Devotional

తిరుమలలో జూన్‌ 30 వరకు… ఆర్జిత సేవలు రద్దు – TNI ఆధ్యాత్మికం

తిరుమలలో జూన్‌ 30 వరకు… ఆర్జిత సేవలు రద్దు – TNI ఆధ్యాత్మికం

1. తిరుమలలో ఆర్జిత సేవలు జూన్‌ 30 వరకు రద్దు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. డయల్‌ యువర్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… భక్తుల సందేశాలు, సూచనలు ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు. తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా అష్టాదళం, తిరుప్పాడ ఆర్జిత సేవలను జూన్‌ 30 వరకు తాత్కాలికంగా రద్దు చేశామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్ ఈవో కార్యక్రమం జరగడంతో భక్తుల సందేశాలు, సూచనలను ధర్మారెడ్డి ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయంలో పటిష్టమైన భద్రత ఉందని గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదని అన్నారు. శ్రీవారి హుండీలో చోరీ జరిగితే విజిలెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటారని తెలిపారు.

2. ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతీ పరిణయోత్సవాలు గురువారం ముగిశాయి. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఎదుర్కోలు, పూలచెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ వేడుకలు ముగిసిన తర్వాత కొలువు జరిగింది. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

3. Yadagiriguttaలో ఏకాదశి లక్ష పుష్పార్చనలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో గర్భాలయంలోని స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం కాగా, అర్చకులు, వేదపండితులు లక్షపుష్పార్చన నిర్వహించారు.

4. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం అద్భుతంగా ఉందని కంచి కామకోటి మఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం పంచనారసింహుల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు శంకర విజయేంద్ర సరస్వ తి స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.గర్భాలయంలో స్వయంభువులు, బంగారు ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఆలయ ఆచార్యులతో పండిత గోష్టి నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో ఆలయ నిర్మాణ విశేషాలపై చర్చించారు.

5. నువ్వలరేవులో సామూహిక వివాహాలు.. ఒకేసారి ఒక్కటైన 43 జంటలు!
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గ్రామ సంప్రదాయం ప్రకారం గురువారం రాత్రి 10.11 గంటలకు సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. ఒకేసారి 43 జంటలు ఒక్కటయ్యాయి. ఉదయం బృందావతి ఆలయంలో పూజలు చేసిన తర్వాత, పెళ్లి బాజాల మధ్య కాబోయే వధూవరులు మంగళస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం వధువులను సంప్రదాయ పెళ్లి దుస్తులతో అలంకరించి వారి వారి ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోబెట్టి బంధువులు కరెన్సీ నోట్లను తగిలిస్తూ అభినందనలు తెలిపారు. రాత్రి 10.11 గంటలకు ఒకే లగ్నంలో పెళ్లి కుమారులంతా తాళి కట్టారు. అనంతరం వధువులు తమ ఇళ్లలో పంచలోహాలతో తయారు చేసిన సంప్రదాయ పొడులతో కూడిన పొట్లాలను పెళ్లి కుమారుల మెడల్లో మూడు ముళ్లేసి కట్టడంతో వివాహ తంతు ముగిసింది.

6. ద్వారకాతిరుమలలో చినవెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవరోజు ధన్వంతరి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి తిరువీధిసేవ నిర్వహించనున్నారు. చిన వెంకన్నను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు

7. కేదార్‌నాథ్‌కు భ‌క్తుల తాకిడి.. భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న ఐటీబీపీ
డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌కు భ‌క్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్య‌లో కేదారీశ్వ‌రుడి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఎగ‌బ‌డుతున్నారు. అయితే ఆల‌యం వ‌ద్ద‌ ప్ర‌త్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా ఉండేందుకు తాత్కాలిక క్యూలైన్ నిర్మించారు. ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న భ‌క్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఐటీబీపీ సిబ్బంది విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. కేదార్‌నాథ్ వ‌ద్ద డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ బృందాల‌ను కూడా ఏర్పాటు చేశారు. కేదార్‌నాథ్ ఆల‌య మార్గంలో అనేక ప్రాంతాల వ‌ద్ద వైద్య బృందాలు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో సేవ‌లందిస్తున్నాయి

8. పుణ్యక్షేత్రాలకు టూరిజం కళ..
ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వాటిని సందర్శించేందుకు ఆసక్తి కనపరుస్తున్న వారి సంఖ్య 35–40 శాతం మేర పెరిగింది. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తమ పోర్టల్, యాప్‌లలో ప్రయాణికులు చేసే ఎంక్వైరీల నెలలవారీ ధోరణులను విశ్లేషించి ఇక్సిగో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలకు పర్యటనలపై ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో కట్రా (83 శాతం), తిరుపతి (73 శాతం), హరిద్వార్‌ (36 శాతం), రిషికేష్‌ (38 శాతం శాతం) రామేశ్వరం (34 శాతం) ఆగ్రా (29 శాతం), ప్రయాగ్‌రాజ్‌ (22 శాతం) వారణాసి (14 శాతం) మొదలైనవి ఉన్నాయి.
**ఐఆర్‌సీటీసీ తాజాగా రామాయణ యాత్ర రైలు టూర్, బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ రైళ్లు, జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర, ఢిల్లీ–కాట్రా మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదలైనవి నిర్వహిస్తుండటం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగేందుకు దోహదపడుతోంది. అయితే సంఖ్యాపరంగా మాత్రం ఎంత మంది వెడుతున్నారన్నది మాత్రం సర్వేలో వెల్లడి కాలేదు. బూస్టర్‌ డోస్‌లు అందుబాటులోకి రావడం కూడా పర్యాటకుల్లో.. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లలో ప్రయాణాలపై ధీమా పెరిగేందుకు దోహదపడుతున్నట్లు ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో అలోక్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు.
**కన్ఫర్మ్‌టికెట్‌లోనూ అదే ధోరణి..
టికెట్ల సెర్చి ఇంజిన్‌ కన్ఫర్మ్‌టికెట్‌ నిర్వహించిన అధ్యయనంలో కూడా దాదాపు ఇలాంటి ధోరణులే వెల్లడయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం తమ యాప్, వెబ్‌సైట్లలో ఎంక్వైరీలు 35–40 శాతం మేర పెరిగినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్‌ కుమార్‌ కొత్తా తెలిపారు. రామేశ్వరం విషయంలో ఎంక్వైరీలు 47 శాతం పెరిగాయి. కట్రా (వైష్ణోదేవి)కి సంబంధించి 36 శాతం, ప్రయాగ్‌రాజ్‌.. వారణాసికి చెరి 8 శాతం, హరిద్వార్‌ (30 శాతం), రిషికేష్‌ (29 శాతం), తిరుపతి (7 శాతం) మేర ఎంక్వైరీలు పెరిగినట్లు దినేష్‌ వివరించారు. ఆధ్యాత్మిక అనుభూతి కోసమే కాకుండా యోగా, ఆయుర్వేద స్పాలు మొదలైన వాటితో ప్రశాంతత, పునరుత్తేజం పొందేందుకు కూడా పర్యాటకులు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.