Sports

అమ్మో ఇంత ఖరీదా!

Auto Draft

విరాట్‌కోహ్లీ రూ. 600 విలువ చేసే ఏవియాన్ సంస్థ నీళ్లనే తాగుతున్నాడన్నది హాట్ టాపిక్. ఎక్కడికెళ్లినా ఆ బ్రాండెడ్ నీళ్ల బాటిళ్లు ఉండాల్సిందే. రోజుకు మూడు నాలుగు బాటిళ్లు ఖాళీ చేసినా… రెండున్నర వేలు!
* మరో ఖరీదైన బ్రాండ్ ‘బెవర్లీ హిల్స్ 90 హెచ్‌టువో’. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ నీటిని తయారుచేసే ప్లాంట్ ఉంది. లీటర్ బాటిల్ ధర రూ.65 లక్షలు. లీటరు నీళ్లకు రూ.65లక్షలు వసూలు చేస్తున్నారంటే… ఇక ఆ నీళ్లతో నింపిన బాటిల్ ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ బాటిల్‌కు బంగారపు మూత ఉంటుంది. ఆ మూత మీద ఆరు వందలకుపైగా చిన్న చిన్న తెల్లటి వజ్రాలు పొదిగి ఉంటాయి. ఇంకో రెండు వందల నల్లటి వజ్రాలు అందంగా అతికించి ఉంటాయి. అంటే నీళ్లు తాగేసి మూత దాచుకోవాలన్నమాట. దాని ధరే కొన్ని లక్షలుంటుంది మరి. కాలిఫోర్నియాలోని పర్వత సానువుల్లోంచి జాలువారే నీటిని ఒడిసిపట్టి అదనంగా విటమిన్లు, ఖనిజాలు చేరుస్తారు.
* ప్రపంచంలో ఇంకా అనేక సంస్థలు ఖరీదైన నీటిని అమ్ముతున్నాయి. వాటిలో బ్లింగ్ హెచ్‌టువో, కోనా నిగరి, ఫిలికో, వీన్, టెన్ భౌజండ్ బీసీ ప్రముఖమైనవి.
* ‘కోనా నిగరి’ నీళ్ల బాటిళ్లకు జపాన్‌లో గిరాకీ ఎక్కువ. ముప్పావు లీటర్ ధర ఇరవై ఏడు వేల రూపాయల దాకా ఉంటుంది. హవాయి దగ్గర్లో ఉన్న పసిఫిక్ సముద్ర ప్రాంతంలో రెండువేల అడుగుల లోతు నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి, శుద్ధి చేసి ఖనిజాలు, లవణాలు చేర్చి అమ్ముతారు. ఈ నీళ్లని తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందనీ, చర్మానికి నిగారింపు వస్తుందనీ ప్రచారం.
* ‘బ్లింగ్ హెచ్‌టువో’ నీళ్ల బాటిల్ లీటర్ ధర రెండువేల ఆరువందల రూపాయల దాకా ఉంటుంది. దీన్ని కొనేది ఎటూ సంపన్నులే కాబట్టి, బాటిల్‌ను ఆకర్షణీయంగా తయారు చేశారు. స్వరోవ్‌స్కీ రాళ్లు పొదిగారు. అమెరికాలోని టెనెన్సీ ప్రాంతంలో సహజంగా ఏర్పడిన నీటి బుడగల నుంచి ఈ జలాన్ని సేకరిస్తారు.
* జపానీస్ బ్రాండ్ ‘ఫిలికో’, జపాన్‌లోని కోబె ప్రాంతం నుంచి ఈ సంస్థ నీటిని సేకరిస్తోంది. లీటర్ బాటిల్ ధర రూ.13 వేలు. నీళ్ల బాటిళ్లను ప్రేమికులకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చని ప్రచారం చేస్తోంది ఫిలికో. అందుకే బాటిళ్లను అందంగా.. ఓ గిఫ్ట్‌లా తీర్చిదిద్దుతోంది.
* ఫ్రాన్స్ ఫిజీ దీవుల్లో అరుదుగా లభించే స్వచ్ఛమైన నీటిని కొన్నేళ్ల క్రితం వేలం పాటలో అమ్మారు. ఆ జలాలు నింపిన 1.2 లీటర్ల బాటిల్ దాదాపు ముప్పై తొమ్మిది లక్షలకు అమ్ముడు పోయింది. బాటిల్‌ను కూడా 24 కారెట్ల బంగారంతో తయారు చేశారు. మనిషి ముఖాన్ని పోలి ఉంటుందది.
* మేడిన్ ముంబయ్… మన దగ్గరా ‘ఖరీదైన’ నీళ్లు దొరుకుతున్నాయ్. ముంబయి కేంద్రంగా పనిచేసే ఆహార సంస్థ మలాకి ‘మలాకి లగ్జరీ వాటర్’ పేరుతో నీళ్లను లీటర్ల లెక్కన అమ్ముతోంది. 375 మి.లీటర్ల నీళ్ల బాటిల్ ధర రూ. 600. ముంబయి, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఈ నీళ్లలో తినేందుకు వీలైన బంగారు రేకలు కలుపుతారు. ఆ రేకలు నీళ్లలో తేలుతూ కనిపిస్తాయి. స్వర్ణమయ జలాన్ని తాగడం వల్ల సమస్యలు తగ్గుతాయని అంటున్నారు మలాకి యజమానులు.