DailyDose

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

ప్రతి ఒక్కరి జీవితంలో పుస్తక నేస్తాలుండాలని గట్టిగా చెబుతాడాయన. దాదాపు అరవై ఏళ్ల నుంచి పుస్తకాలతోనే ఆయన సహవాసం. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ అనగానే సాహిత్యాభిమానులకు గుర్తుకొచ్చే షాపు ‘ప్రాచీన గ్రంథమాల’. అందులోనే ఉంటారు అందరూ నాగేశ్వరరావు అని పిలిచే నర్రా జగన్మోహనరావు(67). ఆయన పుస్తకాలకు స్నేహితుడైతే, పుస్తకాలు ఆయనకు ప్రియమైన నేస్తాలు.

జగన్మోహనరావు స్వగ్రామం గన్నవరం దగ్గర ఆతుకూరు. ఉపాధి కోసం విజయవాడ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దాదాపు ఏడు పదుల వయసు మీదపడినా ప్రతిరోజూ సైకిల్‌పైనే షాపుకు వస్తుంటారు. చిన్నతనం నుంచీ సినిమాలన్నా, ఆనాటి పాటలన్నా, తోలుబమ్మలాటలన్నా, నాటికలన్నా ఎంతో ఇష్టం. వీటిపై ఎక్కువ దృష్టి సారించడంతో చదువు మొదట్లోనే ఆగిపోయింది. చిన్నప్పుడు సినీ తారల బొమ్మల్ని కత్తిరించి ఇంట్లో గోడలపై అతికించుకునేవారు. పావలాకి సినిమా పాటల పుస్తకాలు కొనుక్కుని ఆ పాటల్లోని సాహిత్యపు మాధుర్యాన్ని ఆరాధించేవారు.

ఒకరోజు పాటల పుస్తకాలమ్మే ఒక వ్యక్తి జగన్మోహనరావుకి ఓ నవల ఇచ్చి చదివిమ్మన్నాడు. అలా మొదలైంది అతడి పఠనాసక్తి. కథలు, నవలలు చదవడం ఒక అలవాటుగా మారిపోయింది. అప్పటికి అందుబాట్లో ఉన్న ప్రపంచ సాహిత్యాన్నంతా చదివి, విజ్ఞానాన్ని పొందారాయన. ‘ఆ క్రమంలోనే పాత పుస్తకాల్ని సేకరించడం మొదలైంది. ఎన్ని పుస్తకాలు చదివినా సాహిత్యం ఒక తీరని దాహంగానే ఉంటుంది. పుస్తకాలు చదవటం ఒక మంచి వ్యసనం’ అంటూనే దానినే ఉపాధిగా కూడా మలుచుకున్నారు.
Whats-App-Image-2022-05-10-at-3-41-54-PM1
పాతికేళ్ల వయసులో ఇంటికి ఆసరాగా నిలబడాల్సిన తరుణం. ఉద్యోగం పొందేందుకు అతడి వద్ద ఎటువంటి డిగ్రీ లేదు. టీ, టిఫిన్‌ హోటల్‌ పెట్టినా అది ఎంతో కాలం సాగలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. అప్పటికే తన వద్ద రూ.50 వేల విలువ చేసే జాతీయ, అంతర్జాతీయ సాహిత్య పుస్తకాలు ఉన్నాయి. అతి కష్టమ్మీద వాటిని అమ్మేందుకు లెనిన్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ పుస్తక షాపు యజమాని వయసు మీదపడి వ్యాపారం చేయలేని స్థితిలో జగన్మోహనరావు సహాయం కోరాడు. అలా 1998లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని… 22 ఏళ్లుగా ఆ విజ్ఞాన బాంఢాగారాన్ని కొనసాగిస్తున్నాడు.

చిత్తు కాగితాలు ఏరుకునే వారితోనూ, పాత పేపర్లూ, పుస్తకాలను తూకం లెక్కన కొనేవారితోనూ ఆయనకు మంచి పరిచయం. వారికి సాహిత్య పుస్తకాలు తారసపడితే ఈయన దగ్గరకు తీసుకొచ్చారు. వాటిని విలువను బట్టి నాగేశ్వరరావు కొంటాడు. అలా సేకరించిన పుస్తకాలకు వాటి విలువను బట్టి మరమ్మతులు, అవసరమైతే బైండింగ్‌ కూడా చేయించి షాపులో అమ్మకానికి పెడతాడు.

అయితే.. ఈ పుస్తకాలను ఎవరికి పడితే వారికి ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చదు. పుస్తకం ఏపాటిది, ఎప్పటిది అనేదాని కంటే, అందులోని సమాచారాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికే అందజేస్తాడు. ఆయన నడుపుతున్న షాపులో అరుదైన పాత పుస్తకాల కోసం ఎందరో సినీ రచయితలు, పత్రికా రచయితలు చరిత్ర, పాత కథలు, నాటికలు, నవలల కోసం వస్తుంటారని ఆనందంగా చెబుతున్నాడు.

