహన పెంచుకోవాలి.
స్థానికులతో లొల్లి పెట్టుకోకపోవడం ఉత్తమం. వారితో డ్రైవింగ్‌ ఇతర విషయాల్లో పోటీలకు దిగకపోవడం మంచిది.

***ఇటీవలి ప్రమాద ఘటనలు
*ఈ ఏడాది ఏప్రిల్‌ 23న అమెరికాలోని కార్బండేల్‌ టౌన్‌లో రోడ్డు ప్రమాదంలో మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్‌కు చెందిన వంశీకృష్ణ, ఖమ్మంకు చెందిన పవన్‌ స్వర్ణ మృతిచెందారు.
*2021 నవంబర్‌లో అమెరికాలోని ఎలికాన్‌సిటీలో రోడ్డు దాటుతూ నల్లగొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన మండలి శేఖర్‌ వాహనం ఢీకొని మృతిచెందాడు.
*2021 జూన్‌లో వర్జీనియా సమీపంలోని ఓ సరస్సుకు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయిప్రవీణ్‌కుమార్‌ స్నేహితులతో కలిసి వెళ్లాడు. బోటు షికారు చేస్తూ గల్లంతయ్యాడు.
*2021 జనవరిలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బైక్‌ డివైడర్‌కు ఢీకొనడంతో రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేటకు చెందిన రక్షిత మృతిచెందింది.
*2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ ఉత్తర తీరం వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన మహ్మద్‌ గౌసొద్దీన్‌, అతడి మేనల్లుడు జునైద్‌, రహత్‌లు ప్రమాదవశాత్తులో సముద్రంలో మునిగి చనిపోయారు.
*2017లో జర్మనీలో బీచ్‌లో స్నానానికి వెళ్లి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఉదయ నాగమణిశంకర్‌, మల్లికార్జున్‌ నీటముగిని చనిపోయారు.