ఈ షాపులో 150 ఏళ్లనాటి పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఒకప్పుడు ముద్రించి మళ్లీ ముద్రణలు పొందని పుస్తకాలూ ఉంటాయి. జాతక చింతామణి (1882), చంపూ భాగవతం (1874), మైత్రి సాత్వ (1929) బ్రిటిష్‌ చరిత్ర (1938), గోపాల్‌ మిత్తల్‌ (1958), మన తెలుగు (1948) వంటి పుస్తకాలు ఆయన వద్ద ఇప్పుడు ఎంతో పదిలంగా ఉన్నాయి. వాటిని ప్రేమించేవారు తారసపడినప్పుడు మాత్రమే అవి ఆ షాపు నుంచి బయటికి పంపుతాడు.

అలాంటి అరుదైన ముద్రణలను ఊరికే గాలికి వదిలేయకూడదని, ప్రత్యేక భద్రతా పద్ధతులు పాటించి భవిష్య తరాల కోసం దాచిపెట్టాలని ఆయన రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ఒక పత్రాన్ని అందించారు. ఆయన వద్ద ఇప్పుడు రూ.10 లక్షల విలువ చేసే పాత పుస్తకాలున్నాయి. వాటిలో ఉన్న విజ్ఞానం అలా వెల కట్టలేనిదని ఎంతో ప్రేమగా చెబుతున్నారు జగన్మోహనరావు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లోని పాత పుస్తకాలు చాలానే ఇప్పుడూ ఉన్నాయి.

చాలామంది ఇంట్లో పుస్తకాలు పెట్టుకుని దుమ్ము దులుపుతుంటారు. అడ్డుగా అనిపిస్తే తూకానికి వేస్తుంటారు. అందులోని సమాచారానికి ఏమాత్రం విలువ ఇవ్వరు. అటువంటి వారిపై ఎంతో కోపం వస్తుందంటున్నాడు జగన్మోహనరావు.

Whats-App-Image-2022-05-10-at-3-41-54-PM2
ఒక తరం పెద్దలు సేకరించిన పుస్తకాలు తమ ఇంట్లో అడ్డుగా ఉన్నాయని భావించేవారు వాటిని తమకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. ”ఎందుకంటే, వాటిని ప్రేమించే మనుషులు ఇంకా ఉన్నారు. వారు మా షాపుకు వస్తుంటారు. ఒక విలువైన పుస్తకం ఆ విలువ తెలిసిన మనిషికి దగ్గరకు వెళ్లటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కదా..” అంటాడు. షాపుకు వచ్చే వారి అభిప్రాయాల్ని సేకరించి వారి మాటల్లోనే ‘పుస్తక ప్రియుల సేకరణానుభూతి’ అనే పేరుతో ఓ పుస్తకం ప్రచురించాడు.

2010లో ఆయన కృషికి గుర్తింపుగా గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యగార్ల పురస్కారాన్ని అందుకున్నాడు. ఇటీవల ప్రముఖ రచయితలు అతని ఆత్మకథను రాసేందుకు ముందుకొచ్చారు.

ఈ ‘ప్రాచీన గ్రంథమాల’కు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, వైజాగ్‌ నుంచి వచ్చి మరీ పుస్తకాల్ని కొనుక్కుని వెళ్తుంటారట..! అంతేకాదు, ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకూ ఏ పుస్తకాలు అయినా విజయవాడలో ఎక్కడ దొరుకుతాయో ఈయన ఇట్టే చెప్పగలడు. విజయవాడలోని ఏ మూల ఎక్కడ పుస్తక ప్రదర్శనలు జరిగినా, రచయితల కార్యక్రమాలు జరిగినా వెళతాడు. కొత్త సాహిత్యం ఏం వచ్చిందో పరిశీలించి సేకరిస్తారు.

పిల్లలకు పుస్తకం విలువ చెప్పాలి : జగన్మోహనరావు
ఇప్పుడు ఇంటర్నెట్‌లో సమాచారం లభించడంతో సామాన్యులు మా షాపుకు రావడం తగ్గింది. ఒకప్పుడు యువత ప్రపంచ అనువాద సాహిత్యాన్ని, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, యద్ధనపూడి సులోచనాదేవి, చలం, గోర్కీ వంటి వారివి ఎక్కువగా చదివేవారు. ఇప్పుడు ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. యువత స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం దీనికొక ప్రధాన కారణం. కానీ, ఇది సరైంది కాదు. పుస్తకం ఒక గొప్ప నేస్తం. దాని విలువను చిన్నప్పటినుంచీ తల్లిదండ్రలు, ఉపాధ్యాయులు, ఇతర పెద్దలూ పిల్లలకు తెలియజెప్పాలి.